- కమిషనర్ పి.ఆర్ మనోహర్
ప్రజాశక్తి - బి.కొత్తకోట : పట్టణ పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు బి.కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ పి.ఆర్ మనోహర్ పేర్కొన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలోని జ్యోతి చౌక్,ఆర్టీసీ బస్టాండ్, రంగసముద్రం రోడ్డు, హట్కో కాలనీ, తదితర ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఒక భాగంగా మురుగునీటి కాలువలు శుభ్రం చేసి,చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ పి.ఆర్ మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం పట్టణంలో గతంతో పోల్చుకుంటే పారిశుద్ధ్యం బాగా మెరుగు పడిందన్నారు. పట్టణ ప్రజలు సైతం పరిసరాల పరిశుభ్రత పై అవగాహన పెంచుకొని నగర పంచాయతీ సిబ్బందికి సహకరిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల పరిశుభ్రత కోసం క్లీన్ ఆంధ్రప్రదేశ్, జగనన్న స్వచ్ఛ సంకల్పం వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు.ఈ కార్యక్రమాలను పట్టణంలో నిర్విరామంగా కొనసాగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేలో బి.కొత్తకోట పట్టణానికి మెరుగైన ర్యాంకు తీసుకురావడమే తమ లక్ష్యమని కమిషనర్ వెల్లడించారు. పరిశుభ్రత పనులు ఎప్పటికప్పుడు అకౌంట్ ఆఫీసర్ బి.రమాదేవి అందుబాటులో ఉంటూ పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.