Oct 13,2022 06:42

ఇంగ్లీషు స్థానంలో హిందీ భాషను దేశమంతటా అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై మరో దాడిని ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని పార్లమెంటు అధికారభాషా కమిటీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించిన నివేదికలో చేసిన ప్రతిపాదనలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. దేశంలో హిందీని కామన్‌ లాంగ్వేజిగా పేర్కొనడంతో పాటు అన్ని కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు, సాంకేతిక, సాంకేతికేతర విద్యాసంస్థల్లో హిందీ లేదా స్థానిక భాషల్లోనే బోధన సాగాలని ప్రతిపాదించింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో కూడా హిందీకే ప్రాధాన్యత ఇవ్వాలని, ఇంగ్లీష్‌ నైపుణ్య పరీక్షను రద్దు చేయాలని సూచించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీనే వాడాలని పేర్కొంది. రాష్ట్రాలతో ఏమాత్రం సంప్రదించకుండా ఏకపక్షంగా చేసిన ఈ ప్రతిపాదనలతో ఫెడరల్‌ వ్యవస్థ చిధ్రమౌతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో హిందీ రాష్ట్రాలతో పోలిస్తే హిందీ యేతర రాష్ట్రాల వారికి సమాన అవకాశాలు మృగ్యమవుతాయి. దీంతో అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల వంటి అంశాలు ప్రశ్నార్థకంగా మారుతాయి. హిందీ చదవడం, మాట్లాడటం, రాయడం రాని ప్రజలు దేశంలో రెండవ తరగతి పౌరులుగా మారిపోయే ప్రమాదమూ ఉంది. రాష్ట్రాల హక్కులను, ప్రజల జీవితాలను అంత తీవ్రంగా ప్రభావితం చేసే అంశం కాబట్టే మోడీ ప్రభుత్వ ప్రతిపాదనలపై అనేక రాష్ట్రాలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించాయి. తమిళనాడు సి.ఎం స్టాలిన్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తెలంగాణ ఐ.టి, పరిశ్రమలు శాఖ మంత్రి కెటిఆర్‌లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విడివిడిగా లేఖలు రాశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని కోరారు.
దేశ జనాభాలో 55 శాతానికన్నా ఎక్కువ మందికి హిందీ మాతృభాష కాదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌ అధికారికంగా గుర్తించిన 22 భాషల్లో హిందీ కూడా ఒకటి. అంతకుమించి ఎటువంటి ప్రత్యేకతను రాజ్యాంగం ఇవ్వనప్పుడు దేశంలో కామన్‌ లాంగ్వేజి హోదా హిందీకి ఎప్పుడు వచ్చిందో కేంద్ర ప్రభుత్వమే చెప్పాలి. 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న భాషలు కాకుండా, 10 వేల మందికి తక్కువ కాకుండా ప్రజలు మాట్లాడే 100కు పైగా నాన్‌ షెడ్యూల్డ్‌ భాషలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా వివిధ రకాల సమూహాలకు 1,800 రకాల మాతృభాషలున్నాయని అంచనా! ఇవి కాకుండా గుర్తింపునకు నోచుకోని భాషలు, ప్రాంతాలను బట్టి మారే యాసలు ఎన్నో! 2011 లెక్కల ప్రకారం 1961 నుండి దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య 30.39 శాతం నుండి 43.63 శాతానికి పెరిగింది. అదే సమయంలో ఇతర భాషలు దెబ్బతిన్నాయి. దేశమంతా హిందీని రుద్దాలన్న కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ఇతర భాషలకూ శరాఘాతంగా మారనుంది. రాష్ట్రాలతో నామమాత్రంగా కూడా చర్చించని కేంద్ర ప్రభుత్వం హిందీని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యతని నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదం.
భిన్న భాషలు, ప్రాంతాలు, మతాల మధ్య విరిసే ఈ ఐక్యతే మన దేశ బలం. అనేక క్లిష్ట సమయాల్లో ఈ విషయం రుజువైంది కూడా! కానీ, ఈ భిన్నత్వంలో ఏకత్వమే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి గిట్టదు. భిన్న మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఐక్యంగా ఉంటే వారి ఉన్మాద ఎత్తుగడలు పారవు. ఒకే దేశం..ఒక మతం.. ఒకే చట్టం అంటూ వారిచ్చే నినాదాలు నిజానికి ప్రజలను చీల్చడానికే! హిందీని రుద్దాలన్న తాజా ప్రతిపాదన కూడా 'హిందీ, హిందూ, హిందూస్థాన్‌' అన్న ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఆచరణలోకి తీసుకువచ్చే కుట్రలో భాగమే! దీంతో పాటు హిందీ రాష్ట్రాల్లో ఓటుబ్యాంకును పదిలం చేసుకోవాలన్న వ్యూహం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మభ్య పెట్టే నినాదాల వెనుక ఉన్న అసలు లక్ష్యాలను ప్రజానీకం అర్ధం చేసుకోవాలి. ప్రజా ప్రయోజనాలను కబళిస్తూ, రాష్ట్రాల హక్కులపై చేస్తున్న దాడులను ప్రతిఘటించడానికి సిద్ధపడాలి. ఎల్‌కేజి నుండి ఇంగ్లీష్‌ లోనే బోధన సాగించి తీరుతామంటూ పట్టుబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వ హిందీ రుద్దే ప్రతిపాదనలపై తన వైఖరిని స్పష్టం చేయాలి.