''ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకించేవారు ఆ ముసుగులో అంటరానితనాన్ని పాటిస్తున్నారు''
''కొంతమంది ప్రీాప్రైమరీ విద్యను ప్రవేశ పెట్టడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు''
''వీరి మానసిక స్థితిలో మార్పు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను''
ఇవి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు తాడేపల్లిలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో అన్న మాటలు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఈ మాటలు అన్నాక దానిగురించి ఎంతో కొంత ముచ్చటించుకోకపోతే ఆ ముఖ్యమంత్రి పదవిని మనం గౌరవించినట్టు ఎలా అవుతుంది?
ముందుగా వచ్చే ప్రశ్న...అంటరానితనానికీ, ఇంగ్లీషు చదువుకీ ఉన్న లింకు ఏమిటి? డా|| అంబేద్కర్ చదివినంత చదువు, అందునా ఇంగ్లీషు చదువు ఈ దేశంలో అగ్ర కులాలవారితో సహా చాలామంది చదవలేదు. అది అందరికీ సాధ్యపడదు కూడా. అయితే అంత చదువు చదివిన బాబాసాహెబ్‌కూ జీవించివున్న కాలంలోను, మరణానంతరం కూడా అంటరానితనం, వివక్ష తప్పలేదు కదా? ఎంత క్షోభ అనుభవించి వుండకపోతే తానే ప్రధాన రూపకర్తగా రచించిన రాజ్యాంగాన్ని సైతం తగలబెట్టండి అని డా|| అంబేద్కర్ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు? చాలా పెద్ద చదువులు చదివే, అదీ ఇంగ్లీషు మీడియంలో చదివే సెంట్రల్ యూనివర్సిటీల్లో ఎందుకు దళిత స్కాలర్ల పట్ల వివక్ష చూపుతున్నారు? రోహిత్ వేముల ఉదంతం మరిచిపోగలమా? ఆ వివక్షత చూపుతున్నవారూ పేద్ద ఇంగ్లీషు చదువులు చదివినవారే కదా?
కొందరు సామాజిక కార్యకర్తలు, ఉద్యమనేతలు కూడా ముఖ్యమంత్రి వాదనలను గట్టిగా బలపరుస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం ఉంటేనే దళిత, గిరిజన, బలహీన వర్గాల పిల్లలు ఇంగ్లీషులో చదువుకోగలుగుతారని, అది లేనందున ప్రస్తుతం అలా ఇంగ్లీషులో చదివే అవకాశాలు కేవలం అగ్రకులాలవారికి, పెత్తందారుల, సంపన్నుల పిల్లలకి మాత్రమే పరిమితం అవుతున్నాయని, ఇది సామాజిక వివక్షతే అని వారంటున్నారు.
నిజానికి మన రాష్ట్రంలో ప్రాథమిక విద్యలో 56 శాతం ప్రైవేటు బడుల్లోనే సాగుతోంది. ఇంగ్లీషు మీడియం లేని ప్రైవేటు స్కూలు ఒక్కటంటే ఒక్కటీ మనకు కనపడదు. ఇక మిగిలిన 44 శాతం ప్రభుత్వ స్కూళ్ళలో కూడా హైస్కూలు స్థాయిలో ఇప్పటికే ఇంగ్లీషు మీడియం తరగతులు నడుస్తున్నాయి. ఇక మిగిలినవి ప్రాథమిక పాఠశాలలే. ఇప్పుడు వాటిలోనూ ప్రవేశపెడుతున్నారు. దీనిని మాత్రం వ్యతిరేకించడం దేనికి? తల్లిదండ్రులలో కూడా అధికులు తమ పిల్లలు ఇంగ్లీషు మీడియం లోనే చదవాలని కోరుకుంటున్నారు కదా?
ఇక్కడ చర్చ ఇంగ్లీషు భాషను నేర్చుకోవడమా? వద్దా? అన్నది కానే కాదు. మన దేశంలో ఇంగ్లీషు భాషను ఎప్పటి నుంచో బోధిస్తూనే వున్నారు. ఇంగ్లీషు భాషను అందరూ తప్పకుండా నేర్చుకోవడం మంచిది. ఇంకా స్పానిష్, మాండారిన్ (చైనీయుల భాష), ఫ్రెంచి వంటి భాషలను నేర్చుకుంటే చాలా మంచిది. అయితే నేర్చుకోవడం అనేది ఏ మాధ్యమంలో అన్నది ఇక్కడ ప్రశ్న. రేపు పిల్లలకి స్కూలులో గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రాలు ఏ భాషా మాధ్యమంలో బోధించాలి? అన్నదే ప్రశ్న. జవాబు స్పష్టం. ఏ భాషా మాధ్యమంలో బోధిస్తే పిల్లలు సులువుగా, సమగ్రంగా నేర్చుకుంటారో ఆ మాధ్యమంలో బోధించాలి. ఒక విషయాన్ని అర్ధం అయేలా వివరించేటప్పుడు ఉపాధ్యాయుడు ఆ పిల్లలు పెరిగే వాతావరణానికి, వారి సంస్కృతికి, రోజువారీ కార్యకలాపాలకి సంబంధించిన ఉదాహరణలతో నేర్పాలి. అప్పుడే వారికి బాగా అర్ధమౌతుంది. అలా నేర్పడం ఒక్క మాతృభాషా మాధ్యమం లోనే సాధ్యం. అందుకే ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, అందరికీ విద్యా హక్కు కోసం ఉద్యమించిన దార్శనికుడు జ్యోతిబా ఫూలే మాతృభాషలో బోధన ప్రాధాన్యత గురించి నొక్కి చెప్పారు (అదే విషయాన్ని టాగూర్, గాంధీజీ కూడా చెప్పారు). మరి ఆయన కూడా ముసుగేసుకుని అంటరానితనాన్ని పాటించినట్టా? మన విద్యా హక్కు చట్టం ప్రాథమిక విద్యను మాతృభాష లోనే జరపాలని నిర్దేశించింది. దానిని బేఖాతరు చేసి ప్రైవేటు స్కూళ్ళలో కేవలం ఇంగ్లీషు మీడియం మాత్రమే కొనసాగిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవడం పోయి ప్రభుత్వమే ఆ తప్పు చేస్తే ఎలా?
మన మెదడులో వచ్చే ఆలోచనలు మొదట మన మాతృభాష లోనే వస్తాయి. స్వతంత్రంగా ఆలోచించడం, సృజనాత్మకతాఇవన్నీ మన మాతృభాషతో ముడిపడి వుంటాయి. ఈ మాటలు ముఖ్యమంత్రి గారు బాగా ప్రేమించే ఇంగ్లీషు భాషకు పుట్టిల్లు అయిన బ్రిటిష్ దేశపు వారే చెప్తున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదివితే ఇంగ్లీషు బాగా వచ్చేస్తుంది అన్న అభిప్రాయం పూర్తిగా నిరాధారం అని బ్రిటిష్ కౌన్సిల్ నిర్వహించిన ఒక అధ్యయనం 2017లో తేల్చి చెప్పింది. తొలిదశ నుండీ ఇంగ్లీషు మీడియం లోనే చదవడం వలన ఆసియా, ఆఫ్రికా ఖండాలలో పిల్లలకు విషయాలను గ్రహించగల శక్తి బాగా దెబ్బతిన్నది అని ఆ అధ్యయనం తెలిపింది. మన కళ్ళెదురుగానే లక్షల సంఖ్యలో రాష్ట్రంలోని యువత చదువు పూర్తి చేసుకున్నా తమకున్న విషయ పరిజ్ఞానాన్ని ఇతరులకు తెలియజెప్పే నైపుణ్యం (కమ్యూనికేషన్ స్కిల్స్) లేక ఉద్యోగాలలో ఎంపిక కాక ఇబ్బందులు పడుతున్నారు. ఇంతకు ముందు తరాలలో ఈ సమస్య రాలేదెందుకని?
కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ కొరవడడం మాత్రమే కాదు. చాలామంది ఇంట్లో పెద్దల్ని గాని, బైట సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని గాని ప్రశ్నించలేకపోతున్నారు. ప్రశ్నించాలంటే స్వంత ఆలోచన ఉండాలి. చిన్నప్పటి నుండీ కేవలం ఇంగ్లీషులోనే నేర్చుకున్నవారిలో ఆ శక్తి కొరవడుతోంది. తాము పెద్దయినతర్వాత ఏమి కావాలనుకుంటున్నారో కాలేజీ స్థాయిలో కూడా చెప్పలేకపోతున్నారు. తెలియని ఒంటరితనం వారిని ఆవరిస్తోంది. అంతకంతకూ ఆ ల్యాప్‌టాప్‌లకు, స్మార్ట్‌ఫోన్ లకు అతుక్కుపోతూ ఈ సమాజంతో సంబంధంలేనివారిగా బతుకుతున్నారు. ప్రశ్నించలేనివారు తమ హక్కుల కోసం ఎలా పోరాడతారు? అలా హక్కుల కోసం పోరాడే నవతరం సైన్యం లేకుండా ఈ అగ్రవర్ణ ఆధిపత్య, మనువాద ఆధిపత్య సమాజంలో అణగారిన తరగతులకు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక న్యాయం సిద్ధిస్తుందా? దళితులందరూ చదువుకోవాలని, చైతన్యం పొంది సంఘటితపడి హక్కులను పోరాడి సాధించుకోవాలని బాబాసాహెబ్ చెప్పారు. అంతేకాని లేత వయస్సులోనే ఆలోచనలను వికసించనివ్వకుండా, కనీసం ప్రశ్నించే శక్తి కూడా కోల్పోయే పరభాషా మాధ్యమం లోనే చదవాలని ఆయన ఎక్కడైనా చెప్పారా?
ఇక ప్రీాప్రైమరీ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టడం గురించి కూడా చెప్పాలి. అంగన్‌వాడీలను ప్రీాప్రైమరీ కేంద్రాలుగా, నర్సరీలు గా పెంపొందించాలని చాలా సంవత్సరాల నుండీ డిమాండు ఉంది. అయితే ఇప్పుడు బిజెపి రూపొందించిన నూతన విద్యా విధానంలో ఆ నర్సరీలతోబాటు ప్రాథమిక విద్యలో భాగమైన 1,2 తరగతులను కూడా కలిపివేసింది. ఇది తప్పు. 1వ తరగతి నుండి 5వ తరగతి మధ్య పిల్ల వికాసానికి తగిన అనువైన విద్యావిధానం ఇదివరకే రూపొందించారు. దానిని పక్కనబెట్టి ఆ ప్రాథమిక విద్యలో నుంచి మొదటి రెండు తరగతులను తీసుకువచ్చి ప్రీాప్రైమరీలో కలపడం సరికాదు. ప్రాథమిక విద్యను బోధించేది శిక్షణ పొందిన టీచర్లు. ఇప్పుడు ఈ ప్రీాప్రైమరీలలో బోధించబోయేది ఎవరు? వారి సామర్ధ్యం ఏమిటి? విత్తు నాటే సమయంలో రైతు ఎంత జాగ్రత్త తీసుకుంటాడో అంత జాగ్రత్త ప్రాథమిక విద్య విషయంలో ప్రభుత్వం తీసుకోవాలి. కాని కాషాయీకరణ, కార్పొరేటీకరణ కుట్రతో బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని ఏ మాత్రమూ ప్రశ్నించకుండా (కేంద్రాన్ని ప్రశ్నించే శక్తి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య పూర్తిగా కోల్పోయినట్టుంది. మరి ఈ ప్రభుత్వం ఏ మాధ్యమంలో ఏ కొత్త చదువులు చదువుతోందో?) దేశంలో అందరికన్నా ముందుగా అమలు చేయడానికి పూనుకోడం సరైనదేనా? ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్ధి సంఘాలు, విద్యావేత్తలు, బోధనా రంగ నిపుణులు ఏం చెప్తున్నారో వినిపించుకోవద్దా?
విమర్శలను, సూచనలను, సలహాలను వినిపించుకోవడం విజ్ఞులకు చాలా అవసరం అని సుమతీ శతకంలో ఎప్పుడో చెప్పేరు. విమర్శలను స్వీకరించలేనివారు ప్రశ్నించే శక్తిని, ప్రశ్నించేవారిని సహించే శక్తిని చాలా త్వరగా కోల్పోతారు. అది వారికే మంచిది కాదు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే కదా. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లేననుకుంటే ఎలా?










