Aug 27,2020 07:50


నూతన విద్యా విధానాన్ని స్వాగతించడంతో పాటు, దాని అమలుకు జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న తొందర చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్లను వైఎస్‌ఆర్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చాలన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశలో తొలి అడుగు వేసింది. బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఇంకా విధానపరమైన నిర్ణయాలు తీసుకోని నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే విద్యా రంగ ప్రయోజనాల కన్నా ఇతర అంశాలేవో ఉన్నాయన్న అనుమానాలు కలుగక మానదు. నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యను పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకుపోతోంది. ఇది భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం! కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరకరమైన అంశంగా కనపడలేదెందుకనో?
విద్యారంగం కోసం చేస్తున్న ఖర్చులో 75 నుండి 80 శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగనుంది. కానీ, పెత్తనం మాత్రం కేంద్ర ప్రభుత్వానిది! పాఠ్యాంశాల నుండి విద్యాసంస్థల అనుమతులు, ఉపాధ్యాయుల నియామకం, బదిలీల వంటి వాటిని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వమే నియంత్రించనుంది. ఇది రాష్ట్రాల హక్కులపై నేరుగా దాడి చేయడమే కదా! అయినా కేంద్రం అడుగులకే మడుగులత్తడానికి సిద్ధపడటం వెనుక మతలబేమిటో? ఇంగ్లీషు మీడియంలో చదివినంత మాత్రాన ఆంగ్లం స్పష్టంగా వస్తుందనడానికి ఆధారాలు లేవంటూ 2017లో బ్రిటిష్‌ కౌన్సిల్‌ చేసిన అధ్యయనం స్పష్టంగా తేల్చి, మాతృభాష లోనే విద్యార్థి చదవాలని సిఫార్సు చేసిన తరువాత కూడా తెలుగును చంపి ఇంగ్లీషును రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 'ఒకే దేశం..ఒకే భాష' అనే సంఘపరివార్‌ ఆలోచనను ఎలా ప్రతిఘటిస్తుంది? 'భారతీయ భాషలన్నీ సంస్కృతం నుండి పుట్టినవే' అంటూ కేంద్రం విద్యా విధానంలో ప్రకటించినా, తెలుగుతో పాటు ఇతర ద్రావిడ భాషలను విస్మరించినా పెదవి విప్పకపోవడం అందుకేనా? ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవంపై దెబ్బ తీయడమే కదా!
స్థానిక అవసరాలకు అనుగుణంగా పాఠశాల విద్యలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రస్తుతమున్న అవకాశాన్ని నూతన విద్యావిధానం తిరస్కరిస్తోంది. ప్రాథమిక స్థాయిలోనే ఇంత నిరంకుశంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విద్యలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తుందని ఎలా అనుకుంటాం? రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల గొంతు నులమడానికి కేంద్రం సిద్ధపడింది. ఫలితంగా, రాష్ట్రాల ప్రయోజనాలకు ఎంతో కొంత ఉపయోగపడిన విశ్వవిద్యాలయాలు కేంద్రం జేబు సంస్థలుగా మారనున్నాయి. వీటికి పాలక మండళ్లను నియమించే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పరిస్థితి ఇలా ఉంటే, మున్సిపాల్టీలు, జిల్లా పరిషత్‌లు నిర్వహించే విద్యాసంస్థల పరిస్థితి ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా! రిజర్వేషన్ల గురించి బిజెపి, సంఘపరివార్‌ వైఖరేమిటో అందరికీ తెలుసు. తాజా పత్రంలో వాటి ఊసే లేదు. అయినా, మౌనం వహించడం, లౌకిక తత్వం గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించకపోయినా 'ఆహా..ఓహో..' అనడం దేనికి సంకేతమో? రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బాటనే నడవనుందనా? వేయి ఆలోచనలు వికసింపచేసి, ఛాందసవాదాన్ని, మాఢత్వాన్ని పటాపంచలు చేసేలా విద్యావిధానం ఉండాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం యువతరాన్ని మొద్దురాతిచిప్పలుగా, నూతి లోని కప్పలుగా, కట్టుబానిసలుగా మార్చేలా దీనిని రూపొందించింది. విద్య వ్యాపారీకరణను, అసమానతలను ఈ విధానం మరింతగా పెంచుతోంది. కారణాలేవైనా ఇంత కీలకమైన విషయంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజీ పడితే భావితరాలు క్షమించవు!