సిఆర్‌డిఎ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాల ద్వారా విశాఖకు పాలనా రాజధానిని తరలించాలనే జగన్ ప్రభుత్వ ప్రయత్నం అనివార్యంగా ప్రతిష్టంభనలో పడింది. ఈ విషయమై విచారిస్తున్న ఎ.పి హైకోర్టు విధించిన యథాతథ స్థితిని ఎత్తివేయడానికి అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఆ మరురోజు హైకోర్టులో విచారణను సెప్టెంబరు 21కి వాయిదా వేస్తూ యథాతథ స్థితిని పొడిగించింది. ప్రభుత్వం తన రాజకీయ కోణంలో వ్యూహాత్మకంగా మూడు రాజధానుల విధానం ముందుకు తెచ్చివుండొచ్చుగాని ఉన్నత న్యాయస్థానాలకు అదేమీ అత్యవసర సమస్య కాదు. చట్టసభలు ఆమోదించి గవర్నర్ గెజట్ విడుదల చేశారు గనక అది పాలనా పరిధిలోది అన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. శాసన ప్రక్రియ కోర్టుల పరిధిలో వుండదు గాని శాసనాల చెల్లుబాటును సమీక్షించే అధికారం ఉన్నత న్యాయస్థానాలకు వుంటుంది. అందులోనూ వేలాది మంది అమరావతి రైతుల సమస్య ఇమిడి వుంది గనక మానవీయ కోణం కూడా వుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం తన విధానాన్ని కోర్టులో నెగ్గించుకోవలసి వుంటుంది. వరుసగా చాలా కేసులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయనే అసహనంతో ఈ హక్కును కాదంటే కుదరదు. రాజ్యాంగం లోని నాల్గవ అధ్యాయం అయిదవ భాగంలో ఆర్టికిల్ 214 ప్రకారం హైకోర్టులు కూడా రాజ్యాంగ తీర్పులు ఇస్తాయి. కనుక సుప్రీంకోర్టు ప్రతి సందర్భంలోనూ జోక్యం చేసుకుంటుందని ఆశించకూడదు. అవసరమనుకుంటేనే సుప్రీంకోర్టు సమీక్షించి తుది తీర్పు ఇవ్వొచ్చు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు రాజధాని తరలింపుపై స్టేటస్‌కో విధించింది. ఇది విధానాన్ని మార్చే ఆదేశం కాదు. తక్కిన ప్రభుత్వ కార్యకలాపాలనూ ఆపదు. భౌతికంగా అమరావతి నుంచి మూడు కీలక పాలనా కేంద్రాలను తరలించకుండా చేయడమే జరుగుతుంది.
స్టేటస్ కో అంటే స్టే కాదు గనక అది సమస్యే కానట్టు పాలక పక్ష నాయకులు కొందరు మాట్లాడారు. అలా అంటూనే సుప్రీంలో పిటిషన్ వేశారు. అక్కడ పిటిషన్ విచారణ క్రమంలో మొదట సి.జె ఎస్.ఎ బాబ్డే కుమార్తె రుక్మిణి, తర్వాత రోహింటన్ నారీమన్ తండ్రి ఫాలీ వి నారీమన్ కారణంగా రెండు ధర్మాసనాలు మారాయి. ఇది నాట్ బిఫోర్ నాటకమని వైసీపీ నేతలు వాదించారు. ధర్మాసనాల మార్పు వల్ల ఆలస్యం అయివుండొచ్చు గాని నిజంగానే సీనియర్ నారీమన్ రైతుల తరపున హాజరైనారు. హైకోర్టు లోతుగా పరిశీలించి చెప్పిన తర్వాత అవసరమైతే అప్పుడు చూస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు విచారణ ముగించడానికి గడువు విధించలేమంటూ త్వరగా ముగించమని మాత్రం చెబుతామని సుప్రీంకోర్టు నిర్దేశించడం సాధారణమని, దీనివల్ల రాజధాని తరలింపు ఆలస్యమవుతుందని, అన్నీ నిలిచిపోతాయని ప్రభుత్వ న్యాయవాది చేసిన వాదననూ తోసిపుచ్చింది. ఒకవేళ తుది తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తే అప్పుడు తరలింపు ఖర్చు ఎవరు భరిస్తారని గతంలో ఒకసారి హైకోర్టు వేసిన ప్రశ్ననే తనూ అడిగింది. దీనికి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వ సమాధానం లేకపోవడం ఒకటైతే ఇందులో ఇతర సంకేతాలు కూడా గమనించవలసి వుంటుంది.
ఈ పరిస్థితులలో రాజధాని సమస్యలో హైకోర్టు అభిప్రాయాలే ప్రాథమికం కాబోతున్నాయి. వాద ప్రతివాదుల కౌంటర్లు తీసుకోవడం, పరిశీలించడం, ప్రత్యక్ష వాదోపవాదాలు ఇవన్నీ సమయం తీసుకుంటాయి. కరోనా పరిస్థితులే గాక ఇతర అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయి. భౌతిక దూరం పాటిస్తే ప్రత్యక్ష విచారణ చేపట్టగలమని హైకోర్టు ధర్మాసనం చెప్పింది. రాజధానిపై మొత్తం 75 పైగా పిటిషన్లు దాఖలైనాయి. మొన్నటి విచారణలో ప్రభుత్వం ఒక కౌంటర్ దాఖలు చేయగా ఇదే అన్నిటికీ సమాధానమైతే ఆ మాటతో సహా ఇతర వివరాలతో అనుబంధం సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విశాఖలో గెస్ట్‌హౌస్ నిర్మాణం యోచన కూడా కోర్టులో వేస్తే దానిపైనా అభిప్రాయం అడిగింది. కొంతమంది రైతుల పిటిషన్లలో పేర్కొన్న ప్రతివాదుల కింద ముఖ్యమంత్రికీ మంత్రులకూ వివిధ రాజకీయ పార్టీలకు కూడా కోర్టు నోటీసులిచ్చింది. వీటిపై ఎవరేమి చెబుతారు, మాటల మార్పులు, మల్లగుల్లాలు ఎలా వుంటాయనేది చూడాల్సిందే. ఈలోగా ప్రభుత్వం ఏదైనా చర్యలకు పాల్పడితే హైకోర్టు స్పందించవచ్చు.
ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొద్ది మాసాల పాటు నిరీక్షించడం తప్పనిసరి. ఇంతకాలం పాటు రాష్ట్రంలో రాజకీయ చర్చ, పాలనా వ్యవస్థ దీనిచుట్టే పరిభ్రమిస్తూ వుండటం అవాంఛనీయమే గాక నష్టదాయకం కూడా. దేశంలోనూ రాష్ట్రంలోనూ ఆర్థిక సంక్షోభం, పనులు పోవడం, జీతాల లేమి, రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యలు అన్నిటినీ మించి కరోనా విలయతాండవం తీవ్ర సవాలుగా వున్నాయి. ఇలాంటి తరుణంలో మొత్తం దృష్టి ప్రజల సమస్యలపై కేంద్రీకరించేబదులు రాజధాని రభస, వైసీపీ టిడిపి వికృత వివాదాలు, ఎడతెగని కేసులు నిత్యకృత్యంగా మారాయి. రాజకీయ కుట్ర, మీడియా కుట్ర, లీగల్ కుట్ర, సామాజిక కుట్ర ఇలా ప్రభుత్వం ఎటు చూసినా కుట్రలే చూస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి కూడా తమను అంతమొందించడానికి అధికార పార్టీ కుట్రలు పన్నుతున్నదనే ఆరోపి స్తున్నది. ప్రభుత్వం కోర్టులపై కుట్ర పన్నిందని, న్యాయమూర్తుల ఫోన్లపై నిఘా వేసిందని మీడియాలో కథనాలు రావడం, కోర్టు ముందు పిల్స్‌గా దాఖలవడం చూస్తున్నాం. వివిధ స్థాయిల్లోని మాజీ న్యాయ మూర్తులు, సంబంధిత నిపుణులు అటూ ఇటూ కొసకు లాగడం, సంభాషణలు పట్టుపడటం, వాటిపై మళ్లీ వివాదాలు మొత్తం వాతావరణాన్ని గందరగోళ పరుస్తున్నాయి. సుప్రీంకోర్టులో ఒకవైపు ప్రశాంత్ భూషణ్ కేసు సందర్భంగా న్యాయవ్యవస్థ తీరుతెన్నులపైనే ప్రచండ వాదోపవాదాలకూ ఎ.పి లో పరిస్థితికీ చాలా తేడా వుంది. సమస్యలు వేరు, ధోరణులూ వేరు. హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జె.కె మహేశ్వరి బాహ్య శక్తుల జోక్యం అవసరం లేదని ఆగష్టు 15న పతాకావిష్కరణలో వ్యాఖ్యానించవలసిన పరిస్థితి ఇందుకో నిదర్శనం. విధానపరమైన తప్పులు సమీక్షించి చక్కదిద్దడం, కొట్టివేయడం తప్ప ఒక ప్రభుత్వ ఉనికిని కోర్టులు ఏదో చేయడం రాజ్యాంగంలో వుండదు. సమస్యలపై కోర్టులకు వెళ్లే హక్కును గౌరవించలేకపోవడం, ప్రజా వ్యతిరేక అంశాలలోనూ ముందే వివాదాస్పదంగా వున్న విషయాలలోనూ ప్రతికూల ఉత్తర్వులు వస్తే స్వీకరించ లేకపోవడం పాలకుల పొరబాటు. ఇళ్ల స్థలాలు, జీతాల కోత, రంగులు, పోలీసుల పోకడలు, దళితులపై దాడులు ఇలాంటి విషయాల్లో కోర్టుల జోక్యం సరైందే. పోలీసులు, అధికారుల తీరుపై ఆఖరుకు ముఖ్యమంత్రి జగన్, డిజిపి గౌతం సవాంగ్ కూడా హెచ్చరించవలసిన స్థితి వచ్చిందని మర్చిపోరాదు. అయితే కొందరు టిడిపి నేతలు, కొన్ని మీడియా సంస్థలు నిరంతరం వాటి చుట్టే తిప్పడం కూడా విధానపరమైన ఇతర అంశాలను మరుగుపరుస్తున్నది. ఈ మధ్యలో బిజెపి ద్వంద్వ నాటకం గురించి వేరే చెప్పనవసరం లేదు. కాని టిడిపి వైసీపీ ఆ వూసే ఎత్తుకోకపోగా జనసేన దాంతోనే జట్టు కట్టింది.
రాజధాని తరలింపు ఆలోచన విరమించి అక్కడే కొనసాగించాలని వైసీపీ మినహా అన్ని పార్టీలూ సంఘాలూ కోరుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ కాదనడం లేదు. నిజానికి కర్నూలులో హైకోర్టు ఏర్పాటును అందరూ ఆమోదించినా అది తక్షణాంశం కాదన్నట్టు ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టులో చెప్పడం ఆశ్చర్యకరం. ఏకాభిప్రాయం వున్న హైకోర్టు విషయమూ ఇప్పుడు పదేపదే ప్రస్తావనకు రావడంలో రాజకీయం ఆసక్తికరం. దీన్ని విశాఖకు వ్యతిరేకమనో ప్రాంతాల విభేదమనో చిత్రించడం మరో తప్పిదం. వాస్తవానికి రైతులకు న్యాయం చేయాలనే విషయంలో భిన్నాభిప్రాయమే లేదు. అయినా అమరావతి ఆందోళనలో రైతులే లేరని ప్రభుత్వ పెద్దలు విపరీత వాదన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకపోగా పోలీసులను ప్రయోగించారు. అమరావతిలో టిడిపి తప్పిదాలపై విచారణ అంటున్నారు గనక ఇప్పుడు జరగాల్సింది ఏమిటనేది ముఖ్యం. మొన్న వారు వార్షిక కౌలు ఆలస్యమైందంటూ సిఆర్‌డిఎ కార్యాలయానికి బయిలుదేరితే అరెస్టులు చేసింది. భూ సమీకరణకు ముందు ప్లాట్ల విభజన తర్వాత భూములు అమ్ముకున్న వారంటూ సర్కారు విడుదల చేసిన లెక్కల్లో కూడా వేలమంది రైతులున్నారు. రూ.158 కోట్ల కౌలు, తొమ్మిది కోట్ల నెలవారీ పెన్షన్ విడుదల చేసినట్టు ప్రకటించారంటే రైతుల సంఖ్య తెలుస్తుంది. కనుక ఈ ప్రతిష్టంభనను ఇలాగే సాగదీస్తూ అప్పుల పాలైన రాష్ట్రాన్ని మరింత అధ్వాన్నం చేసేబదులు సంబంధిత రైతులతో చర్చలు జరపడం, రాజధానిపై అన్ని పక్షాలతో ప్రజాస్వామికంగా సంప్రదించడం ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగ పరమైన అంశాలను కోర్టులు చూసుకోవడం ఎలాగూ అనివార్యం. మీడియా విషయంలోనూ ఒకవైపు సమస్యలపై సమతుల్యత పాటించడం అవసరం కాగా మరోవైపు ప్రభుత్వం సంయమనంతో భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించడం అవసరం. అంతేగాని కుట్రలు కుత్సితాల ఆరోపణలు శ్రుతిమించితే మొదటికే మోసం తప్పదు.
- తెలకపల్లి రవి










