
ఇండియన్ ఐడల్.. దీని గురించి పరిచయం అవసరం లేదు. గాయకులుగా వెలిగిపోవాలని కలలు కంటున్న నవతరం గాయకులకు ఇదో సువర్ణావకాశాల వేదిక. క్రికెట్‌లో వరల్డ్ కప్ గెలిస్తే ఎంత సంతోషపడతారో.. ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిస్తే సింగర్స్ కూడా అంతకన్నా ఎక్కువ ఆనందపడతారు. 2004 నుంచి జరుగుతున్న ఈ షో 11 సీజన్స్ పూర్తిచేసుకుంది. ఇందులో మన తెలుగోళ్లు సత్తా చాటుతూనే ఉన్నారు. ఇప్పటికే రెండు సీజన్లలో మనోళ్లు టైటిల్ గెలిచి, దక్షిణాది వాళ్లేమీ తక్కువ కాదని నిరూపించారు. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ 12 టైటిల్ పోరులో ఇద్దరు తెలుగమ్మాయిలు పాటతో అలరిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ వినూత్నంగానూ పాటలు పాడుతూ వీక్షకులను, జడ్జీలను ఆకట్టుకుంటున్నారు. వారే ఆంధ్రాకు చెందిన షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల. ఇండియన్ ఐడల్‌లో తెలుగుతేజాల మీదే ఈ కథనం..
నవంబర్ 28వ తేదీ, 2020 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో సోనీ టీవీలో ఇండియన్ ఐడల్ ప్రసారమవుతున్న సంగతి సంగీత ప్రియులకు తెలిసిందే. ఇండియన్ ఐడల్‌లో టైటిల్ కొట్టడమంటే ఆషామాషీ కాదు. కంటెస్టెంట్ ఫైనల్‌కు వెళ్లినా ఎవరు గెలుస్తారనేది చివరి వరకూ చెప్పలేం. ఎందుకంటే విజేతను ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఏ కంటెస్టెంట్ బాగా ప్రతిభ చూపారన్నది ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ప్రేక్షకులు మద్దతు తెలపాల్సి ఉంటుంది. కంటెస్టెంట్‌కు పాటలు పాడటంలో ప్రతిభ ప్రదర్శించడం ఎంత ముఖ్యమో.. సెల్‌ఫోన్ల ద్వారా ఎస్‌ఎంఎస్‌లు రావడమూ అంతే ముఖ్యం. నిజానికి ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్తరాదివారికే గెలుపు అవకాశాలు మెండు. ఎందుకంటే ఆ ప్రాంత వీక్షకులకు ఓటింగ్ చేసే అలవాటు ఎక్కువగా ఉండటమే. కాబట్టి అది కంటెస్టెంట్‌కు ప్లస్ పాయింట్. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటింగ్ చేయడానికి దక్షిణాది వారు పెద్దగా ఆసక్తి చూపరు. దాంతో దక్షిణాదివారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎంత బాగా రాణించినా ఈ ఒక్క కారణంతో వెనుకబడిపోయే ప్రమాదం ఉంటోంది. కాబట్టే మనవాళ్ల గెలుపు అంత సులువు కాదు. కానీ అసాధ్యమైతే కాదని గతంలో టైటిల్ గెలిచిన శ్రీరామచంద్ర, రేవంత్ నిరూపించారు. ఈసారి ఇండియన్ ఐడల్ 12 టైటిల్ విజేత మన తెలుగమ్మాయే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అలా విజేతగా నిలవాలని మనమూ ఆశిద్దాం.
మనదేశ భవిష్యత్ రాక్‌స్టార్ !
పదేళ్ల క్రితం 'జీ తెలుగు'లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమంలో తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖప్రియ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో చిన్నారి గాయనిగా శ్రోతలను ఆకట్టుకున్న ఆమె కొంతకాలం పాటు టీవీ షోలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వర్ధమాన గాయనిగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఏకంగా ఇండియన్ ఐడల్ సీజన్ 12లో కంటెస్టెంట్ టాపర్‌గా రాణిస్తున్నారు.
షణ్ముఖప్రియ తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాస్‌కుమార్ శాస్త్రీయ సంగీతంలో అధ్యాపకులు. మూడేళ్ల వయస్సులో గడియారం అలారం ట్యూన్‌ను షణ్ముఖ తిరిగి పాడటం చూసిన ఆమె తండ్రి ఆశ్చర్యపోయారట. అప్పటి నుంచి తల్లిదండ్రులే తొలి గురువులుగా ఆమె సంగీత ప్రయాణం మొదలైంది. అలా చిన్న వయస్సులోనే సంగీత సంద్రాన్ని అలవోకగా ఈదేస్తూ పెరిగారామె. శాస్త్రీయం, పాశ్చాత్యం, రాక్, పాప్, జానపదం.. ఏ పాటైనా షణ్ముఖప్రియ గొంతులో ఇట్టే ప్రవహిస్తుంది.. శ్రోతల్ని అలరిస్తుంది. ఇప్పుడు ఆమె గానం ఇండియన్ ఐడల్ సీజన్ 12లో సందడి చేస్తోంది.
ప్రఖ్యాత గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంలాంటి ఎందరో ప్రముఖులు షణ్ముఖ గానానికి ముగ్ధులై, అభినందనలు కురిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. 'భారతదేశ భవిష్యత్ రాక్‌స్టార్' అంటూ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ప్రశంసించారంటే ఆమె గాత్ర మాధుర్యాన్ని, అందులోని విలక్షణతను అర్థంచేసుకోవచ్చు. బుల్లితెర గాయనిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వేలాది ప్రదర్శనలిస్తూ... అనేకమంది అభిమానుల్ని సంపాదించుకున్నారామె. శాస్త్రీయ సంగీతంలోని ఓ రాగాన్నే తన పేరుగా మార్చుకున్న షణ్ముక వర్ధమాన గాయనిగా రాణిస్తూనే, సీఏ చదవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగుతున్నారు.
లేడీ కిషోర్‌కుమార్
ఇండియన్ ఐడల్‌లాంటి రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే కష్టం. అలాంటిది టాప్ 13లో నిలవడమంటే మామూలు విషయం కాదు. ఒక ఎపిసోడ్‌లో కిషోర్‌కుమార్ తనయుడు అమిత్‌కుమార్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన ముందు షణ్ముఖప్రియ ఆర్.డి. బర్మన్ కంపోజ్ చేసిన 'దమ్ మారో దమ్' పాట పాడారు. కిషోర్‌కుమార్ చేసే యోడలింగ్ చేశారామె. 'యోడలే.. యోడలే... యోడలే...' అని పాడేదే యోడలింగ్ అంటారు. ఐడల్ వేదికపై యోడలింగ్ చేసిన మొదటి అమ్మాయి షణ్ముఖ. ఐదు నిమిషాలపాటు స్టేజ్‌పై ఆమె యోడలింగ్ చేయడం విశేషం. దీంతో అమిత్‌కుమార్ ఆశ్చర్యానికి గురయ్యారు. 'మా నాన్నకి రబ్దీ తినడం చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా తీసి రబ్దీ తిన్నారు. ముంబైలోని ఓ షాప్ నుంచి ఈ రబ్దీని కొనేవారు. ఈ రోజు అదే షాప్ నుంచి నేను తీసుకొచ్చిన రబ్దీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం తప్పక ఉంటుంది' అని ప్రశంసిస్తూ ఆమెకు రబ్దీని తినిపించారు.
అయిదేళ్ళ వయసులోనే జీ టీవీ 'సరిగమప లిటిల్ ఛాంప్స్' పోటీలో విజేత అయిన షణ్ముఖప్రియ ఆ తరువాత మాటీవీ 'సూపర్ సింగర్'లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ 'లిటిల్ సూపర్‌స్టార్' పోటీలో టైటిల్ గెలుచుకున్నారు. జీ టీవీ హిందీ 'సరిగమప లిటిల్ ఛాంప్'లో రన్నరప్‌గా నిలిచారు. తమిళ 'సూపర్ సింగర్ జూనియర్ -3'లో 'స్టార్ ఆఫ్ ఏపీ'గా, ఈటీవీ 'పాడుతా తీయగా'లో రన్నరప్‌గా, మా టీవీ 'సూపర్ సింగర్-9' టైటిల్ విజేతగా... ఇలా తన ప్రతిభను అనేక వేదికల మీద ఘనంగా చాటుకున్నారామె. మరోవైపు హిందీలో చిన్నారుల పాత్రలకు గాత్రదానం చేశారామె. ఇండియన్ ఐడల్‌లో న్యాయనిర్ణేతలను మెప్పించి... 'గోల్డెన్ మైక్'ను తన సొంతం చేసుకొని, స్పాట్ సెలక్షన్ సాధించారు. 'పోటీలో ఉన్నాననే ఆలోచనా ప్రభావం నా పాట మీద పడకుండా చూసుకుంటాను. నా పాట మీదే దృ ష్టి పెడతాను' అంటున్నారు పద్దెనిమిదేళ్ళ షణ్ముఖప్రియ.
సంగీతం వైపే మొగ్గాను..
కేవలం మూడున్నర సంవత్సరాల వయస్సులోనే శిరీష భాగవతులకు పాటలంటే ఆసక్తి అనే విషయం కుటుంబసభ్యులు గుర్తించారు. నిజానికి ఆమె తల్లిదండ్రులు బాల, మూర్తి సత్యనారాయణ ప్రొఫెషనల్ సింగర్స్ కాదు. కానీ ఆమె తాతగారు నాటకాలు, పద్యాలు రాసేవారు. ఆయనే చిన్నప్పటి నుంచి శిరీషకు, వాళ్ల అక్కకు పాటలు, పద్యాలు పాడటం నేర్పేవారు. పదేళ్ల వయస్సు నుంచే మంచి గాయని కావడం కోసం ఎంతో కృషి చేశారామె. 2004లో తొలిసారిగా 'పాడాలని ఉంది' అనే రియాలిటీ షోలో పాల్గొన్నారు. 'సూపర్ సింగర్ 6'లో పాల్గొన్న తర్వాతనే ఆమెకంటూ కొద్దోగొప్పొ గుర్తింపు వచ్చింది. 'ఒకానొక సమయంలో సంగీతమా? ఉద్యోగమా? అనే సందిగ్ధంలో పడ్డాను. ఎమ్‌ఎన్‌సి కంపెనీలో మంచి జాబ్ వచ్చింది. అప్పుడు సంగీతం వైపే మొగ్గు చూపాను. అందుకు నా కుటుంబసభ్యులు సహకరించారు. దక్షిణాది రియాలిటీ షోలలో పాల్గొన్నా రావాల్సినంత గుర్తింపు రాలేదు' అంటారు శిరీష.
విజయ్ టీవీలో 2018 లో ప్రసారమైన తమిళ భాషా రియాలిటీ షో 'సూపర్ సింగర్ 6'లో ఆమె పాల్గొన్నారు. అక్కడే ఆమె గాత్ర మాధుర్యంతో ఎ.ఆర్. రెహమాన్ దృష్టిలో పడ్డారు. అమెజాన్ ప్రైమ్ సిరీస్ ''హార్మొనీ విత్ ఎ.ఆర్.రెహమాన్'' కోసం ఎఆర్ రెహమాన్‌తో కలిసి ''మన్ మౌజ్ మెయిన్'' పాటను కంపోజ్ చేసే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. ఇంకా తెలుగు చిత్రం 'విజిల్'లో ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన 'మానిని', తమిళ్‌లో బిగెల్ సినిమాలో 'మాథరే' అనే పాటలను పాడారు శిరీష. తర్వాత ఎ.ఆర్. రెహమాన్‌తో కలిసి అనేకచోట్ల వేదికను పంచుకునే అరుదైన అవకాశం దక్కించుకున్నారామె.
ఆ కోరిక తీరకుండానే
'నాకు చిన్నప్పటి నుంచి బాలు గారితో కలిసి ఒక్కపాటైనా స్టేజి మీద పాడాలనే కోరిక ఉండేది. కొద్దికాలం క్రితమే బాలుగారితో కలిసి స్టేజిపై తమిళ్‌లో ఒక పాట పాడే అవకాశం వచ్చింది. లాక్‌డౌన్‌కు ముందు ఆ పాట రిహార్సల్స్ కూడా చేశాను. కానీ కోవిడ్ వల్ల ఆ పోగ్రాం అనుకోకుండా వాయిదా పడింది. తర్వాత ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే. బాలుగారితో పాట పాడాలనే నా కోరిక తీరకుండానే ఆయన మనందరికీ దూరమయ్యారు. ఒక్కసారిగా నా సంగీత ప్రయాణం ముగిసినట్లు అనిపించింది. కోలుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇండియన్ ఐడల్ ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు బాలుగారిని గుర్తు చేసుకుంటూ ఒక పాట పాడాను. ఎందుకంటే సంగీతంలో నా జర్నీ సార్‌తోనే మొదలైంది' అంటోంది శిరీష.
ఇండియన్ ఐడల్ ఫస్ట్ ఎపిసోడ్ డిసెంబర్ 20న ప్రసారమైంది. అందులో శిరీష 'జియా జలే' పాటతో జడ్జీలను ఆకట్టుకుంది. జడ్జీలు ఆమె గాత్రాన్ని చూసి ముగ్దులై, శిరీష గాత్రం పరిశ్రమకు ఎంతో అవసరమని కితాబిచ్చారు. 'ఇండియన్ ఐడల్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీసు ఏమీ చేయాల్సిన పని లేదు. మేం బస చేసిన చోట తినటానికి వెళ్లిన దగ్గరా ఎవరో ఒకరు మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఇదో సంగీత ప్రపంచంలా ఉంటుంది. మాకు స్పెషల్ కోచ్‌లు ఉంటారు. గ్రాండ్ ఫినాలే అప్పుడు ఫ్లూట్ నవీన్ గారితో కలిసి ఒక ఫ్లూట్ మూమెంట్‌ను నోటితో పాడాను. అది ఇప్పటివరకూ ఎవరూ పాడలేదు. జడ్జ్జీలు ప్రతి ఎపిసోడ్‌లోనూ నన్ను కొత్తగా చూస్తున్నారు. వారిచ్చే ప్రశంసలు నామీద నాకు మరింత నమ్మకం కలిగేలా చేస్తున్నాయి. ఐడల్ నా సంగీత ప్రయాణానికి కొత్త ప్రారంభం' అంటున్నారు శిరీష. తాను ప్రకృతి ప్రేమికురాలినని, జర్నీ చేయడమంటే తనకెంతో ఇష్టమని చెబుతున్నారు 25 ఏళ్ల శిరీష.

జాతీయ స్థాయిలో స్టార్‌డమ్
శ్రీరామచంద్ర అప్పుడప్పుడే తెలుగులో ఎదుగుతున్న నవతరం గాయకుడు. ఇండియన్ ఐడల్ 5వ సీజన్ పోటీలలో పాల్గొని, విజయం సాధించడంతో జాతీయ స్థాయిలో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. స్లోగా సాగే యుగళగీతాలు పాడటంలో అతనిది ప్రత్యేక శైలి. శ్రీరామ్ గాన మాధుర్యానికి డ్రీమ్ గర్ల్ హేమమాలిని కూడా ఫిదా అయ్యారు. అతనితో తెలుగులో మాట్లాడి తన దక్షిణాది అభిమానాన్ని అప్పట్లో ఆమె చాటుకున్నారు. ఎలాంటి సంగీత అనుభవం లేని కుటుంబమైనప్పటికీ రామచంద్రకు చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ప్రాణం. మామయ్య సి.వెంకటాచలం మెగాస్టార్స్ పేరుతో ఆర్కెస్ట్రా నిర్వహించేవారు. మొదట ఆయన శిష్యరికంలోనే కచేరీలు చేసేవారు శ్రీరామ. తర్వాత కర్ణాటక సంగీతం, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. 2005 నుంచే తెలుగులో పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ ఐడల్‌లో పాల్గొన్న సమయంలో ప్రత్యేక అతిథులుగా వచ్చిన పలువురు ఆయన పాటలకు మంత్రముగ్ధులై ప్రశంసిస్తే, మరికొందరు ఆయనతో కలసి స్టెప్పులేశారు. ఇంకొందరు తమకు ఇష్టమైన పాటను పాడించుకున్నారు. సంజయ్దత్, జాన్ అబ్రహాం, బిపాసా బసు, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రాలాంటి వారు శ్రీరామ్ గాత్రానికి జేజేలు పలికారు. అనూమాలిక్, సంగీత దర్శకుడు సలీం మర్చంట్‌లాంటి వారి నుంచి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ఆయన పాడిన పాటలెన్నో విశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఎన్నో విజయవంతమైన సినిమా పాటలు శ్రీరామచంద్ర ఖాతాలో చేరిపోయాయి. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. శ్రీరామచంద్ర గాయకుడిగానే కాకుండా నటుడిగానూ తన సత్తా చాటుకున్నారు. 'శ్రీ జగద్గురు ఆది శంకరా', 'ప్రేమ గీమ జాన్‌తా నరు' చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. సల్మాన్‌ఖాన్‌తో కలసి సుజుకీ అడ్వైర్టెజ్‌మెంట్‌లోనూ నటించే అవకాశం దక్కించుకున్నారు. పలువురు నటులకు డబ్బింగ్ కూడా చెప్పారు.

ఎస్‌ఎమ్‌ఎస్‌లు రాకనే రన్నర్‌గా..
ఇండియన్ ఐడల్ రెండవ సీజన్ టైటిల్ పోరులో మన తెలుగబ్బాయి కారుణ్య దక్షిణాది వాళ్ల సత్తా చూపారు. ఆ సీజన్‌లో రన్నర్‌గా నిలిచి గొప్ప పేరు సంపాదించుకున్నారు. వాస్తవానికి విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఎక్కువగా రాలేదనే కారణంతోనే రన్నర్‌గా నిలిచారు. తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించి, అతి తక్కువ కాలంలోనే ప్రముఖ గాయకుల సరసన నిలిచారు. కారుణ్య సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. నాలుగు సంవత్సరాల వయసు నుండే సంగీతంలో కఠోరమైన శిక్షణ పొందారు. చిన్నతనంలోనే 'చిరు సరిగమలు' పేరుతో ఆల్బమ్ చేశారు. దానిని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. తర్వాత ఈటీవీలో ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన 'పాడుతా తీయగా' కార్యక్రమంలో విజేతగా నిలిచారు.

హిందీ సరిగా రాకపోయినా..
తెలుగునవతరం గాయకుల్లో బాగా క్రేజ్ ఉన్న గాయకుడు రేవంత్. కీరవాణి, కోటి, మణిశర్మ, చక్రి, థమన్ లాంటి సంగీతదర్శకుల దగ్గర అనేక పాటలు పాడారాయన. ముఖ్యంగా 'బాహుబలి' సినిమాలో 'మనోహరి' పాటను పాడి, సంగీత ప్రియులకు తలలో నాలుకయ్యారు. 2017లో ఇండియన్ ఐడల్-9లో టైటిల్ గెలిచి, జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సంగీత నేపథ్యమున్న కుటుంబం కాకపోయినా సంగీతంలో ఎప్పటికప్పుడు తన ప్రతిభను చాటుకుంటూ ముందుకెళ్తున్నారు.
హిందీ సరిగా రాదు... అయినా హిందీ పాటలు పాడి ఇండియన్ ఐడల్ టైటిల్‌ను కైవశం చేసుకున్నారు రేవంత్. ఉత్తరాది నుంచి వచ్చిన సింగర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైన తట్టుకుని నిలబడ్డారు. మంచి పాటలను ఎంచుకుని, వాటిని గంటల కొద్దీ రిహార్సల్స్ చేసి, పాడి న్యాయనిర్ణేతల మన్ననలు పొందారు. ఫైనల్‌కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అతిథిగా వచ్చారు. రేవంత్‌ను ఆయనే విజేతగా ప్రకటించి అవార్డును అందజేశారు. ఇక రెండో స్థానంలో రేవంత్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఖుదాబక్ష్ (పంజాబ్) నిలిచారు. మూడో స్థానంలో మళ్లీ మన తెలుగోడు అయిన పీవీఎన్‌ఎస్ రోహిత్ సెకండ్ రన్నరప్ అవార్డు అందుకున్నారు.
ఇండియన్ ఐడల్ విజేతలు వీళ్లే
ఇండియన్ ఐడల్ అనేది పాప్ ఐడల్ ఫార్మేట్ యొక్క భారతీయ వెర్షన్. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్లో 2004 నుంచి ప్రసారమవుతుంది. ఈ రియాలిటీ షోలో దేశంలో మెరుగైన గాయకులను ఒకచోట చేర్చి, పోటీలు నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనాలంటే జూనియర్స్ 5 నుంచి 16 సంవత్సరాల వరకు, సీనియర్స్ 18 నుంచి 35 సంవత్సరాల వారు అర్హులు. సీజన్ 7,8 జూనియర్స్‌కు కేటాయించారు. కంటెస్టెంట్ తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి. ఈ షోను సైమన్ పుల్లర్ రూపొందించారు.
సీజన్ 1 (2004-05) - అభిజీత్ సావంత్
సీజన్ 2 (2005-06) - సందీప్ ఆచార్య
సీజన్ 3 (2007) - ప్రశాంత్ తమంగ్
సీజన్ 4 (2008-09) - సౌరభీ దేబ్బర్మ
సీజన్ 5 (2010) - శ్రీరామచంద్ర మైనంపాటి
సీజన్ 6 (2013) - విపుల్ మెహతా సీజన్ 7 (2013) - అంజన పద్మనాభన్ (జూనియర్స్)
సీజన్ 8 (2015) - అనన్య నంద (జూనియర్స్)
సీజన్ 9 (2016-17) - ఎల్‌వి రేవంత్
సీజన్ 10 (2018) - సల్మాన్ అలీ
సీజన్ 11 (2019) - సన్నీ హిందుస్తానీ
- స్వర్ణలత నూకరాజు