నబ్లస్ : ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయిల్ బలగాలు శుక్రవారం ఇద్దరు పాలస్తీనియన్లను కాల్చి చంపాయి. ఇరు పక్షాల మధ్య హింస పెచ్చరిల్లకుండా వుండేందుకు అర్ధవంతమైన రాజకీయ క్రమం చేపట్టాలంటూ ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసిన మరుసటి రోజే ఈ దాడి జరిగింది. వెస్ట్ బ్యాంక్ ఉత్తర ప్రాంత నగరమైన నబ్లస్‌పై ఇజ్రాయిల్ మిలటరీ దాడి సందర్భంగా కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఇద్దరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తమ సైనికులు కూడా గాయపడ్డారని ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. శుక్రవారం ఉదయం నబ్లస్‌లోకి ప్రవేశించిన ఇజ్రాయిల్ బలగాలు పాత సిటీలోనిఒక ఇంటిని చుట్టుముట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జెనిన్ పట్టణంపై దాడులకు ప్రతీకారంగా గురువారం పాలస్తీనా యోధుడు నబ్లస్ సమీపంలో ఇజ్రాయిల్ పైనికుడిని కాల్చి చంపారు. ఆ దాడికి ప్రతి దాడిగా శుక్రవారం నాటి కాల్పులు జరిగాయి.










