Jul 24,2023 22:18
  • 19 వేల మంది తరలింపు

ఏథెన్స్‌ : గ్రీక్‌లోని రోడ్స్‌ ద్వీపంలో గత ఆరు రోజుల నుంచి కార్చిచ్చు రగులుతూనే ఉంది. ద్వీపంలో మూడు వైపుల నుంచీ మంటలు వ్యాపిస్తున్నాయని, ఇప్పటి వరకూ సుమారు 19 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన వారిలో స్థానికులు, పర్యాటకులు కూడా ఉన్నారు. భూ ప్రాంతం నుంచి 16 వేల మందిని, సముద్ర ప్రాంతం నుంచి మూడు వేల మందిని తరలించినట్లు స్థానిక పోలీసులు చెప్పారు. 12 గ్రామాలు, అనేక హోటళ్ల నుంచి ఈ తరలింపు జరిగింది. శ్వాసకోశ సమస్యలతో ఆరుగురు ఆసుపత్రిలో చేరారని, తరువాత డిశ్చార్జి అయ్యారని పోలీసులు తెలిపారు. తరలించిన పర్యాటకుల్లో 90 శాతం మంది యూరప్‌ దేశాల నుంచి వచ్చిన వారే. ప్రస్తుతం రోడ్స్‌ ద్వీపంలో పర్వత ప్రాంతంలో ఉన్న మంటలు సమీపంలోని దట్టమైన అడవులకు వ్యాపించకుండా ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయతిుస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రీక్‌కు చెందిన సిబ్బందితోపాటు ఫ్రాన్స్‌, టర్కీ, క్రొయేషియాకు చెందిన సిబ్బంది కూడా పాల్గంటున్నారు. ప్రస్తుతం గ్రీక్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతోనే కార్చిచ్చు వ్యాపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.