May 02,2023 11:16

న్యూయార్క్‌ :   రాబోయే సంవత్సరాలలో సుమారు 7,800 ఉద్యోగాలను కృత్రిమ మేథస్సు (ఎఐ)ద్వారా భర్తీ చేయవచ్చని  అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ  ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మెషీన్స్‌ కార్ప్‌ (ఐబిఎం) పేర్కొంది. ఈ మేరకు సోమవారం బ్లూమ్‌బెర్గ్‌ ఓ వార్తను ప్రచురించింది.  తమ కంపెనీ సుమారు 7,800 ఉద్యోగాల నియామకాలను నిలిపివేయాలని భావిస్తున్నట్లు ఐబిఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అరవింద్‌ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలను కృత్రిమ మేథస్సుతో భర్తీ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కృత్రిమ మేథ (ఎఐ), బిగ్‌ డేటా, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఇతర ఆధునిక టెక్నాలజీలతో జాబ్‌ మార్కెట్‌లో పెనుమార్పులు చోటుచేసుకోవచ్చని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఐదేళ్లలో 1.4 కోట్ల ఉద్యోగాలు పోవచ్చని, అన్ని రంగాల్లోని ఉద్యోగులకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఈ నివేదిక వెలువడిన వెంటనే ఐబిఎం నుండి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.