Feb 04,2021 07:14

జనవరి 24వ తేదీన, అంటే జాతీయ బాలికా దినోత్సవం రోజున, దిగ్భ్రాంతి కలిగించే ఒక సంఘటన జరిగింది. అత్యంత విద్యావంతులైన తల్లిదండ్రులు, విద్యావంతులైన తమ కూతుళ్ళనిద్దరినీ హత్యచేశారు. ఈ హత్యలకు ఆ ఆడపిల్లలిద్దరూ సహకరించడం మరింత ఆశ్చర్యకరం. ఆ కుటుంబ సభ్యులందరూ పునర్జన్మలను నమ్మారు. తమను తల్లిదండ్రులు చంపితే, తాము మరల పునర్జన్మ ఎత్తుతామని ఆ యువతులు నమ్మి, తల్లిదండ్రులను నమ్మించారు. ఈ ఘటనతో అనేక మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయి. అంతకు కొద్దిరోజుల క్రితం నాలుగు రోడ్ల కూడలిలో పారవేసిన నిమ్మకాయలు, పసుపు, కుంకాలను తొక్కాననీ, అందువలన తనకేదో దయ్యం పట్టిందని ఆ యువతులలో ఒకామె భావించి బెదిరిపోసాగింది. దానికి విరుగుడుగా తల్లిదండ్రులు ఒక మంత్రగాడిని పిలిపించి, దారాలూ తాయెత్తులను కట్టించారు. అంతేకాదు, జనవరి 24వ తేదీతో కలియుగం అంతమౌతుందని వారందరూ నమ్మారు. కాబట్టి ఆ రోజున తమ బిడ్డలను చంపితే...వారు 25వ తేదీతో ప్రారంభమయ్యే కృతయుగంలో, స్వచ్ఛమైన బాలికలుగా పునర్జన్మ ఎత్తుతారని నమ్మారు. అలా నమ్మిన ఆ కుటుంబంలోని తండ్రికి కెమిస్ట్రీలో మాస్టర్‌ డిగ్రీ వుంది. ఆయన మదనపల్లి లోని ప్రభుత్వ మహిళా కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌. తల్లికి మాథ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ వుంది. పైగా వందలాది మంది విద్యార్థులు శిక్షణ పొందే కోచింగ్‌ సెంటర్‌కు కరస్పాండెంట్‌. వారు ఇలాంటి మూఢనమ్మకాలను తమ బిడ్డలకే కాకుండా, మరింకెన్ని వందలమంది విద్యార్థులకు నూరిపోశారో తెలియదు. వీరికున్న గుడ్డి నమ్మకాలను జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ఎన్నోసార్లు మూఢనమ్మకాలుగా నిరూపించారు. ఉదాహరణకు, అనేక గ్రామాలకు వెళ్ళి, అక్కడ కూడళ్ళలో పడవేసిన నిమ్మకాయలను గ్రామస్థులు ఇచ్చిన నీళ్ళలో పిండి, పంచదార కలుపుకొని తాగారు. వాటిలో కోడిగుడ్లు కూడా ఉంటే గ్రామస్థుల ఎదుటనే కొట్టుకొని తాగారు. అలాగే బాణామతి చేస్తారని పేరున్న మంత్రగాళ్ళకు తమ గోళ్ళు, చెమట తుడుచుకున్న రుమాళ్లు ఇచ్చి తమపై బాణామతి ప్రయోగం చేయమని సవాళ్ళు విసిరి వచ్చారు. దయ్యాలున్నాయని ప్రజలు భావిస్తున్న ఇళ్ళలో అమావాస్య రోజు రాత్రి పూట కోడి కూర తిని, చక్కగా నిద్ర పోయి మరునాడు ఉదయం క్షేమంగా బయటికి వచ్చారు.
జనవిజ్ఞాన వేదిక వారు ఇంతగా ప్రయత్నం చేస్తున్నా ప్రచారం సాగిస్తున్నా విద్యాధికులలో సైతం ఇంత భయంకరమైన మూఢనమ్మకాలు ఎందుకు ఉంటున్నారు? మొట్టమొదటి కారణం మన విద్యా విధానంలో ఎక్కడా శాస్త్రీయ అవగాహనను పెంచే అంశం ఒక్కటీ లేకపోవడం. పైగా, అశాస్త్రీయ అంశాలు వందల సంఖ్యలో వుంటూ, విద్యార్థుల మనసుల్ని నింపేస్తున్నాయి. ఉదాహరణకు పర్వతానికి ఒక కూతురు పుట్టిందనీ, ఆమెను శివుడు వివాహం చేసుకున్నాడని 9వ తరగతి లోని తెలుగు పాఠంలో (7వ పేజీ) ఉంది. అదే తరగతిలో మరో పాఠంలో (52వ పేజీ) స్వర్గ నరకాలు ఉన్నాయనీ, సురభిమల్లుడనే రాజు వైభవంలో స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని మించినవాడనీ వుంది. ఇట్లాంటి అశాస్త్రీయ అంశాలతో నిండిన పాఠాలను మనసుకెక్కించుకున్న భావి భారత పౌరులు శాస్త్రీయ భావాలను ఎలా చెవికెక్కించుకుంటారు?
విద్యార్థులలో అశాస్త్రీయ భావాల వ్యాప్తిలో కొందరు టీచర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల మా బంధువర్గంతో కలిసి కర్నాటక లోని అనేక స్థలాలు దర్శించాను. వాటిలో దేవాలయాలు కూడా వున్నాయి. వారు దైవదర్శనంలో మునిగిపోతే, నేను ఇతర విషయాల వైపు కేంద్రీకరించాను. వాటిలో నన్నాకర్షించిన ఒక విషయం ఏమిటంటే ప్రతి దేవాలయానికి 3,4 సూళ్ళ విద్యార్థులు వందలాది మంది వచ్చారు. దేవాలయాలకు ఎందుకు వచ్చారనడిగితే 'మేము ఎక్స్‌కర్షన్‌గా వచ్చాము. మా టీచర్లు తీసుకువచ్చారు'' అని సమాధానమిచ్చారు. ఎక్స్‌కర్షన్‌ అంటే విజ్ఞాన యాత్ర. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించడానికి, ఆ విజ్ఞాన యాత్రలకు ప్రభుత్వం కొంత డబ్బు కేటాయిస్తుంది. కాని అలాంటి విజ్ఞాన యాత్రలను కూడా కొందరు టీచర్లు తీర్థయాత్రలుగా మార్చివేస్తున్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఓసారి బెంగళూరు లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్సు సెంటరులో ఒక రోజంతా గడిపాను. ఆ సైన్సు సెంటరుకు రోజు మొత్తంలో ఒక్క స్కూల్‌ బృందం కూడా రాలేదు. ఇక విద్యార్థులలో విజ్ఞానం, శాస్త్రీయ అవగాహన ఎలా పెరుగుతాయి?
టి.వి చానళ్లు సైతం ఏం ప్రచారం చేస్తున్నాయి? జ్యోతిష్యం, వాస్తు, రంగు రాళ్లు, ప్రవచనాల పేరు మీద పురాణాల లోని అశాస్త్రీయ అంశాలు, ధర్మ సందేహాలకు సమాధానాల పేర ఆధునిక మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నాయి. ఈ మూఢనమ్మకాలను నిర్మూలించే కృషిని గతంలో అనేక మంది సంఘ సంస్కర్తలు, హేతువాదులు చేశారు. ప్రస్తుతం సైన్సువాదులు చేస్తున్నారు. గతంలో అలాంటి కృషిని చేసినవారిలో చార్వాకులు ప్రథములు. ఆ తర్వాతి వారిలో పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, యోగి వేమన అగ్రగణ్యులు. ఆధునిక కాలంలో స్వామి వివేకానంద జ్యోతిష్యాన్ని నిరసిస్తూ 'మ్యాన్‌, ది మేకర్‌ ఆఫ్‌ హిజ్‌ డెస్టినీ' అనే ఉపన్యాసమిచ్చారు. అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు తన జీవితమంతా ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడారు. నేడు కూడా సైన్సువాదులు ఈ అంధ విశ్వాసాలకు, మూఢహత్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ వ్యాస రచయితనైన నేను కూడా దయ్యాలు లేవని నిరూపించడానికి అమావాస్య నాడు, అర్థరాత్రి ఒంటరిగా శ్మశానానికి వెళ్ళి వచ్చాను. దయ్యాలు వున్నాయని చెప్పబడే ప్రదేశానికి నా విద్యార్థులను తీసుకువెళ్ళి, అవి లేవని నిరూపించాను. ఇలా అనేక మంది అనాది నుండి ప్రయత్నిస్తూనే వున్నారు.
మరి ఈ మూఢహత్యలు ఆగేదెప్పుడు? మొట్టమొదటగా ప్రభుత్వం మన రాజ్యాంగం లోని 51ఎ (హెచ్‌) ప్రకరణాన్ని అనుసరించి శాస్త్రీయ భావాలను, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని ప్రజలలో పెంచే ప్రయత్నాలు చేయాలి. 1వ తరగతి నుంచి పాఠ్యాంశాలలో శాస్త్రీయ అవగాహనను పెంచే అంశాలను కథలుగా, సంఘటనలుగా, నాటికలుగా చొప్పించాలి. అశాస్త్రీయ అంశాలను తీసివేయాలి. విద్యార్థుల విజ్ఞాన యాత్రలను ప్రోత్సహించాలి. విద్యార్థులకు మూఢనమ్మకాల వలన నాశనమౌతున్న వారి బాధల గాధలను వివరించాలి. కాని ప్రస్తుతం ప్రభుత్వం దీనికి వ్యతిరేక దిశలో పని చేస్తున్నది. సాక్షాత్తు ప్రధానమంత్రే వినాయకుడి కథ వాస్తవమనీ, ఆ కాలంలోనే మనకు ప్లాస్టిక్‌ సర్జరీ తెలుసుననే విషయాన్ని ఆ కథ నిరూపిస్తుందనడం అశాస్త్రీయతకు పరాకాష్ట. అలాగే జ్యోతిష్యం, వాస్తులను కొంత కాలం క్రితమే డిగ్రీ కోర్సులుగా ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రఖ్యాత బనారస్‌ హిందూ యూనివర్సిటీ 'భూతవిద్య'ను ఒక కోర్సుగా ప్రవేశ పెట్టడం ఎంత అశాస్త్రీయం? పై పాఠ్యాంశాలను ఉపసంహరించేందుకు పోరాడాలి. అలాగే టి.వి ఛానళ్ళలో వచ్చే అశాస్త్రీయ అంశాలను తీసివేసి, శాస్త్రీయ అంశాలను ప్రసారం చేయాలని, వారిపై ప్రజలు ఒత్తిడి తీసుకురావాలి. అందుకు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం ఉద్యమించాలి. అప్పుడే మూఢనమ్మకాల ప్రసారాలకు అడ్డుకట్ట పడుతుంది. చివరగా తల్లిదండ్రులు శాస్త్రీయ భావాలను పెంచుకొని, తమ బిడ్డలకు శాస్త్రీయ అంశాలను వివరించాలి. అలా జరగని పక్షంలో మదనపల్లి ఘటనలూ, ఘతుకాలూ జరుగుతూనే వుంటాయి. అందువలన ప్రజలందరూ శాస్త్రీయ ఆలోచనా పధం వైపు ముందడుగు వేయాలి.

                                                     ఈ మూఢ హత్యలు ఆగేదెప్పుడు?      - కె ఎల్ కాంతారావు