
తాజాగా ప్రకటించిన 2022 ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం మరింత దిగజారింది. గతేడాది 116 దేశాలకు గాను 101వదిగా ఉంటే ఇప్పుడు 121లో 107వ స్థానం. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి సూచికలో మనకు దక్కుతున్న స్థానం గురించి ప్రతి ఏటా కాషాయ దళాలతో పాటు మరి కొందరు తప్పు పడుతున్నారు. అసలు ఆ లెక్కలే తప్పు, లెక్కించిన పద్ధతే తప్పు, పరిగణన లోకి తీసుకున్న అంశాలే సరైనవి కాదు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఓ) చెప్పే వాటిని లెక్కలోకి తీసుకోనవసరం లేదని వాదనలు చేస్తున్నారు. మూడు వేల మందిని ప్రశ్నించి దాన్నే దేశమంతటికీ వర్తింపచేయటం ఏమిటి అని ఆశ్చర్యం నటిస్తున్నారు. నిజమే, ఇలాంటి వాదనలను ప్రభుత్వం కూడా చేస్తున్నది, ఖండిస్తూ ప్రకటనలు చేస్తున్నది. ఐరాసలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది, మరో రెండు పరిశీలక దేశాలు, అసలు చేరని దేశాలూ ఉన్నాయి. ఇప్పుడు నివేదిక రూపొందించిన సంస్థలకు సమగ్రంగా తమ సమాచారం ఇచ్చిన దేశాలు 121 మాత్రమే. అది స్వచ్ఛందం తప్ప ఇవ్వకపోతే తల తీసేదేమీ ఉండదు. ఒక్క ఆకలి సూచికనే కాదు, అనేక సూచికలను ఎప్పుడైనా మోడీ సర్కార్ లేదా దాని మద్దతుదార్లు అంగీకరించారా? లేదు, ఎందుకంటే అన్నింటా అథమ స్థానాలే.
ఆకలి సూచికలను రూపొందించేందుకు ప్రాతిపదికగా తీసుకున్న నాలిగింటిలో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా వర్తింప చేస్తారు అన్నది కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో ఒకటి. అయితే అన్ని దేశాలకూ ఒకటే పద్ధతిని అనుసరించారు కదా! పోషకాహార లేమికి గాను కేవలం మూడు వేల మందితో జరిపిన సర్వేను ఎలా ప్రాతిపదికగా తీసుకుంటారు అన్నది మరొక అభ్యంతరం. ఇది కూడా అన్ని దేశాలకూ ఒకటే పద్ధతి. నివేదికను రూపొందించిన సంస్థలు తాముగా ఎలాంటి సర్వేలు జరపలేదు. ప్రభుత్వం చెబుతున్న మూడు వేల మందిని సర్వే జరిపింది ఐరాస సంస్థలలో ఒకటైన ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ). అది కూడా వేరే సంస్థ ద్వారా చేయించింది. ఆ సమాచారాన్నే నివేదికను రూపొందించిన 'వెల్ట్ హంగర్ హిల్ఫ్, కన్సర్న్ వరల్డ్ వైడ్' తీసుకున్నాయి. అనేక అధికారిక సంస్థల సమాచారాన్ని కూడా అవి తీసుకున్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్ నేత అశ్వనీ మహాజన్ స్వదేశీ జాగరణ మంచ్ సహ కన్వీనర్‌గా పని చేస్తున్నారు. 2021 ఆకలి సూచిక నివేదిక తప్పుల తడక అంటూ 2021 నవంబరు పదవ తేదీ పయనీర్ ఆంగ్ల పత్రికలో పెద్ద వ్యాసం రాశారు. దాన్లో దేశంలో కూరగాయలు, గుడ్లు, పండ్లు, పాలు ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు ఎలా పెరిగాయో పేర్కొంటూ ఇవన్నీ ఉన్నపుడు పోషకాహార లోపం ఎలా ఉంటుందని ప్రశ్నించారు (వాటిని కొనుగోలు చేసి రోజూ తినేవారెందరో ఆ పెద్దమనిషి చెప్పి ఉంటే అసలు నిజాలు తెలిసేవి). ఆకలి సూచికల రూపకల్పనకు నేషనల్ శాంపుల్ సర్వే సంస్థ (ఎన్‌ఎన్‌ఎస్‌ఓ) నుంచి ఆహార వినియోగ సమాచారాన్ని తీసుకోవాలని చెప్పారు. 2011-12 తరువాత అసలు అలాంటి సమాచారాన్ని ప్రచురించలేదని, 2015-16 సర్వేలో తీవ్ర లోపాలు ఉన్నందున అసలు దాన్ని ప్రచురించకుండా వెనక్కు తీసుకున్నారని, అందువలన 2021 ఆకలి సూచిని 2011-12 సమాచారంతో రూపొందించారని మహాజన్ ఆరోపించారు. దానికి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. సరైన సర్వే నిర్వహించలేదు, పోనీ మా దగ్గర తాజా సమాచారం లేనందున మా దేశాన్ని జాబితాలో చేర్చవద్దని ఎందుకు కోరలేదు. సమాచారాన్ని సేకరించేందుకు మోడీ సర్కార్ ఎందుకు శ్రద్ధ చూపలేదు? 2019 ఎన్నికలకు ముందు నిరుద్యోగం నాలుగు దశాబ్దాల రికార్డులను బద్దలు కొట్టిందని ప్రభుత్వ సమాచారం వెల్లడిస్తే ఎన్నికలు ముగిసేవరకు దాన్ని వెలువడకుండా అడ్డుకున్నారు, అది వాస్తవం కాదన్నారు, తరువాత అదే వాస్తవమని అధికారికంగా అంగీకరించారు.
గతంలో ఎఫ్‌ఏఓ మన దేశంలో ఆహార వినియోగం గురించి జాతీయ పౌష్టికాహార పర్యవేక్షణ బోర్డు (ఎన్‌ఎన్‌ఎంబి) సమాచారం మీద ఆధారపడేది. 2011 తరువాత గ్రామీణ ప్రాంతాల్లో, 2016 తరువాత పట్టణ ప్రాంతాల్లో తాము ఎలాంటి సర్వేలు జరపలేదని ఎన్‌ఎన్‌ఎంబి చెప్పిందని కూడా మహాజన్ పేర్కొన్నారు (ప్రభుత్వం దగ్గర సమాచారం లేనపుడు గాలప్ పోల్ వంటి సంస్థల మీద ఆధారపడి దాన్ని విశ్లేషణకు తీసుకున్నట్లు చెప్పవచ్చు. దానికి బాధ్యత ఎవరిది ?).
వాస్తవం ఏమిటి? కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను 2014-15లో, ఐదవ సర్వేను 2019-20లో నిర్వహించారు. ఈ సర్వేల మధ్య వచ్చిన మార్పు, ఆకలి సూచికల్లో 2014-2022 కాలంలో వచ్చిన మార్పులు ఏమిటి? దిగువ పట్టికలో చూద్దాం. అంకెలను శాతాలుగా గమనించాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రక్తహీనత అంశంలో ఒక్క కేరళ తప్ప మిగతా రాష్ట్రాలన్నింటా పరిస్థితి తీవ్రంగా ఉంది.

పట్టికలో పేర్కొన్న అంకెల్లో 2014 నుంచి 2022 వివరాలను ఆకలి సూచికల విశ్లేషణలో పేర్కొన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలు మన ప్రభుత్వం ప్రకటించినవే. దశాబ్దాల పాటు ఎలాంటి సర్వేలు నిర్వహించని మన ప్రభుత్వాలు, పాలకులకు, వారి మద్దతుదార్లకు సూచికలను రూపొందించే సంస్థలను విమర్శించేందుకు ఉన్న నైతిక అర్హత ఏమిటి? తాజా ఆకలి సూచిక విశ్లేషణకు 2017 నుంచి 2021 వరకు ఉన్న ఐదేళ్ల సమాచారాన్ని విశ్లేషించారు. వచ్చే ఏడాది 2018 నుంచి 2022 వరకు తీసుకుంటారు. ప్రతి ఏటా ఇలాగే మారుతుంది. 2022 నివేదికలో మన దేశం సాధించిన మార్కులు 29.1 కాగా ఐదు శాతం లోపు మార్కులతో చైనాతో సహా 17 దేశాలు ఒకటవ స్థానంలో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్సు వంటి దేశాలు అసలు ఈ జాబితాలోనే లేవు. మన దేశం కూడా వాటి సరసన చేరితే అసలు ర్యాంకుల గొడవ ఉండదు కదా!
2014లో పేర్కొన్న 76 దేశాల్లో మనది 55వ ర్యాంకు వాస్తవం కాదని కొందరు చెబుతున్నారు. మరి ఎంత? ఆ జాబితాలో ఐదు కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న 44 దేశాలను సూచికలో చూపలేదు. వాటిని కలుపుకుంటే మొత్తం దేశాలు 120 మన ర్యాంకు 99 అవుతుంది. తాజా ర్యాంకుల్లో అలాంటి దేశాలన్నింటినీ కలిపితే 121లో మనది 107 పెరిగినట్లా దిగజారినట్లా? మనం తెచ్చుకున్న మార్కులను చూస్తే 2014లో మన దేశానికి వచ్చిన మార్కులు 28.2 కాగా 2022లో 29.1 అంటే 0.9 మాత్రమే ఎనిమిది సంవత్సరాల్లో పెరిగింది. తీవ్ర పరిస్థితి తరగతిలోనే మనం ఉన్నాం. మన కంటే మెరుగుదల ఎక్కువ ఉన్న దేశాలు మనల్ని వెనక్కు నెట్టాయి. మనం అధ్వాన్నంగా ఉన్నందుకు కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మన కంటే మెరుగ్గా ఉండటమే కాషాయ దళాల గగ్గోలుకు అసలు కారణం, తక్కువ ఉంటే చూశారా మన ప్రతిభ అని తమ భుజాలను తామే చరుచుకొనే వారు!
చివరిగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకం, నిర్లక్ష్యం గురించి చూద్దాం. సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసిడిఎస్) అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మన్మోహన్ పాలన చివరి ఏడాది బడ్జెట్ 2013-14లో ఈ పథకానికి రూ.16,312 కోట్లు కేటాయించారు. తరువాత నరేంద్రమోడీ పాలన తొలి ఏడాది 2014-15లో రూ.16,561, 2015-16లో రూ.8,336, 2016-17లో రూ.14,850, 2017-18లో రూ.16,745 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్ 2022-23లో రూ.20,263 కోట్లుగా ప్రతిపాదించారు. 2013-14 బడ్జెట్ ఖర్చు అంచనా రూ.16,65,297 కోట్లు కాగా 2022-23లో అది రూ.39,44,909 కోట్లుగా ప్రతిపాదించారు. దీన్ని బట్టి తొమ్మిది సంవత్సరాల నాడు ఐసిడిఎస్‌కు మొత్తం ఖర్చులో 0.98 శాతం కేటాయిస్తే 2022-23 నాటికి అచ్ఛేదిన్ స్వర్ణయుగంలో అది 0.51 శాతానికి తగ్గింది. కుండలో కూడు కుండలోనే ఉండాలి. బిడ్డడు మాత్రం భీముడిలా ఉండాలి అనుకోవటం కాదా ఇది? నేటి బాలలే రేపటి పౌరులు అని కబుర్లు చెప్పటం కాదు, ఆచరణ కావాలి!
/వ్యాసకర్త : ఎం.కోటేశ్వరరావు