Oct 26,2023 08:28
  • హిజ్బుల్లా, హమస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ అధినేతల భేటీ

జెరూసలేం, గాజా : లెబనాన్‌కి చెందిన హిజ్బుల్లా సాయుధ గ్రూపు అధిపతి పాలస్తీనా సాయుధ గ్రూపులైన హమస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ అధినేతలు బుధవారం సమావేశమయ్యారు. అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల అండతో యుద్ధోన్మాదంతో ఊగిపోతూ గాజాపై తీవ్రస్థాయిలో వైమానిక దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌ను నిలువరింపజేయడం ఎలా అనే అంశంపైనే వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హిజ్బుల్లా ఒక ప్రకటన చేసింది. బుధవారం జరిగిన ఈ సమావేశంలో హిజ్బుల్లా నేత సయ్యద్‌ హసన్‌ నస్రల్లా, హమస్‌ డిప్యూటీ చీఫ్‌ సాలే అల్‌ అరౌరి, ఇస్లామిక్‌ జిహాద్‌ చీఫ్‌ జియాద్‌ అల్‌ నఖాలాలు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశం ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియరాలేదు. ఆపరేషన్‌ ఆల్‌ అక్సా ఫ్లడ్‌ ప్రారంభమైన దగ్గర నుండి చోటు చేసుకున్న తాజా పరిణామాలను వారు చర్చించారు. ఈ దాడిలో ఇజ్రాయిల్‌లో 1400 మంది మరణించగా, గాజాలో 6500 మంది చనిపోయారు. గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లో అణచివేతకు గురవుతున్న ప్రజలపై జరుగుతున్న దారుణమైన దాడులను నిలువరించి, మొత్తంగా ఇజ్రాయిల్‌పై విజయం సాధించేందుకు గానూ ఈ కీలకమైన దశలో తీసుకోవాల్సిన చర్యలపై, వైఖరులపై చర్చించారని ఆ ప్రకటన పేర్కొంది. ఈ నెల 7న దాడులు ప్రారంభమైనప్పటి నుండి దాదాపు రోజూ ఇజ్రాయిల్‌-లెబనాన్‌ సరిహద్దు పొడవునా ఇజ్రాయిల్‌ బలగాలు, హిజ్బుల్లా మధ్య కాల్పులు జరుగుతునే వున్నాయి.