Apr 06,2023 06:52

బాల్యంలో పాఠ్యపుస్తకాలలో రైతు దేశానికి వెన్నెముక, జై జవాన్‌, జై కిసాన్‌ అని చదువుతుంటే నా వెన్నుపూస నిటారుగా నిలబడేది, రైతు కొడుకుని అయినందుకు. పుస్తకం మూసేసినాక, వంటపంచకు చేరినా, పంట పొలానికి వెళ్లినా నా తల్లిదండ్రులూ, ఇంటిలోని పెద్దాచిన్నా పిల్లల ఆకలి కడుపులూ, విరుచుకునే ఎముకలూ, కార్చే చెమటలూ కన్పించేవి. ఉన్నత పాఠశాలలో చదువుకున్నపుడు మధ్యాహ్నం భోజనాల కేరేజీలు విప్పినపుడు ఉద్యోగుల పిల్లల కేరేజీల్లోలా కూరలు యెపుడో తప్పా మా రైతు పిల్లల కేరేజీల్లో ఎల్లప్పుడూ పిండొడియమో, ఉల్లిపాయో వుండేవి.
బాల్యంలో నా వెన్నుపూస నిటారుగా నిలబడడానికి కారణమైన నా తండ్రి... చిరిగిన బనీనూ, గావంచాతో, ఎండిన పేగులతో, దిగులు నిండిన కళ్లతో సావుకారి ఇంటి ముందరా, కరణం, నాయుళ్ల కాళ్లకాడ కనబడినపుడూ కారణమేటో తెలిసీది కాదు. వరి, చెరకు, పెసర, మినప, వేరుశనగ, నువ్వులు, కందులు, టమాటా, బీరకాయ, ఆనబకాయ, వంకాయ, మిరపకాయ సమస్త పంటలూ నా తండ్రి కళ్లం నుంచి సావుకారి గోదాముకీ, అక్కడి నుండి యెక్కడెక్కడికో వెళ్లిపోయి మా కంటికి కనిపించేవి కావు, అప్పుడూ ఎరికయ్యేది కాదు. పంటల్ని సరుకుల్ని చేసినోళికి తప్పా నాకే గాదు, నాలాటి నీకూ, అతగానికీ, అందరికీ ఆ మాయ యేటో తెలిసీది కాదు. మనందరికీ కాదు అతగానికి తెలాల! పండించినోడికి తెలాల. పంటలు పోగొట్టుకున్నోడికి తెలాల. తెలస్తాదా... యేనాటికేనా?
తెలిసినందునా..? నేడు ఢిల్లీ చుట్టూరా రైతు దండు జమ అయినాది! అటువంటి దండు ఇప్పుడే కాదు అలనాడు రాజులూ, చక్రవర్తులూ, జమీందారులూ, ఇనాందారులూ, మొఖాసాదారుల నుంచీ తెల్లోళ్ల దాకా సాగిన పాలనల మీద ఇలాగే జమయినాది.
తెల్లదొరలు తెలివయినోళ్లు. జాగీర్దారీ, భూస్వామ్య విధానాన్నీ, రైత్వారీ విధానాన్నీ కలిపి రెండు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతుదండు కళ్లు గప్పినారు. అందుకనే మార్క్స్‌-బ్రిటిష్‌ అధికారులు ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలు ఒకదానికొకటి విరుద్ధమైనవి. ఒకటి బ్రిటిష్‌ భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు సంబంధిస్తే, మరొకటి ఫ్రెంచి రైతుస్వామ్య వ్యవస్థకు సంబంధించిన నమూనాలు - అన్నాడు. రెండూ రైతులకు గానీ, భూ యజమానులకు గానీ ప్రయోజనకరమైనవి కావు. భూములపై పన్నులు వేసే బ్రిటిష్‌ ప్రభుత్వానికి ప్రయోజనకరమైనవని కొద్దికాలంలోనే నిరూపణయినాయి. ఇలాంటి రైతు వ్యతిరేక చట్టాలను ఒకవేపు తెచ్చి మరోవేపు భారతీయ సాంప్రదాయ పంటల స్థానంలో ఆంగ్లేయుల పరిశ్రమలకు అవసరమైన పంటలు పండించాలని తీవ్రంగా ఒత్తిడి చేసారు. దేశంలోకి నీలిమందు, పొగాకు పంటలను ప్రవేశపెట్టేరు. కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతులను అవలంభించేరు. ఆ పంటలను పండించడానికి అవసరమైన పెట్టుబడులను అప్పుల కింద ఇచ్చేవారు. అప్పుల వడ్డీలు, ధరల యెగుడుదిగుడులతో రైతులు అప్పులపాలవగా భూములు గుంజుకునేవారు. పందొమ్మిదో శతాబ్దిలో జరిగిన అనేక రైతాంగ పోరాటాల నేపథ్యమిదే! ఈ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ తిరుగుబాటులవి! 1855లో సంతాల్‌ రైతుల తిరుగుబాటు, 1860లో నీలిమందు తోటల (ఆంగ్లేయ) యజమానుల నిర్బంధ సాగు విధానాలకు వ్యతిరేకంగా బెంగాల్‌, బీహార్‌ రైతుల తిరుగుబాట్లు, 1875లో మహారాష్ట్ర మలబార్‌ ప్రాంత మాప్లా రైతాంగ తిరుగుబాటు, తూర్పుగోదావరి ( రంప ) ఏజన్సీ గిరిజన రైతాంగ తిరుగుబాటు. 1920-22లో ఉత్తరప్రదేశ్‌ లోని రాయబరేలి, ఫయిజాబాద్‌, సితాపూర్‌ జిల్లాల జమీందారీ వ్యతిరేక పోరాటాలు, ఆంధ్ర ప్రాంత పెదనందిపాడు శిస్తు నిరాకరణోద్యమం, పలనాడు అటవీ రైతుల సత్యాగ్రహం, వర్లీ ఆదివాసీ రైతుల తిరుగుబాటు, వాయలార్‌ రైతుల పోరాటం గాక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దాకా ఉద్యమాలు, పోరాటాలు, ఆందోళనలు ఉధృతంగా సాగినాయి...! ఇవన్నీ భారత జాతీయోద్యమంలో అంతర్భాగమే.
1936 ఏప్రిల్‌ 11న జరిగిన మొదటి మహాసభలో యేర్పడిన అఖిల భారత కిసాన్‌ సభ (రైతుసంఘం)... దాని ఆధ్వర్యంలో సాగిన పోరాటాల నుంచీ విశ్లేషించుకోవాలి. చరిత్రాత్మకమైన రైతు రక్షణ యాత్ర (ఇచ్చాపురం నుండి మద్రాసు దాకా 130 రోజులు 525 గ్రామాల సందర్శన, 1100 అర్జీల సేకరణతో రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి పెట్టిన డిమాండు పత్రం), జమీందారీ వ్యతిరేక పోరాటాలు సాగాయి. ఆ పోరాటాల ఫలితాలేమిటి? వాటి దిశాదశల్లో మార్పులేమిటో చర్చించుకోవాలి. రైతుసంఘాన్ని చీల్చిన కాంగ్రెస్‌ రాజకీయాలు, రైతాంగ పోరాట నాయకులను మళ్లించటాలు (మందసా జమీందారీ వ్యతిరేక పోరాట నాయకుల్లో ఒకరు గౌతు లచ్చన్న పాలకవర్గ నాయకుడైనాడు. స్వాతంత్య్రానంతర పాలనలో భాగమైనాడు), స్వాతంత్య్ర పోరాట కాలాన పోరాటాలకు అలీనంగానో, వ్యతిరేకంగానో వున్నవాళ్లు స్వాతంత్య్రానంతర పాలనలో లీనం గావటాలు యెందుకు జరిగాయి? రైతాంగ ఉద్యమకారులను కాల్చిచంపిన సంస్థానాధిపతులు స్వతంత్ర దేశంలో పాలకులెలా అవగలిగినారు? అవగలుగుతున్నారు?
కళింగాంధ్రా బొబ్బిలి, విజయనగరం, మందసా, పర్లాకిమిడి, కురుపాం, చీకటి, చెముడు, మేరంగి మొదలైనవి జమీందారీల పాలనలో నలిగిపోయేవి. జమీందారీ వ్యతిరేక పోరాటాలూ కళింగాన బలంగా సాగేయి. 1922లో నిరంకుశ బొబ్బిలి సంస్థానానికి వ్యతిరేకంగా ఆడవరం, లక్ష్మీపురం గ్రామాల రైతులు సింహాద్రి సూర్యనారాయణ నాయకత్వంలో తిరగబడి పెరిగిన శిస్తులను, పన్నులను కట్టలేము అని నిరాకరిస్తే కాల్పులు జరిపేడు సంస్థానాధిపతి. 22 మంది రైతులను అరెస్టు చేసారు. జైలులో ఒక రైతు చనిపోయేడు. కళింగాన మొట్టమొదటి జమీందారీ వ్యతిరేక రైతాంగ పోరాటమిది. మరోవేపు ఆదివాసీ ప్రాంతాన అల్లూరి సీతారామరాజు మన్యం తిరుగుబాటు జరిగింది. మన్య ప్రాంత సమస్యల మీద కూడా రైతుసంఘాలు ఉద్యమాలు నడిపేయి.
1936-37లో జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో జమీందార్లు బలపరచిన అన్నెపు పరశురాం పాత్రో (మాజీ మంత్రి) ని ఓడించి, రైతు నాయకుడు పుల్లెల శ్యామసుందరరావును గెలిపించగలిగింది రైతాంగ ఉద్యమం! ఆ తర్వాత సాగాల్సిన దిశలో రైతాంగ ఉద్యమం సాగలేదు. పుల్లెల శ్యామసుందరరావు అకాల మరణం, గౌతు లచ్చన్న పార్లమెంటరీ రాజకీయాల్లో రైతాంగ లక్ష్యాలను ఎజెండాగా చేయలేకపోవడం, కమ్యూనిస్టుల ప్రభావం లోకి కొందరు వెళ్లాక వర్గపోరాటం లక్ష్యం కావడం, తర్వాత కమ్యూనిస్టు పార్టీల్లో విభేదాలు, చీలికలు...కళింగ ప్రాంత రైతాంగ ఉద్యమ ప్రయాణమవగా దేశవ్యాప్త రైతు సంఘంలో చీలికల్తో, పీలికల్తో బలహీనమయ్యింది. స్వాతంత్య్రానంతర కాలంలో కూలిరేట్ల పోరాటాలు, బంజరుభూమి కోసం పోరాటాలు, పంటలకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు వంటివి తప్పా వ్యవసాయ విధానంలో జరగాల్సిన మౌలిక మార్పుల గురించిన పోరాటాలు దేశవ్యాప్తంగా అంతగా జరగలేదు. జమీందారీ రద్దు నుంచి బూటకపు భూసంస్కరణల దాకా తెల్లోళ్లను మించిన దగాకోరు రాజకీయ విధానాలు ... పెట్టుబడిదార్ల కడుపులు నింపే బొంబాయి ప్లాను నుండి పంచవర్ష ప్రణాళికల దాకా, పూర్తికాని సాగునీటి పారుదల ప్రాజెక్టులు, గిట్టుబాటు కాని పంటల ధరలు, పెరిగిన ఉత్పత్తి ఖర్చుల దాకా ఎన్నెన్నో రైతు దు:ఖానికి కారణాలు.

ఔను, నేనిలా రాస్తే... భూములున్న రైతుల గురించి రాస్తున్నాననీ, భూమి లేని రైతుల గురించిగానీ, రైతుకూలీల గురించి గానీ, రైతు చుట్టూ బతికే మేదరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి సమస్త కులవృత్తి జీవుల గురించి రాయటం లేదని మీరనొచ్చు. చిక్కల్లా అక్కడే వున్నది. రైతుకి న్యాయం జరిగితే గానీ రైతు చుట్టూ బతికే వృత్తిజీవులకు న్యాయం జరగదు. ఇది సమష్టి సమస్య (రైతు యేటేటా వ్యవసాయ ఆదాయంతో తనచుట్టూ వున్న వృత్తిజీవులకు తగిన రీతిలో వేతనాలు చెల్లించలేనందున, వృత్తిజీవులను యేడాదంతా తనతో నిలుపుకోలేనందున కుమ్మరి, చాకలి, మంగలి, మేదరి, కమ్మరి వంటి వృత్తి జీవులు నగరాలకు వలస పోయినారు, రైతుని, గ్రామాన్నీ విడిచిపెట్టేసారు. నగరాల్లో వీరి బతుకులు యెలా వున్నాయి, గ్రామాలలో వున్నపుడు కంటే బాగున్నాయా? బాగుంటాయా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం వేరే చర్చ.).
అలాగే భూములున్న రైతు, భూమి లేని కూలీ... ఈ సమస్య కూడా పరిష్కారం కావాల్సివుంది. తొలినాటి కిసాన్‌ సభ అంచేతనే భూ సంస్కరణలను డిమాండు చేసింది. కమ్యూనిస్టులు కూడా ప్రధానంగా భూ సమస్యను దున్నేవానికే భూమి అన్న విధానంతో పరిష్కరిం చాలంటున్నారు (దున్నేవానికి భూమి ఇవ్వడమనేది స్వంత ఆస్తి ఇవ్వడం కదా? కమ్యూనిజం స్వంత ఆస్తిని అంగీకరించదు కదా, మార్క్స్‌ కూడా ఇలా చెప్పలేదు, భారతీయ కమ్యూనిస్టులు తప్పుడు సూత్రీకరణలతో పోరాటాలు నడుపుతున్నారని కొందరు వాదనలు చేస్తున్నారు. దున్నేవానికి భూమి నినాదంతో రైతులను కదలించి కార్మికవర్గ నాయకత్వంలో విప్లవాన్ని జయప్రదం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోరాటాలని కమ్యూనిస్టులంటున్నారు). భూమీ, దానిమీద బతికే వ్యవసాయ వృత్తిజీవుల చుట్టూ అనే కాంశాలు ఇలా ఇంకా చర్చల్లోనే వున్నాయి. పరిష్కారాల వెదుకులాటలోనే వుండడం విషాదం!
వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం, పూర్తికాని సాగునీటి ప్రాజెక్టులతో పంటలు పోవటం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు దొరకక పోవటం, పంటకు పెట్టే మదుపులు (విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల వేతనాలూ.) పెరిగిపోవటంతో రైతులు అధికశాతం దివాళా తీసేరు. ఇదే సందర్భంలో పెట్టుబడిదారులు బడా, బడా పెట్టుబడిదారులైనారు, కొసకు కార్పొరేట్‌ సెక్టారుగా ఎదిగినారు.
వ్యవసాయ రంగాన్ని మూడు విభాగాలుగా తీసుకోవచ్చు. ఉత్పత్తి సాధనమైన భూమి, ఆ భూమి మీద శ్రమ చేసే మనుషులూ వొక విభాగం, పంటలకవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు... ఇన్‌పుట్స్‌ ఒక విభాగం, పంటలు అమ్ముకొనే మార్కెట్‌ మరొక విభాగం! రైతు చేతిలో గానీ రైతు ఆధీనంలో గానీ భూమీ, దాని మీద శ్రమ చేసే మనుషులు తప్పా మిగిలిన రెండు విభాగాలూ లేవు. మార్కెట్‌ శక్తుల చేతిలో వున్నాయి. ఆ శక్తుల క్రీడలో రైతులు దివాళా తీసేరు. ఇన్నేళ్లుగా రకరకాలుగా యెదిగిన మార్కెట్‌ శక్తుల కన్ను ఇపుడు రైతు చేతిలోని భూమి మీద పడింది. విశాల భూఖండాలను కొనగలిగే, లీజుకు పొందగలిగే ఆర్థిక సంపన్నులయిన మార్కెట్‌ శక్తులిపుడు వ్యవసాయ రంగాన్ని సంపూర్ణంగా ఆక్రమించదలచేయి. ఇంతకు ముందర పాలనలోనున్న రాజకీయ శక్తుల చేత తమ ఆక్రమణను చట్టబద్దం చేయలేకపోయిన మార్కెట్‌ శక్తులకు బిజెపి ఇపుడు నమ్మినబంటుగా రాజకీయ రంగమ్మీదకు వచ్చి ంది. ఆ ఫలితమే మూడు వ్యవసాయ చట్టాలు. ఆ చట్టాలే అమలయితే భవిష్యత్తులో రైతు చేతిలో భూమి మిగలదు.

  • వ్యవసాయ రంగమిక కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాక రైతాంగమే కాక ఆహార దినుసులు కొనుగోలు చేసే వినియోగదారుడు కూడా నష్టపోతాడు. కార్పొరేట్లు తమకు లాభాలనిచ్చే పంటలే పండిస్తారు. అధిక ధరలు లభించే చోటనే అమ్ముతారు...ఈ దేశంలో అమ్ముతారనే గ్యారంటీ కూడా వుండదు. అధిక ధరలు, ఆహార పంటల కొరతలను కూడా భవిష్యత్తులో దేశం ఎదుర్కోవలసి వస్తుంది. గనక కేవలం నేడు రైతాంగ సమస్యగా మాత్రమే గాక సకల ప్రజల సమస్యగా అర్ధం చేసుకొని ఆందోళనలు చేయాల్సి వుంది. పోరాడాల్సి వుంది.

రైతాంగం కూడా కేవలం ఆర్థిక సమస్యల పరిష్కారం కోసమే గాక తమ సమస్యకు శాశ్వతమయిన శాస్త్రీయ పరిష్కారాన్ని సాధించే దిశగా రాజకీయ రంగంలో కూడా రైతాంగం తమ భాగస్వామ్యాన్ని సాధించే (అసెంబ్లీ, పార్లమెంటులలో తమ డిమాండ్లను, తమ సమస్యలను తొలి నాటి రైతుసంఘ మహాసభల నుంచీ ప్రకటించుకు వస్తోన్న తమ లక్ష్యాలను రాజకీయ ఎజెండాను చేసే) దిశగానూ గత ఉద్యమ చరిత్ర లోంచి పాఠాలు తీసుకొని ఉద్యమాలు సాగించాలి! దేశం సంపన్నం కావడమంటే అశేష ప్రజలు సంపన్నులు కావడం. అంతే తప్ప అల్ప సంఖ్య కార్పొరేట్లు సంపన్నులు కావటం కాదు! దేశ సంపన్నత కోసం, సౌభాగ్యం కోసం రైతాంగం పోరాటాల చాలు పోయాలి!

 

attada-appalnayudu-article

 

 


/ వ్యాసకర్త: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్ర రచయితల, కళాకారుల వేదిక అధ్యక్షులు /