
జాతి నిర్మాణానికి విలువలు కలిగిన విద్యార్థులను తయారు చేయడమే విద్యావ్యవస్థ లక్ష్యం. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) జాతి లక్ష్యాలకు, రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నిర్ణయాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే క్లస్టరైజేషన్, డిజిటలైజేషన్, విలీన ప్రక్రియలు, వృత్తి విద్యా కోర్సులలో ఎన్‌ఇపి అమలు వలన ఎటువంటి దుష్ఫరిణామాలను చవిచూస్తున్నామో అనుభవాలు రుజువు చేస్తున్నాయి. ఇదిలావుండగా సిలబస్‌లో, పాఠ్యాంశాలలో కూడా కేంద్రం జోక్యం పెరుగుతున్నది. తాజాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పన్నెండవ తరగతి పాఠ్యపుస్తకాలలో చరిత్రకు సంబంధించిన చాప్టర్లను తొలగించారు.
- భావి పౌరులకు దేశ చరిత్ర తెలియకూడదనే
సరిగ్గా కోవిడ్ విపత్తు సమయంలో, వ్యవస్థలేవీ పని చేయలేని విపత్కాల పరిస్థితులతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఇపి అమలుకు పూనుకుంది. విద్యా సంస్థలు కోల్పోయిన పనిదినాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులపై భారం తగ్గించాలని 30 శాతం సిలబస్‌ను తగ్గించాలని ఎన్‌సిఇఆర్‌టి కూడా సూచించింది. 'వేటిని తొలగించాలి? ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలనే ప్రక్రియగాని, పారదర్శకతగాని లేదు. 2021 లోని సిలబస్‌ను తగ్గించేటపుడు విద్యార్థులపై భారాన్ని తగ్గించే విధంగా లేదు. పాలకుల భావజాల వ్యాప్తికి అడ్డంకిగా వున్న పాఠ్యాంశాలను తొలగించారు. కోవిడ్ విపత్తును అవకాశంగా మలుచుకుని, వారి ఎజెండా అమలుకు పూనుకున్నది. ఎన్‌ఇపి ముసాయిదాను విడుదల చేసినపుడు అది అమలైతే ఎటువంటి ప్రమాదాలు వస్తాయని ఊహించామో అవి నేడు విద్యారంగంలో జరిగిపోతున్నాయి.
- నాడు తొలగించిన వాటిలో ముఖ్యమైనవి
లౌకికవాదం, ప్రజాస్వామ్యం, హక్కులు, పౌరసత్వం, ఉద్యమాలు, జాతీయవాదం, ప్రాంతీయ అవసరాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వాలు, ఆహార భద్రత, పర్యావరణం, పంచవర్ష ప్రణాళికలు, ఇతర దేశాలతో సంబంధాలు, అలీన విధానం, పర్యావరణం, సహజ వనరులు, భిన్నత్వంలో ఏకత్వం వంటి అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను తొలగించారు. ఇవన్నీ మనదేశ చరిత్ర, వారసత్వ సంపదకు సంబంధించిన అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు, రాజ్యాంగ లక్ష్యాల సాధన, దేశ చరిత్రను పూర్తిగా కనుమరుగు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కాలంలో పాలకుల వైఫల్యాలకు సంబంధించిన ప్రపంచీకరణ విధానాలు, లింగ వివక్ష, పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వంటివి తొలగించారు.
- నేడు తొలగిస్తున్న పాఠ్యాంశాలు ...
ఎన్‌ఇపి అమలు నేపథ్యంలో ఎన్‌సిఇఆర్‌టి రూపొందించిన కొత్త పుస్తకాలలో మహాత్మా గాంధీకి సంబంధించిన పలు పాఠ్యాంశాలను తొలగించారు. ప్రధానంగా తొలగించిన అంశాలివి. 1. థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్-2 (16వ, 17వ శతాబ్దాలకు సంబంధించినది) 2. పదకొండవ తరగతిలో సెంట్రల్ ఇస్లామిక్ ల్యాండ్స్, సంస్కృతుల ఘర్షణ 3. పన్నెండవ తరగతి పౌరశాస్త్రంలో స్వాతంత్య్రం నుండి భారత రాజకీయాలలో ప్రసిద్ధ ఉద్యమాల వరకు 4. పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకం నుంచి గాంధీజీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ పై విధించిన నిషేధానికి సంబంధించిన కొన్ని పేరాలనూ, అలాగే హిందూ-ముస్లిం ఐక్యతకు గాంధీ చేపట్టిన కృషికి సంబంధించిన కొన్ని పేరాలను కూడా తొలగించారు. 5. గతేడాది కర్ణాటక పాఠ్యపుస్తకాలతో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్ పాఠ్యాంశాన్ని తొలగించారు. 6. సంఘసంస్కర్తలు పెరియార్, నారాయణ గురు, బసవడు వంటి ప్రముఖుల పాఠాలను తొలగించారు. 7. పాఠ్యాంశాలే కాదు. సిబిఎస్‌ఇ సిలబస్‌కు సంబంధించిన ప్రశ్నాపత్రాలలో 'గుజరాత్‌లో ముస్లింలపై దాడులు ఎవరు చేశారు?' వంటి ప్రశ్నలు దేనికి సంకేతాలు?
- జాతీయోద్యమ స్ఫూర్తి అవసరం లేదా?
జాతీయోద్యమ కాలంలో లౌకిక, ప్రజాస్వామ్యం, సార్వత్రిక విద్యకు డిమాండ్ పెరిగింది. కులమతాలకు అతీతంగా జాతిని ఐక్యం చేసే విద్యను కోరుకున్నారు. సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా సంఘ సంస్కరణల ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉద్యమాలు సామాజిక మార్పులుకు దారితీశాయి. ఈ క్రమంలో ప్రగతిశీల శక్తులు, సంఘాలు, వ్యక్తులు, సంస్కర్తలు ఏకమై బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడిన మన దేశ చరిత్ర మన బాలలకు, భావి పౌరులకు అవసరం లేదా?
ప్రాణాలకు వెరవకుండా భగత్‌సింగ్ చేసిన అద్భుతమైన పోరాటం, త్యాగం దేశ ప్రజలను కదిలించింది. క్విట్ ఇండియా, సహాయ నిరాకరణ ఉద్యమం వంటివి లక్షోపలక్షలుగా యువతను, లాయర్లను, ప్రజలను, విద్యార్థులను జాతీయోద్యమం లోకి ఆకర్షించాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశవిభజనకు కుట్ర పన్నిన ఆర్‌ఎస్‌ఎస్ లాంటి మత సంస్థల చర్యలను అంగీకరించని గాంధీజీ మత సామరస్యం కోసం హిందూ-ముస్లిం భాయిభాయి అంటూ విస్తృతంగా పర్యటించాడు. ఇవి నచ్చని హిందూత్వ శశ్తులకు ప్రతినిధి అయిన గాడ్సే...మహాత్ముడిని హత్య చేశాడు.
మత రాజ్యం కోసం అవసరమైన ప్రయత్నాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయీకరణలో భాగంగా ఉద్దేశ పూర్వకంగానే ఎన్‌ఇపి ద్వారా గాంధీజీకి సంబంధించిన చరిత్ర ఘట్టాలను తొలగిస్తున్నది. ఎన్‌ఇపి అమలు కాకముందు పరిస్థితికి, అమలవుతున్న తరువాత పరిస్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తుంది.
- ప్రమాదంలో దేశం, రాజ్యాంగం
నేడు కేంద్రం లోని పాలకుల విధానాలకు అనుగుణంగా ప్రజలందరికీ ఒకే భావజాలాన్ని గరిపే ప్రయత్నంలో భాగంగా ఎన్‌ఇపి లో కొన్నిటిని చొప్పించారు. విద్య చోదకశక్తి గనుక తొలుత విద్యారంగాన్ని ప్రభావితం చేసే అనేక చర్యలు చేపట్టారు. విభిన్న జాతులు, మతాలు, కులాలు, సంస్కృతులు గల ప్రజల ప్రయోజనాలను కాపాడే మన రాజ్యాంగానికి భిన్నంగా చర్యలు మొదలు పెట్టారు. ప్రధానంగా యూనివర్సిటీలలో మత సంస్థల జోక్యం పెరిగింది. ఎన్‌సిఇఆర్‌టి, ఎస్‌సిఇఆర్‌టి డైరక్టర్లను తొలగించారు. వారిస్థానంలో పాంచజన్య పత్రిక ఎడిటర్లను నియమించారు. భారతీయ పరిశోధన సంస్థ అధ్యక్షులుగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేతలను నియమించారు. జెఎన్‌యు, బెనారస్, జైపూర్ యూనివర్సిటీలలో మత సంస్థలు అల్లర్లు సృష్టించాయి. ఈ విధంగా చూస్తే ఏక పరీక్షా విధానం, ఏక సిలబస్, సిబిఎస్‌ఎఫ్ సిలబస్‌లో చరిత్ర వక్రీకరణలు, సెమిస్టర్ విధానం, నేషనల్ కరికులమ్ ఫ్రేమ్ వర్క్‌లో మార్పులు వంటి వాటితో భారత విద్యారంగం ప్రమాదకరమైన పరిస్థితిలో పడింది.
మేధోపరమైన స్వేచ్ఛ, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా ఈ సమాజంలో ఉన్న సామాజిక అసమానతలను తొలగించేటందుకు విద్యా వ్యవస్థ దోహదపడాలి. తద్వారా రాజ్యాంగ విలువలైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సాంస్కృతిక భాషా వైవిధ్యం, సమానత్వాలను వ్యాపింప చేసేలా మన విద్యా వ్యవస్థ ఉండాలి. ఇటువంటి లక్ష్యాలను చేరుకోడానికి దోహదపడే అంశాలు ఎన్‌ఇపి లో ఎక్కడా లేవు. కనుక ఎన్‌ఇపి వ్యతిరేక పోరాటంలో లౌకిక, ప్రజాస్వామిక శక్తుల జోక్యం పెరగాలి.
వ్యాసకర్త: కె.విజయ గౌరీ, యుటిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,
సెల్ నెం.8985383255 /