గురుగ్రామ్ : గురుగ్రామ్‌లోని మసీదుల్లో ముస్లింలు శుక్రవారం నిర్వహించే సామూహిక ప్రార్థనలపై హర్యనా ప్రభుత్వం నిషేధం విధించింది. గురుగ్రామ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ముస్లింలు వారి నివాసాల్లోనే ప్రార్థనలు చేయాలని అధికారులు ఆదేశించారు. సోమవారం నుహ్ లో ప్రారంభమైన ఈ ఘర్షణలు గురుగ్రామ్‌తో పాటు ఇతర జిల్లాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ఇద్దరు హోమ్ గార్డ్స్ సహా ఆరుగురు మరణించారు.
నుహ్ ఎస్‌పి బదిలీ
నుహ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరుణ్ సింగ్లాను హర్యానా ప్రభుత్వం బదిలీ చేసింది. మత ఘర్షణల సమయంలో ఆయన సెలవుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయనను భివాని ఎస్‌పిగా బదిలీ చేసినట్లు వెల్లడించారు. సింగాల్ గైర్హాజరైన సమయంలో అదనపు బాధ్యతలు చేపట్టిన నరేంద్ర బిజార్నియాను నుహ్ ఎస్‌పిగా నియమించినట్లు అదనపు ప్రధాన కార్యదర్శి టి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.










