ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : తెలుగుభాషా చరిత్రను ఒక మలుపు తిప్పి, సామాన్యుడు మాట్లాడే వాడుకభాషను ఉపయోగించి తెలుగు భాషను సరళీకరించిన గురజాడ చిరస్మరణీయుడని, సమాజాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలు రూపుమాపడమే కాకుండా, ఆధునిక సమాజాల్లో కనిపించే నవ్య భావాలను వ్యాపింపజేయటానికి తెలుగు సాహిత్యాన్ని ఎంచుకున్న గురజాడ వెంకట అప్పారావు ఆధునిక యుగకర్త అని ఆంధ్ర యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీమతి అన్నంశెట్టి ఈశ్వరమ్మ అన్నారు. గురజాడ జయంతి సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంధాలయంలో గురజాడ విజ్ఞాన కేంద్రం -జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా నిర్వహించిన "గురజాడ సాహిత్యం -సాహితి సౌరభం" అనే అంశంపై ఆమె ప్రధాన వక్తగా పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహించిన గురజాడ విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ కే.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంస్కరణ, ఆధునికత, అభ్యుదయం, ముందుచూపు లాంటి ఎన్నో లక్షణాలను సంతరించుకుని సమాజ పురోగమనానికి బాటలు వేసినవాడు గురజాడని అన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీ చీకటి దివాకర్ మాట్లాడుతూ వందేళ్ల పైబడి ముందుచూపుతో దేశం అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు, కులమతాలకు అతీతమైన విశ్వమానవ సమాజం కోసం దిశానిర్దేశం చేసినవాడు గురజాడని అన్నారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి పి. రమణ ప్రభాత్ మాట్లాడుతూ సమాజాన్ని సంస్కరించడంలో భాగంగా, భాషా సంస్కరణ కూడా చేపట్టి మనతో రోజూ ఉండే వ్యక్తులనే ఆయన సాహిత్య వస్తువుగా చేసుకుని మార్గం చూపారన్నారు. జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు డా. ఎం.వీ.ఎన్. వెంకటరావు మాట్లాడుతూ గురజాడ ప్రవచించించిన శాస్త్రీయ ఆలోచన బాటలోనే జె.వీ.వీ కూడా పని చేస్తుందని తెలిపారు. గురజాడ ఇందిరా మాట్లాడుతూ తన పర తేడా లేకుండా ఎక్కడ తప్పు ఉంటే ఆ తప్పును ఎట్టి చూపినవాడు గురజాడని అన్నారు. సాహితీ అభిమానులు, విద్యార్థులు, అభ్యుదయ రచయితలూ పాల్గొన్న ఈ సభ పావని వందన సమర్పణతో ముగిసింది.










