Jan 12,2023 06:52

రైతులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు తోడు ఎరువుల సమస్య నేడు దేశవ్యాప్తంగా తీవ్రంగా వుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎరువుల ధరలు, ఎరువుల కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నది. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, నాసిరకం విత్తనాలు, వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోవడం, ప్రభుత్వ రుణ సహాయ తగ్గిపోవడం లాంటి సమస్యలతో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం ఏడాదికేడాదికి తీవ్రమవుతూనే వుంది. ఇలాంటి స్థితిలో పంటలకు కీలకమైన ఎరువుల ధరలు పెరగడంతో పాటు అవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడానికి కారణాలు ఏమిటి? ఎరువుల కొరత ఎందుకని ఇంత తీవ్రమైంది? పాలకులు సహజంగా చెప్పే ప్రపంచ పరిస్థితులే కారణాలా? సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకా? లేక వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే చర్యల్లో భాగమా?
మొక్కల పెరుగుదలకు, ఆరోగ్యానికి అవసరమైన నత్రజని, పోటాషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలను ఎరువుల రూపంలో రైతులు భూమికి అందించి పంటలు పండించుకోవడం కొన్ని దశాబ్దాలుగా వుంది. ప్రస్తుతం ఎరువులు వేయకుండా, పురుగు మందులు వాడకుండా పంటలు పండని పరిస్థితి ఏర్పడింది. పాలకుల విధానాల వల్ల సాంప్రదాయ విత్తనాల స్థానంలో అన్ని పంటలకు కంపెనీ విత్తనాలే దిక్కయ్యాయి. అలాగే సేంద్రియ ఎరువుల స్థానంలో కంపెనీల ఎరువుల వాడకం పెరిగేకొద్ది భూసారం తగ్గి ప్రతి ఏటా ఎరువుల వినియోగం పెంచాల్సి వస్తుంది. వీటివల్ల ఎరువుల, పురుగు మందుల వాడకం భారీగా పెరిగిపోయింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ రంగంలో ఎరువుల ఉత్పత్తి పెంచా ల్సిందిపోయి... ప్రభుత్వ మరియు సహకార కార్మగారాల్లో ఎరువుల ఉత్పత్తిని తగ్గించి, క్రమంగా మూతవేస్తున్నది. ఈ పరిస్థితులను ప్రైవేటు కంపెనీలు చక్కగా ఉపయోగించుకొని భారీగా లాభపడుతున్నాయి. మారిన ఈ పరిస్థితులవల్ల చేతిలో నగదు వుంటేనే పంటలు సాగుచేసే పరిస్థితి రైతాంగానికి ఎదురైంది. అందువల్ల చిన్న, సన్నకారు రైతులు పంటలు పెట్టలేని పరిస్థితి, ఒకవేళ అప్పులు చేసి పంటలు సాగుచేసినా గిట్టబాటు ధరలు లేక అప్పుల్లో కూరుకుపోవడం లేదా ఆత్మహత్యలు చేసుకోవడం పెరిగిపోయింది.

  • పెరిగిన ఎరువుల వినియోగం

హరితవిప్లవం పేరుతో వ్యవసాయ రంగంలో అనేక విధానాలు అమలు చేశారు. ముఖ్యంగా పంటల దిగుబడి పెంచడం వంటివి చేపట్టారు. వీటికోసం ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం పెరిగింది. 1991లో ప్రారంభించిన ప్రైవేటీకరణ విధానాలు ప్రభుత్వరంగ ఎరువుల ఉత్పత్తిని తగ్గించి ప్రైవేట్‌ కంపెనీలకు భారీ రాయితీలు ఇవ్వడం పెరిగింది. ముఖ్యంగా కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2016-17లో ఎరువుల డిమాండ్‌ 614.33 వేల టన్నులు ఉండగా, ఉత్పత్తి మాత్రం 414.41 వేల టన్నులకు తగ్గింది. 2019-20 నాటికి డిమాండ్‌ 640.48 వేల టన్నులు, ఉత్పత్తి 245.01 వేల టన్నులు మాత్రమే జరిగింది. దేశంలో 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 8 భారీ యూరియా ఉత్పత్తి పరిశ్రమలు మూతపడ్డాయి. 1961లో స్థాపించబడిన ఫెర్టిలైజర్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నాగార్జున యూరియా, సహకార రంగంలోని ఇఫ్కో లాంటివి మూతపడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకున్న స్వదేశీ, విదేశీ ఎరువుల కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచేశాయి. 1970లో 0.4 మిలియన్‌ టన్నుల ఎరువులు దిగుమతి కాగా, 2003-24 నాటికి 6 మిలియన్‌ టన్నులు, 2018-19 నాటికి 29.81 లక్షల మిలియన్‌ టన్నులు, 2020 నాటికి దేశంలో వినియోగించే యూరియాలో 25 శాతం, డిఎపిలో 68 శాతం, పొటాష్‌ నూరు శాతం విదేశీ దిగుమతుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున పెరిగిన క్రిమిసంహారక మందుల వినియోగాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు కంపెనీలు నాణ్యత లేని బయోకెమికల్స్‌, బయో ఫెర్టిలైజర్స్‌ను ఉత్పత్తి చేసి రైతులను నిలువునా ముంచేస్తున్నాయి.

  • రైతులపై ఎరువుల భారం- కార్పొరేట్లకు రాయితీల లాభం

డిఎపి 2019లో 64 లక్షల టన్నులు, 2020లో 44.95 లక్షల టన్నులు, 2021 అక్టోబర్‌ 31 నాటికి 14.63 లక్షల టన్నులు మాత్రమే మార్కెట్‌లో వుంది. ఈ పరిస్థితి డిమాండ్‌ను పెంచింది. దాని ప్రభావం ధరల పెరుగుదలపై తీవ్రంగా పడి రైతులకు మోయలేని భారంగా మారింది. ఉదాహరణకు గత సంవత్సరం పొటాష్‌ 50 కిలోల బస్తా రూ. 1040 వుండగా, నేడు రూ.1700కు, 24:24:0:18 రూ.1550 నుండి రూ. 1900కు పెరిగాయి. క్రిమిసంహారక మందుల ధరలకు అదుపు లేదు. పెరిగిన ఎరువుల ధరల చాటున తన కార్పొరేట్‌ అనుకూల విధానాలను కేంద్ర బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఎరువుల సబ్సిడీలు పెంచినట్ల గొప్పగా చెప్పుకుంటున్నది. ఈ సబ్సిడీ పంటలు పండించే రైతులకు కాకుండా ఎరువులు ఉత్పత్తి చేసే కంపెనీల ఖాతాలకు చేరుతున్నాయి. ఫెర్టిలైజర్‌ కంపెనీలకు ఎరువుల సబ్సిడీ పేరుతో 2017-18లో రూ. 69,197 కోట్లు చెల్లించగా, 2020-21 నాటికి రూ. 1,27,921 కోట్లు చెల్లించారు. ఒకవైపు ప్రభుత్వ ఎరువుల కర్మాగారాలను మూసివేసి ఉద్యోగులను తొలగించి, రైతులపై భారాలు వేస్తూ, రెండోవైపు దేశ విదేశీ ప్రైవేట్‌ కంపెనీలకు కోట్ల రూపాయలను సబ్సిడీల పేరుతో కట్టబెడుతున్నది.

  • కార్పొరేట్‌ వ్యవసాయం కోసం...

రైతులను వ్యవసాయం నుండి దూరం చేసి కార్పొరేట్‌ వ్యవసాయాన్ని పెంచాలన్నది పాలకుల విధానం. ఒకనాడు భూస్వామ్య, ధనిక రైతాంగంతో రాజీ పడిన దేశీయ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు తమ విధానాల ద్వారా ఈ వర్గాలను తమలో కలిపేసుకున్నారు. భూస్వామ్య, ధనిక రైతాంగం పల్లెలు వదిలి పట్టణాలు, మహానగరాల్లోకి చేరారు. కాంట్రాక్టు, సినిమా, విద్యా, వైద్యం, హోటల్‌, లాడ్జింగ్‌, ట్రావెల్స్‌ లాంటి అనేక వ్యాపారాల్లో చేరి పెట్టుబడిదారులుగా మారారు. గ్రామాల్లో భూములపై వున్న హక్కు ద్వారా వచ్చే రాజకీయ పెత్తందారీ విధానాన్ని, కులమత విశ్వాసాలను పెంచిపోషిస్తున్నారు. అనేక గ్రామాల్లో పాతపడిన దేవాలయాల పునరుద్ధరణ, దేవరలు, జాతరలు లాంటి వాటికి వీరే మూలవిరాట్‌లుగా వుంటున్నారు. తమ భూములను కౌలుదార్ల ద్వారా సాగు చేయిస్తూ, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని రాయితీలను గద్దల్లా తన్నుకుపోతున్నారు. మరోవైపు పెద్ద పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసి లాభపడడంతో సంతృప్తి చెందడంలేదు. గంటల్లో, రోజుల్లో కోటీశ్వరులు కావడానికి ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారులుగా మారి ప్రభుత్వ రంగ సంస్థలను చౌకగా కొనేయడం, భూములు కబ్జా చేసుకొని రియల్‌ ఎస్టేట్‌ లాంటి వ్యాపారాలతో కుబేరులుగా మారుతున్నారు. అన్ని రంగాల్లోకి చివరకు కోట్ల మంది ఆధారపడిన రిటైల్‌ వ్యాపారంతో పాటు, వ్యవసాయ రంగాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరికి బిజెపి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల అండదండలు అందుతున్నాయి. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను మొండిగా అమలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఈ వర్గాల కోసమే. రైతులను భూముల నుండి, వ్యవసాయం నుండి తొలగించడానికి అవసరమైన అన్నింటిని బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్నది. అందులో భాగమే నేడు దేశం ఎదుర్కొంటున్న ఎరువుల సమస్య. సహకార వ్యవస్థను ధ్వంసం చేయడం, బ్యాంకుల్లో చిన్న, సన్నకారు రైతులకు రుణ పరపతి తగ్గించడం, గిట్టుబాటు ధరలు అమలు చేయకపోవడం, మార్కెట్‌ను వ్యాపారుల ఇష్టారాజ్యంగా మార్చేయడం జరుగుతున్నది. తమ కార్పొరేట్‌ అనుకూల విధానాలను కప్పిపుచ్చుకునేందుకు మతం, దేశభక్తితో పాటు, ప్రజల ఆరోగ్య విషయాలను వాడుకుంటున్నది. ఎరువుల సమస్య నుండి మధ్యతరగతి దృష్టి మళ్లించేందుకు సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. కార్పొరేట్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ, సేంద్రియ వ్యవసాయం అనడంలోనే వీరి కపటత్వం తెలుస్తున్నది. నూటికి 54 శాతం దేశ ప్రజలు ఆధారపడిన వ్యవసాయాన్ని... కొద్దిమంది చేతిలో వున్న కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించే చర్యలను ప్రతిఘటించే క్రమంలోనే ప్రత్యామ్నాయ విధానాలు రూపొందించ బడతాయి.

rambhupal

 

 

 

 

వ్యాసకర్త : వి.రాంభూపాల్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు /