Aug 09,2023 15:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : 77,108 జీవోలను వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రామ్‌ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ బుధవారం స్థానిక ఐటిఐ కళాశాల ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా ఎస్‌ ఎఫ్‌ ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ కే.జీ నుండి పీ.జీ వరకు ఉచిత విద్య అందిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ రెడ్డి నేడు జీవో నెంబర్‌ 77 తీసుకు వచ్చి ప్రవేట్‌ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులు విద్యదీవెన, వసతిదీవెన వర్తించదని చెప్పడం సిగ్గుచేటన్నారు. జీవో నెంబర్‌ 77వలన అధిక ఫిజులు కట్టలేక, ఉన్నత చదువులు చదవలేక విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ వైద్యాశాఖ తీసుకువచ్చిన జీవో నెంబర్‌ 108 కారణంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో మెరిట్‌ ఆదారిత ప్రవేశాలను పక్కదారి పట్టిస్తూ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను వ్యాపార కేంద్రాలుగా మలిచి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర చేస్తుందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క పీజీ విద్యను నాశనం చేస్తూ ఇంకో పక్క వైద్య విద్యతో వ్యాపారం చేస్తోందని అన్నారు. విద్యార్థుల పాలిట శాపమైన జీవో నెంబర్‌ 77, 108 లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రానున్న రోజుల్లో విద్యార్థులను ఐక్యం చేసి ఉద్యమం చెపాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కారయదర్శి ఉపేంద్ర, అధ్యక్షులు గౌరీ శంకర్‌, హరి, చరణ్‌, చెంగయ్య, నరసింహ, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.