Jul 24,2022 08:06

కథలోకి వెళ్తే.. గార్గి (సాయి పల్లవి) ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. తన కుటుంబమే ప్రపంచంగా బతుకుతున్న అమ్మాయి. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్‌.ఎస్‌ శివాజీ) హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. ఓ రోజు ఆ అపార్ట్‌మెంట్‌లో ఓ చిన్నారిపై కొంతమంది అత్యాచారం చేస్తారు. ఆ కేసులో ఆరు పదుల వయసున్న బ్రహ్మానందాన్ని కూడా అరెస్ట్‌ చేస్తారు. దీంతో సమాజం గార్గి కుటుంబాన్ని దోషులుగా చూస్తుంది. ఎన్నో అవమానాలు ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే తన తండ్రి ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా పోలీసులు ఆయనపై తప్పుడు కేసు పెట్టారని గార్గి బలంగా నమ్ముతుంది. అతన్ని నిర్దోషిగా బయటకు తీసుకొచ్చేందుకు న్యాయ పోరాటానికి దిగుతుంది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. కానీ, ఆమె తరఫున వాదించేందుకు ఏ న్యాయవాదీ ముందుకు రారు. ఈ క్రమంలో జునియర్‌ లాయర్‌ గిరీశం (కాళీ వెంకట్‌) గార్గికి మద్దతుగా నిలుస్తాడు. బ్రహ్మానందం తరపున వాదించడానికి ముందుకొస్తాడు. ఈ క్రమంలో ఆమెకు సమాజం నుంచి, చట్టం నుంచి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ కేసులో నిందితులు ఎవరు? జూనియర్‌ లాయర్‌ గిరీశం చేసిన ప్రయత్నం ఏంటి? బ్రహ్మానందం నిజంగానే అత్యాచారం చేశాడా? చివరకు గార్గి ఏం చేసింది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

gargi


చిన్నపిల్లల మీద అత్యాచారాల వార్తలు నిత్యం వింటూనే ఉంటాం. లోకం తెలియని పసిపిల్లల మీద కొందరు మృగాలు ఇలాంటి దారుణానికి ఒడిగడుతుంటారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబాలు, బాధిత అమ్మాయి ఎంత నరకం చూస్తుందో ఈ చిత్రంలో చూపించారు. ఇక మీడియా కూడా నిందితులు, బాధితులను ఎలా చూపిస్తారు.. వాళ్ల మీద ఎలాంటి ప్రోగ్రాంలు చేస్తారు.. వంటి వాటి మీద సెటైర్లు వేశారు. ఇలాంటి ఘటనల్లో కార్పొరేట్‌ మీడియా ఎలా వ్యవహరిస్తుందో చూపించారు.
'ఆడ పిల్లగా పుట్టావు కదా.. ప్రతి రోజూ యుద్ధమే' సినిమా చివరిలో ఓ యువతి చిన్నారికి చెప్పే మాట ఇది. ఇది అక్షర సత్యం. ఆడపిల్ల ప్రతిరోజు తన ఉనికి కోసం సమాజంతో యుద్ధం చేయాల్సిందే. ఇళ్లు, ఆఫీసులు, స్కూలు ఇలా ప్రతిచోటా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఒక్కోసారి మంచివారు కూడా ఆ వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అలాంటి ఘటనల్లో బాధిత కుటుంబంతో పాటు నిందితుల కుటుంబసభ్యులు కూడా పడే మానసిక క్షోభ ఎలా ఉంటుందనేది 'గార్గి' ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు గౌతమ్‌ రామచంద్రన్‌. ఎటువంటి అశ్లీలతకూ తావులేకుండా సున్నితమైన అంశాలను అతి సున్నినితంగా డీల్‌ చేస్తూ.. మంచి సందేశాన్ని అందించాడు దర్శకుడు. ఓ వైపు బాధితులు, మరోవైపు నిందితులు పడే మానసిక క్షోభని ప్రేక్షకులను హృదయాలను హత్తుకునేలా తెరకెక్కించాడు. అలాగే కోర్టుకు కావల్సినవి ఆధారాలు.. లాజిక్కులు మిస్‌ కాకుండా చూపించాడు. కథగా చూస్తే.. గార్గి చాలా చిన్న లైన్‌. అయితే దర్శకుడు కథ రాసుకున్న తీరు.. దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఆద్యంతం మెప్పిస్తుంది.
గార్గి పాత్రలో సాయిపల్లవి అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ కథకు ఆమె నటనతో ప్రాణం పోసింది. లాయర్‌ గిరీశం కప్పగంతుల పాత్రలో కాళీ వెంకట్‌ చక్కగా చేశారు. బాలిక తండ్రిగా కలైమామణి నటన హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ కథని గౌతమ్‌ ఎంత మంచిగా రాసుకున్నారో.. తెరపై అంతే చక్కగా ఆవిష్కరించారు. మైనర్‌ అత్యాచార కేసును ఓ ట్రాన్స్‌జెండర్‌ అయిన జడ్జి నేతృత్వంలో నడిపించడం బాగుంది. 'ఓ మగాడిలో పొగరు ఎక్కడ ఉంటుందో తెలుసు.. ఓ ఆడపిల్లలో నొప్పి ఎలా ఉంటుందో తెలుసు..!' ఈ కేసులో తీర్పు చెప్పడానికి నేనే కరెక్ట్‌ అంటూ ఆమెతో చెప్పించిన డైలాగ్‌ చప్పట్లు కొట్టిస్తుంది. గోవింద వసంత నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

టైటిల్‌: గార్గి
నటీనటులు : సాయి పల్లవి, కాళి వెంకట్‌, కలైమామణి శరవణన్‌, ఆర్‌.ఎస్‌ శివాజీ, ఐశ్వర్యలక్ష్మి, జయప్రకాశ్‌ తదితరులు
నిర్మాత: రవిచంద్రన్‌, రామచంద్రన్‌, థామస్‌ జార్జ్‌, ఐశ్వర్య లక్ష్మి, గౌతమ్‌ రామచంద్రన్‌
ఛాయాగ్రహణం: స్రైయంతి, ప్రేమకృష్ణ
రచన,దర్శకత్వం: గౌతమ్‌ రామచంద్రన్‌
సంగీతం : గోవింద్‌ వసంత
సమర్పణ: రానా దగ్గుబాటి(తెలుగులో)
విడుదల తేదీ: జులై 15, 2022