Oct 21,2023 11:03
  • ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంబించిన డిప్యూటి స్పీకర్
  • కోలగట్ల వీరభద్రస్వామి

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్వచ్ఛంద సంస్థల సేవా నిరతి గొప్పదని.. ఆపద, అత్యవసర సమయంలో ప్రజలకు ధైర్యం కలిగిస్తున్నారని ఏపీ శాసనసభ ఉపసభాపతి, విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గోల్డెన్ అవర్.. గోల్డెన్ లైఫ్ సంస్థ సభ్యులు విజయనగరం పట్టణంలో 10 ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. ఈ వాహనాలను ఉప సభాపతి కోలగట్ల శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సమాజహిత కార్యక్రమాలకు శాసనసభ్యునిగా తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అంబులెన్స్ సర్వీసులను తమ ఉపాధి కోసం ఎవరైనా ప్రారంభిస్తారని.. కానీ, వీరు కేవలం ఆపదలో ఉన్న వారిని కాపాడే సేవా దృక్పథంతో వాహనాలను నడపడం ప్రశంసనీయమన్నారు. ఇంటి నుంచి ఆసుపత్రికి నగరంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా సేవలు అందిస్తారని తెలిపారు. అత్యవసర సమయంలో సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భోగాపురపు రవిచంద్ర, మారం బాల బ్రహ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.