ఇంఫాల్ : మణిపూర్‌లో నలుగురిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు మణిపూర్ పోలీసులు గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రదేశాల నుండి వీరిని అదుపులోకి తీసుకున్నామని, వారి నుండి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చురాచంద్‌పూర్ జిల్లా నుండి బుధవారం ఇద్దరు వ్యక్తులను, మరియు 25 రౌండ్ల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాంగ్‌పోక్పీ జిల్లాకు చెందిన కమ్మిన్ హాంగ్‌షింగ్ మరియు కమ్మిన్ సేరు అనే మరో ఇద్దరిని టోర్ బంగ్లా ఏరియా చెక్‌పోస్ట్ వద్ద వారిని అడ్డుకుని, తదుపరి చర్యల నిమిత్తం చురాచంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌కి అప్పగించినట్లు తెలిపారు.
ఇంఫాల్ ఈస్ట్ మరియు వెస్ట్ జిల్లాల నుండి నిషేధించిన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యుఎన్‌ఎల్‌ఎఫ్)కి చెందిన మరో ఇద్దరు వ్యక్తలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నుండి 143 రౌండ్ల బుల్లెట్‌లతో పాటు 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరూ దోపిడీకి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అన్నారు. తౌబాల్ జిల్లాలోని చంద్రఖోంగ్ ప్రాంతానికి సమీపంలోని పర్వత ప్రాంతాల వద్ద జరిపిన సోదాల్లో భద్రతా దళాలు ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్, 9 ఎంఎం పిస్టల్ మరియు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.