
ప్రజాశక్తి :- ఓబులవారిపల్లి : ఓబులవారిపల్లి మండలంలో ఇటీవల రైతులను కొందరు దొంగ దెబ్బతీస్తున్నారు. ముఖ్యంగా మండల పరిధిలోని ముక్కా వారి పల్లి గ్రామంలో మరియు ఇతర కొన్ని గ్రామాలలో పంట పొలాలకు ఉపయోగించే విద్యుత్ మోటార్ వైర్లను కత్తిరించి దొంగతనం చేస్తూ రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇటీవల అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా పంట నష్టపోయి ఇబ్బందులు పడిపోవడానికి తోడు ఇప్పుడు ఈ దొంగలు మోటార్ వైర్లు దొంగలిస్తూ రైతులను మరింత కుదేలు చేస్తున్నారు. వైర్లను కట్ చేయడం, వాటిని కాల్చి అందులో ఉన్న కాపర్ ను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. రాత్రి వేళల్లో పొలాల వద్ద ఎవరు ఉండరని గ్రహించిన దొంగలు ఈ విధమైన దొంగతనాలకు పాల్పడుతున్నారని, ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు దొంగల దెబ్బ మరింతగా ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులో తెలిసినవారో తెలియదుగానీ వీరు చేసే దొంగతనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పోలీసులు దొంగదెబ్బ తీసే ఈ వైర్ దొంగల నుంచి రైతులకు విముక్తి కలిగించాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.