Oct 25,2023 13:35

న్యూఢిల్లీ :  ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో గర్భా వేడుకలో విషాదం చోటుచేసుకుంది. గర్భా ఆడుతుండగా చెలరేగిన వివాదంతో ఓ వ్యక్తి (52) మరణించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  తన కూతురును వేధించిన యువకులను ఆ వ్యక్తి వారించడంతో .. వారు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో అతను మరణించాడని అన్నారు.

ఫరీదాబాద్‌లోని సెక్టార్‌ 86లోని ప్రిన్సెస్‌ పార్క్‌ సొసైటీలో జరిగిన గర్భా వేడుకల్లో ప్రేమ్‌ మెహతా తన కుటుంబంతో సహా పాల్గొన్నారు.  ఇద్దరు యువకులు మెహతా కుమార్తెను ఫోన్‌ నెంబర్‌ ఇవ్వాలని అడిగారు. తమతో కలిసి డ్యాన్స్‌ చేయాలంటూ ఆమె చేతిని అసభ్యంగా తాకారు.దీంతో మెహతా, ఇద్దరు యువకుల మధ్య వాగ్వివాదం జరిగింది. వారు అతనిని గట్టిగా తోసేయడంతో మెహతా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మెహతా కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు.