ముంబయి : మహారాష్ట్ర సిఎంపై ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను అజిత్ పవార్ భర్తీ చేస్తారని అన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సిఎంగా ఆదివారం అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. సుమారు ఏడాది క్రితం శివసేనలో చీలికలకు కారణమైన ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించనున్నారని రౌత్ తెలిపారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్‌లను బిజెపి విచ్ఛిన్నం చేస్తోందని, కానీ ఇది వారికి ఏ మాత్రం ప్రయోజనం కలిగించదని అన్నారు. మహారాష్ట్రలో ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్‌సిపి నేతలు అవినీతికి పాల్పడుతున్నారని గతంలో ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని, కానీ ఇప్పుడు అదే ఎన్‌సిపి నేతలతో చేతులు కలిపారని దుయ్యబట్టారు.
ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేతృత్వంలోని బిజెపి .. మహారాష్ట్రతో పాటు దేశ రాజకీయాలను మురికిగా మార్చేసిందని మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం అజిత్ పవార్ ఈ కూటమితో కలిశారనుకోవడం లేదని పేర్కొంది. షిండే, ఆయన మద్దతుదారులపై త్వరలో అనర్హత వేటు పడుతుందని, పవార్‌ని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను రాష్ట్ర ప్రజలు అంగీకరించరని, ప్రజలు ఇలాంటి వాటికి మద్దతు ఇవ్వరు అని సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.










