Nov 10,2023 12:57

జెరూసలెం  :   పాలస్తీనా భూభాగమైన గాజాని పరిపాలించాలని కోరుకోవడం లేదని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూ పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ సైన్యం అనూహ్యమైన పనితీరు కనబరుస్తోందని భావిస్తున్నానని, అయితే గాజాను తిరిగి ఆక్రమించాలనే ఉద్దేశం లేదని అన్నారు. గురువారం జాతీయ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ వార్తలను తోసిపుచ్చారు. హమాస్‌పై కాల్పుల విరమణ అంటే వారికి లొంగిపోవడమేనని స్పష్టం చేశారు. సైనిక దాడికి టైమ్‌ లిమిట్‌ అంటూ ఉండదని అన్నారు. యుద్ధం దీర్ఘకాలమైనా కొనసాగిస్తామని చెప్పారు.

గాజా భూభాగాన్ని పరిపాలించాలని తాను భావించడం లేదని, ఆక్రమించాలనుకోవడం లేదని, కానీ గాజాకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలని ఆశిస్తున్నానని అన్నారు. గాజా నుండి ఎవరినీ వెళ్లగొట్టాలని అనుకోవడం లేదని అన్నారు. పేదరికంలో ఉన్న మరియు దిగ్బంధంలో ఉన్న భూభాగం నుండి సైన్యాన్ని ఉపసంహరించాలని, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, తిరిగి పునర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు. గాజాలో పౌర ప్రభుత్వాన్ని నియమించాలని అయితే ఆ ప్రభుత్వాన్ని ఎవరు నియమిస్తారన్న అంశాన్ని దాటవేశారు. గాజాలో హమాస్‌ వంటి ఉగ్రవాద సంస్థలు తిరిగి రాకుండా నిలువరిస్తామని అన్నారు.