Sep 18,2022 22:50
  • విద్యుత్‌ బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలవరం పునరావాసం, గిరిజనుల దుస్థితిపై అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చించాలని, కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్‌ సవరణ బిల్లును తిరస్కరిస్తూ తీర్మానం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. విజయవాడలోని సిపిఎం రక్షణభేరి పోస్టర్‌, పాటల సిడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరాన్ని పూర్తి చేయాల్సిన కేంద్రం ప్రాజెక్టును గాలికొదిలేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వమూ గట్టిగా అడగడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఇటీవల వచ్చిన గోదావరి వరదలకు ఏడు మండలాల పరిధిలోని 100 గ్రామాలు నేలమట్టం అయ్యాయని చెప్పారు. నిలువనీడలేని గిరిజనులు కొండలమీద, గుట్టలమీద అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో తలదాచుకోవాల్సి వచ్చిందని వివరించారు. దీనిపై బిజెపి నాయకులు నోరు మెదపడం లేదని విమర్శించారు. కాంటూరు లెవల్స్‌కు మునుగుతున్న ఊళ్లకు సంబంధం లేదని అన్నారు. పునరావాసం కోసం రూ.35 వేల కోట్ల నిధులు అవసరం ఉందని, ఈ మొత్తాన్ని రాబట్టుకోవడంపై రాష్ట్రం దృష్టి సారించాలని సూచించారు. ఒకవైపు పోలవరం ముంపు గ్రామాల ప్రజలు మునిగిపోతుంటే ముఖ్యమంత్రి దానిపై మాట్లాడకుండా శాసనసభలో రాజధానిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారన్నారు. ఆయనకు పోలవరం, ఆదివాసీల దుస్థితి కనిపించడం లేదని విమర్శించారు. వెంటనే పోలవరం, గిరిజనుల దుస్థితి, పునరావాసంపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలని, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు వివరించాలని డిమాండు చేశారు. ఈ విషయం పై చర్చించకపోతే అంతకంటే బాధ్యతారాహిత్యం ప్రభుత్వానికి మరొకటి ఉండదని తెలిపారు. రాష్ట్రానికి అమరావతే రాజధానంటూ అన్ని పార్టీలూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశాయని, ఇప్పుడు అధికారంలోకి రావడంతో వైసిపి ప్లేటు ఫిరాయించిందని పేర్కొన్నారు. రాజధాని వివాదానికి స్వస్తిచెప్పి రాష్ట్రాభివృద్ధిపై జగన్మోహన్‌రెడ్డి దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ ధరలు, ట్రూఅప్‌ భారాలు మోపారని, గతంలో 200 విద్యుత్‌ బిల్లు కట్టేవారు ఇప్పుడు నాలుగొందల కట్టాల్సి వస్తోందన్నారు. ప్రజలపై భారాలు మోపే విధంగా సరఫరాను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు పార్లమెంటులో విద్యుత్‌ సవరణ బిల్లు పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకారం తెలిపితే ప్రజలకు అందాల్సిన రాయితీలు, సబ్సిడీలూ అందకుండా పోతాయన్నారు. రాజశేఖరరెడ్డి పెట్టిన ఉచిత విద్యుత్‌ పథకం జగన్మోహన్‌రెడ్డి హయాంలో ప్రజలకు దూరమవుతుందని చెప్పారు. రాష్ట్రానికి చిత్తశుద్ధి ఉంటే విద్యుత్‌ సవరణ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, తెలంగాణా రాష్ట్రాలు ఈ బిల్లును తిరస్కరించాయని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ చీతాలను (చిరుతలు) విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారని, దేశ ప్రజలమీద కూడా వాటిమీద చూపించినంత ప్రేమ చూపించాలని కోరారు. జిఎస్‌టి పేరుతో లక్షల కోట్లను ప్రజల నుండి వసూలు చేస్తున్నారని, వంటగ్యాస్‌ను రూ.400 నుండి రూ.1100కు పెంచారని తెలిపారు. నిత్యావసర వస్తువులు, బియ్యం, పాలమీద జిఎస్‌టి వేసి కేంద్రం ప్రజలను పీల్చిపిప్పిచేస్తోందని, కేంద్రం ఆదేశాల పేరుతో వైసిపి ప్రభుత్వం ఇష్టారీతిన పన్నుల భారాలు మోపుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయని వివరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ధరలపైనా, ప్రజల బాధలపైనా చర్చించాలన్నారు. శాసనసభకు అధికారం ఉండాలని చెబుతున్నారని, కానీ ప్రత్యేక హోదా, విభజన హామీలు, చట్టం అమలు చేయాలని గతంలో శాసనసభ తీర్మానం చేసిందని, దీన్ని కేంద్రం పట్టించుకోకపోతే జగన్మోహన్‌రెడ్డి నోరెత్తలేదని. అప్పుడు అసెంబ్లీ అధికారాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రాజధాని, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక హోదా గురించి అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేయాలని తెలిపారు. 27న హోమ్‌శాఖ విభజన హామీలపై సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించాలని కోరారు.

  • రక్షణభేరి సభను జయప్రదం చేయాలి

కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్షణభేరి యాత్రలో భాగంగా 24వ తేదీన విజయవాడలో భారీబహిరంగ సభ జరుగుతుందని శ్రీనివాసరావు తెలిపారు. దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి హాజరవుతున్నారని పేర్కొన్నారు. 14వ తేదీ నుండి 27 వతేదీ వరకూ దేశవ్యాప్తంగా క్యాంపెయిన్‌ నడుస్తోందని వివరించారు. దీనిలో భాగంగా 23వ తేదీన పుట్టపర్తిలో బృందాకారత్‌, 26న కూనవరం, 27న విశాఖలో జరిగే బహిరంగ సభల్లో బి.వి.రాఘవులు పాల్గంటారని తెలిపారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రజలపై భారాలు వేయడం తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రజోపయోగ పని చేయలేదని విమర్శించారు. లేబర్‌కోడ్లు, ధరలు పెంచడం వంటి చర్యలతో ప్రజలపై భారాలు వేసిందని తెలిపారు.