Sep 27,2022 21:59
  • మోడీ భజన ఆపి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడండి
  • దేశ రక్షణ భేరి సభల్లో వైసిపి, టిడిపిలకు బివి రాఘవులు పిలుపు

ప్రజాశక్తి-యంత్రాంగం : భారత రాజ్యాంగంలో డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ పొందుపరిచిన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, ఫెడరలిజం, స్వావలంబన వంటి విలువలను ఈ దేశం కాపాడుకుంటూ వచ్చిందని, బిజెపి పాలనలో ఈ విలువలకు పెనుసవాలు ఎదురవుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. మోడీ పాలనను తక్షణం వదిలించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఎం ఆధ్వర్వాన విశాఖ నగరంలోని సెంట్రల్‌ పార్కు వద్ద, విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వద్ద మంగళవారం జరిగిన దేశ రక్షణ భేరి భారీ బహిరంగ సభల్లో ముఖ్య అతిథిగా పాల్గని ప్రసంగించారు. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పుడు విదేశీయులు, మేధావులు, జర్నలిస్టులు వ్యాసాలు రాస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యం, సమైక్యత ఉండదని ఊహాగానాలు చేశారన్నారు. నూటికి 12 మంది మాత్రమే అప్పటికి మనదేశంలో చదువుకున్నవారున్నారని, వందల భాషలు మాట్లాడేవారు ఒక్కతాటిపై ఉండలేరని విశ్లేషించారని పేర్కొన్నారు. కానీ, అవేవీ నిజం కాలేదన్నారు. దేశంలో ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్‌ వంటి చోట్ల దేశ సమైక్యతకు సవాళ్లు, వేర్పాటువాద ఉద్యమాలు ఎన్ని ఎదురైనా దేశం సమైక్యంగా ఉందన్నారు. దేశం ఇలా ఐక్యంగా ఉండేందుకు బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రోద్యమ కాలంలో గాంధీ, నెహ్రూ, సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, రాజేశ్వరరావు, భగత్‌సింగ్‌ వంటి జాతీయ నేతలు ఎంతో కృషి చేశారన్నారు. దేశంలో బిజెపి అధికారం చేపట్టిన నాటి నుంచీ ప్రజాస్వామ్యం, ప్రజలు, ప్రాంతాల మధ్య సామరస్యం ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. భిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని తెలిపారు. దేశ సమగ్రతను, ఐక్యతను దెబ్బతీసేందుకు, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపిలను సంతలో సరుకుల మాదిరి కొనుగోలు చేసి అప్రజాస్వామికంగా బిజెపి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం, అది సాధ్యం కానప్పుడు అనైతికంగా కూల్చివేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులపై దాడి చేస్తూ, ఆర్థిక అధికారాలను కేంద్రం మింగేస్తోందన్నారు. కేంద్ర ఒత్తిడికి, బెదిరింపులకు లంగిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం, చెత్త తదితర పన్నులు విధించడం వంటివి చేస్తున్నారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేశాక గతంలో గ్యాస్‌ సబ్సిడీని ఎత్తివేసినట్టే క్రమంగా ఉచిత విద్యుత్తును రద్దు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కొన్ని రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ వంటి చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాడకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి), సిబిఐ వంటి కేసుల భయంతో గప్‌చుప్‌గా ఉన్నాయని విమర్శించారు. మోడీ పాదపూజ చేస్తూ జగన్‌, చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. 'ప్రస్తుతం దేశంలో రాజ్యాంగ విలువలు, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయి. మోడీ భజన ఆపి పోరాటాల్లోకి రండి' అని వారికి రాఘవులు పిలుపునిచ్చారు. విశాఖ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ వైజాగ్‌లో స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టినా, జిఎస్‌టితో ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతున్నా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నోరుమెదపడం లేదనివిమర్శించారు. విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు (వైవి), రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి, కార్పొరేటర్‌ డాక్టర్‌.బి.గంగారావు ప్రసంగించారు. దీనికి ముందు విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజానాట్య మండలి కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయనగరంలో జరిగిన బహిరంగ సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
కర్నూలులోని చెన్నమ్మ సర్కిల్‌లో జరిగిన దేశ రక్షణ భేరి బహిరంగ సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ.గఫూర్‌ మాట్లాడుతూ బిజెపికి వ్యతిరేకంగా ముందుకొచ్చే వారిని బలపరచాలని, మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఎనిమిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలపై రూ.27 లక్షల భారం వేసిందని తెలిపారు. పన్నులు తగ్గిస్తే సగం ధరలు తగ్గుతాయన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ మోడీ పాలనలో కార్పొరేట్ల వికాసం తప్ప ప్రజల వికాసం ఎక్కడా లేదని తెలిపారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి నిర్మల పాల్గన్నారు.
కాకినాడలో సుందరయ్య భవన్‌ నుంచి బాలాజీచెరువు సెంటర్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్‌.నర్సింగరావు, ఎవి.నాగేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించుకునేందుకు పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కాకినాడ నుంచి పెట్రో యూనివర్సిటీని తరలించారని, పోలవరం నిర్వాసితులను గాలికొదిలేశారన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేలేకపోతోందని విమర్శించారు. జిల్లా కన్వీనర్‌ ఎం.రాజశేఖర్‌ అధ్యక్షత వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ర్యాలీ, బహిరంగ సభ జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ నూతన అటవీ విధానాన్ని తీసుకొచ్చి అడవుల నుంచి ఆదివాసీలను వెళ్లగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తోన్న కుట్రను తిప్పికొట్టాలని కోరారు. సిపిఎం డుంబ్రిగుడ మండల కార్యదర్శి పోతురాజు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స ప్రసంగించారు. చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ సెంటర్‌ పార్కులో నిర్వహించిన బహిరంగ సభకు నగర నాయకులు లోకయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శి వాడా గంగరాజు పాల్గని ప్రసంగించారు.

desa rakshana bheri in visakha bv raghavulu desa rakshana bheri in ongole