Sep 26,2022 16:45
  •  కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై కొనసాగిన దేశ రక్షణ భేరి

ప్రజాశక్తి - యంత్రాంగం : కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాలను నిరసిస్తూ సిపిఎం చేపట్టిన దేశ రక్షణభేరి ప్రచారోద్యమం సోమవారమూ కొనసాగింది. బిజెపి అమలు చేస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ..కరపత్రాలు పంచారు. మోడీ గద్దె దిగాలంటూ పలు జిల్లాల్లో ర్యాలీలు, సభలు జరిగాయి. ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు.
అనకాపల్లిలోని ఎన్‌టిఆర్‌ స్టేడియంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజల సంపదను కార్పొరేట్‌ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీని సాగనంపకపోతే దేశం అధోగతిపాలవుతుందన్నారు. మూడు వ్యవసాయ నల్లచట్టాలను దొడ్దిదారిని అమలు చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. స్మార్ట్‌ విలేజ్‌ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి బిజెపి నాయకులు రూ.500 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. అరకు మాజీ ఎంపి కొత్తపల్లి గీత కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టారని తెలిపారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అదానీకి, పోస్కోకు అప్పగించాలని కేంద్రం చూస్తోందన్నారు. 'ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే.. అమరావతి రైతుల పాదయాత్రను కాదు, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకొని తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి' అని అన్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసిన మొదటి నేరస్తుడు మోడీ అయితే, రెండో నేరస్తుడు జగన్‌ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గౌరవాన్ని వైసిపి, టిడిపిలు మోడీ మోకాళ్లు ముందు తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తోన్న ఈ పార్టీలకు పుట్టగతులుండవన్నారు. సంక్షేమ పథకాలకు కోతలు పెడితే, ప్రభుత్వానికి ప్రజలు వాతలు పెడతారని హెచ్చరించారు. ప్రజలపై ప్రభుత్వాలు మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాడాలన్నారు. బిజెపి, టిడిపి, వైసిపి ఇతర పార్టీలకు వామపక్ష ప్రభుత్వాలే ప్రత్యామ్నాయమన్నారు. కేరళలో సిపిఎం నాయకత్వాన వామపక్ష ప్రభుత్వం అందిస్తోన్న ప్రజారంజక పాలనను వివరించారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. సభలో పార్టీ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, డి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి జిటి రోడ్డు మీదుగా డైమండ్‌ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, మోడీ గద్దె దిగాలంటూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. అనంతరం డైమండ్‌ పార్కులో నిర్వహించిన బహిరంగ సభలో సిపిఎం మాజీ ఎంపి పి.మధు మాట్లాడారు. బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయన్నారు. అంబానీ, అదానీలకు రాయితీలిచ్చి.. ప్రజలపై పన్ను భారాలు మోపుతోందని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాను అమలు చేస్తూ మతోన్మాద చర్యలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని విమర్శించారు.
డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ జిల్లా అమలాపురం బస్టాండ్‌ నుంచి గడియారస్తంభం సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ కారెం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జమలయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కన బెట్టి కుల,.మత, ప్రాంతాల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతోందన్నారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతోందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పూనుకుందన్నారు.కాకినాడ జిల్లా పిఠాపురంలో కరపత్రాలు పంచారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సుందరయ్య భవనం నుంచి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డివేణు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు, కె.సుబ్బరావమ్మ మాట్లాడారు. రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసిందన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలోని జగదాంబ నగర్‌, ఎల్‌బిజి నగర్‌, సుందరయ్య కాలనీ, వినాయక నగర్‌ ప్రచారం చేపట్టారు.
కడప, అన్నమయ్య జిల్లాల్లో పలు కాలనీల్లోనూ, ఒంగోలు అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లోనూ కరపత్రాలు పంపిణీ చేశారు. మార్కాపురంలోని గడియార స్తంభం సెంటర్‌, దోర్నాల బస్టాండ్‌ సెంటర్‌, కంభం రోడ్డు సెంటరులో విస్తృత ప్రచారం నిర్వహించారు. కర్నూలులోని 43, 44 వార్డులలో పాదయాత్ర చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి.నిర్మల పాల్గొన్నారు. కోడుమూరు, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లో ప్రచారాలు నిర్వహించారు.

desa rakshana bheri in anakapalli vsr rally