Jul 31,2023 17:41
  • టమోటా చెట్ల మొదలను వేర్లకు పెరికివేసిన వైనం
  • సుమారు పది లక్షల వరకు పంట నష్టం
  • తమకు ప్రభుత్వం న్యాయం చేసి, ఆదుకోవాలంటూ రైతు కుటుంబం ఆవేదన

ప్రజాశక్తి-నిమ్మనపల్లి : అన్నదాత రోజంతా శ్రమించి వ్యవసాయం చేసి తాను పండించిన ధాన్యంతో పదిమందికి కడుపు నింపుతూ బ్రతుకుతున్నాడు. నిత్యం నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న రైతుకు అనుకోకుండా టమోటా ధరలు పెరిగి రైతుల జీవితాల్లో ప్రస్తుతం వెలుగులు నింపుతున్నాయి. తమ జీవితాలు బాగుపడుతున్నాయని ఆశతో టమోటా రైతు ఆనందం వ్యక్తం చేస్తున్న తరుణంలో, వారి ఎదుగుదలను ఓర్వలేని కొంతమంది వ్యక్తులు వివిధ రకాలుగా టమోటా రైతుకు పంట నష్టం కలిగిస్తూ వస్తున్నారు. ఇలాంటి కోవకే చెందిన ఓ సంఘటన నిమ్మనపల్లి మండలం తవళం గ్రామంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... తవళం గ్రామం ఉంటావారిపల్లెకు చెందిన ఏ.గంగిరెడ్డి కుమారుడు ఏ.ముత్యాలు ఉంటావారిపల్లెలో వాలంటీరు గాను పనిచేస్తున్నారు. వీరి సొంత భూమిలోని సుమారు 30 కుంటల్లో తండ్రితో కలిసి ముత్యాలు సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి టమోటా పంటను సాగు చేశారు. ఆదివారం మొదటి కోతలో 20 క్రేట్ల టమోటాలను కోసి మదనపల్లె మార్కెట్ కు తరలించగా, అక్కడ ఒక్కొక్క క్రేటు రూ.4,400/- లకు విక్రయించినట్లు తెలిపారు. టమోటా కోత దశలో ఉందని, టమోటా ధరలు బాగున్నాయని ఆశాభావంతో కుటుంబం మొత్తం టమోటా పంట పై ప్రత్యేక శ్రద్ధను చూపినట్లు తెలిపారు. రాత్రి వేళల్లో సైతం టమోటా పంట వద్ద కాపలా ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి కూడా సుమారు 11 గంటల సమయంలో  పంటను పరిశీలించి ఇంటికి వెళ్ళామని అన్నారు. సోమవారం ఉదయాన్నే టమోటా పంట వద్దకు రాగా గుర్తుతెలియని వ్యక్తులు తాము సాగు చేసిన 30 కుంటలలోని టమోటా చెట్ల మొదలను వేర్లకు పెరికివేసి పంటను ధ్వంసం చేసి ఉంచడాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఎన్నో ఆశలతో టమోటా పంటను సాగు చేశామని, ప్రస్తుతం మంచి ధరలు ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు పంటను ధ్వంసం చేసి సుమారు పది లక్షల వరకు తీవ్ర నష్టం కలిగించారని ఆవేదన చెందారు. రైతు కుటుంబం పడిన శ్రమను దుండగులు నాశనం చేశారని శోకసముద్రంలో మొనగారు. జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై రామకృష్ణ, వ్యవసాయ అధికారిని లక్ష్మీ ప్రసన్న, ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వర్ ప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దుండగులను గుర్తించి తమకు న్యాయం చేయాలని, తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.