Jul 25,2021 07:49

జీడిమెట్ల (హైదరాబాద్‌) : తల్లి క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు వైద్యం చేయించాలని కుమార్తె ఆశపడింది. తెలియక సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కింది. రూ.8 లక్షలపైనే పొగొట్టుకుంది. మోసపోయానని గ్రహించిన యువతి చివరకు జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది.
   పూర్తి వివరాల్లోకెళితే... జీడిమెట్ల ఠాణా పరిధి చింతల్‌కు చెందిన మహిళకు ఈ నెల 9 న ఓ ఫోన్‌ వచ్చింది. విజరుకుమార్‌ను మాట్లాడుతున్నానని, 'కౌన్‌ బనే గా కరోడ్‌పతి' లో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నారని చెప్పాడు. ఖాతా నంబరు చెప్పమన్నాడు. సైబర్‌ నేరగాళ్లు అని తెలీక ఆ యువతి తన స్నేహితుల ఖాతా నంబరు ఇచ్చింది. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు చెల్లించాలనడంతో మీ సేవా కేంద్రం నుంచి వారు చెప్పిన ఖాతాకు నగదును పంపింది. 15 న మరో వ్యక్తి వాట్సాప్‌కాల్‌ చేసి.. తాను సునీల్‌మెహతా అని, కౌన్‌ బనేగా కరోడ్‌పతికి విచారణ అధికారిని అన్నాడు. కరెన్సీ మార్పు కోసం రూ.75 వేలు చెల్లించాలని చెప్పడంతో చెల్లించింది. 16 న మకొకరు ఫోను చేసి.. రూ.25 వేలు చెల్లించాలనడంతో పంపించింది. 17 న సునీల్‌ మెహతా మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రైజ్‌ మనీ పంపించాం. ఇన్‌కంట్యాక్స్‌ అధికారులు ఆపేశారు. సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని చెప్పాడు. రెండు బ్యాంకు ఖాతాలను పంపించి.. రూ.1.25 లక్షలు చెల్లించాలని సూచించడంతో ఆ మొత్తం కూడా పంపించింది. ఇలా రకరకాల కారణాలను చెబుతూ 18 న రూ.1.30 లక్షలు, 21 న మరికొంత నగదును స్వాహా చేశారు. ఇలా... 13 రోజులపాటు సాగిన సంభాషణలో బాధితురాలు విడతల వారీగా రూ.8,18,000 చెల్లించింది. మళ్లీ ఫోను చేసి నగదు కావాలని అడుగుతుండటంతో మోసపోయినట్లు గ్రహించిన ఆ యువతి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.