Nov 06,2023 11:44

టెల్‌ అవీవ్‌ : అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో గాజాలో ఇజ్రాయిల్‌ మారణహోమం సృష్టిస్తోంది. ఇజ్రాయిల్ సైన్యం  గాజా సిటీని చుట్టుముట్టడంతో పాటు .. గాజా ను ఉత్తర గాజా, దక్షిణ గాజా అని రెండు భాగాలుగా విభజించింది. ''గాజా నగరాన్ని మేం చుట్టుముట్టాం. ఇప్పుడు ఇక ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాం. ఈ యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ. మేం మరింత కీలకంగా దాడులు చేయబోతున్నాం'' అని ఇజ్రాయెల్‌ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మీడియాకు వెల్లడించారు. బందీలను వదిలిపెట్టేవరకు కాల్పుల విరమణ ప్రస్తావన ఉండదని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ ప్రకటించారు. గెలిచే వరకు యుద్ధం కొనసాగిస్తామని, మాకు మరోమార్గం లేదని మరోసారి స్పష్టం చేశారు. 

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఆదివారం సమావైశమైన సంగతి తెలిసిందే. పాలస్తీనా సమస్యకు సమగ్ర పరిష్కారం చూపితే, గాజాలోను పాలస్తీనా అథారిటీ అధికారంలోకి తిరిగి రాగలదని అబ్బాస్‌ బ్లింకెన్‌తో అన్నట్లు రాయిటర్‌ వార్తా సంస్థ తెలిపింది. గాజా సంధి కుదుర్చుకోవాలని అరబ్‌ నాయకులతో కలసి అబ్బాస్‌ అమెరికాను కోరినట్లు తెలుస్తోంది. ఆంటోనీ బ్లింకెన్‌ పర్యటన అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.