భారాలు మోపే సంస్కరణలు తిరస్కరించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు

ప్రజాశక్తి-విశాఖ : కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, సంస్కరణలు పట్టణ ప్రజలపై పెను భారాలు పడుతున్నాయని వీటిని పట్టణ ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి. హెచ్. బాబురావు పిలుపునిచ్చారు. శుక్రవారం డాబాగార్డెన్స్‌లో అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సంస్కరణలు - పట్టణ ప్రజలపై దుష్ప్రభావం అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ సిపిఎం నిర్వహించింది. ఈ సెమినార్ కు బాబురావు ముఖ్యవక్త గా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర బిజెపి, రాష్ట్ర వైసిపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, పట్టణ సంస్కరణలు వలన పట్టణ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. ఇప్పటికే ఆస్థి విలువ ఆధారిత పన్నులు, చెత్తపన్ను, మురుగునీటి పన్నులతో పాటు అమృతపథకం పేర కొళాయిలకు నీటి మీటర్లు బిగించబోతున్నారు. విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం మోపుతున్నాయి. ఆదానికి లాభాలు కోసం విద్యుత్ మీటర్లు బిగించి ప్రజల నడ్డి విరగ్గొట్టబోతున్నారు. మురుగునీటి చార్జీలు తో పాటు ప్రజలకు కార్పొరేషన్లు అందించే ప్రత్రి దానిపై యూజర్ చార్జీలు విధిస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వం 24/7 పేర వీధి కొళాయిలను తొలగించి నీటి మీటర్లు పెట్టబోతే ప్రజలు అడ్డుకున్నారని గుర్తు చేసారు. ఈ సంస్కరణలకు ప్రత్యామ్నాయం సిపిఎం చూపించిందాన్నారు. నవంబర్ 15న లక్షల మంది తో ప్రజా రక్షణ భేరి జరుగుతుందన్నారు.
సిపిఎం జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి గంగారావు అధ్యక్షత న జరిగిన ఈ కార్యక్రమం లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యుటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గు నాయుడు, విజయవాడ టాక్స్ పేయర్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ ఎం వి ఆంజనేయులు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఎ అజ శర్మ, బొట్టా ఈశ్వరమ్మ, జగన్, ఆర్. కె యస్ వి కుమార్, పీపుల్ ఫర్ ఇండియా నాయకులు బి యల్ నారాయణ, వార్వా అధ్యక్షులు గురప్ప తదితరులు పాల్గొన్నారు.