Oct 25,2023 10:54
  • నవంబరు 1 నుండి 3 ప్రాంతాల నుండి రాష్ట్ర బస్సుయాత్రలు
  • నవంబరు 3, 4 తేదీల్లో విశాఖకు రానున్న బస్‌యాత్ర 
  • ప్రజాప్రణాళిక విడుదల చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధికోసం సిపిఎం నవంబరు 15న విజయవాడ ఎంబి స్టేడియంలో లక్షలాది మందితో ప్రజా రక్షణ భేరి (భారీ బహిరంగ సభ) నిర్వహిస్తున్నట్లు సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు తెలిపారు. బుధవారం మద్దెలపాలెం , పిఠాపురం కాలనీలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రజా ప్రణాళికను విడుదల చేసారు. అనంతరం మాట్లాడుతూ జగ్గునాయుడు రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు ప్రజా సమస్యలను పక్కదారిపట్టించే విధంగా తమ విధానాలుంటున్నాయన్నారు. బిజెపి, వైసిపి ప్రభుత్వాలు ప్రజలను పీడిరచే విధంగా ధరలు భారాలు మోపుతున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజాల అజెండా, అసమానతలు లేని అభివృద్ధికోసం నవంబరు 1న రాష్ట్రంలో 3 ప్రాంతాల నుండి రాష్ట్ర బస్సుయాత్రలు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్నం పెందుర్తి జంక్షన్‌కు నవంబర్‌ 3న సాయంత్రం చేరుకుంటుంది. 4న ఎన్‌ఏడి జంక్షన్‌, కంచరపాలెం మెట్టు, పూర్ణామార్కెట్‌, శ్రీహరిపురం, గాజువాక, కూర్మన్నపాలెంలో బస్‌యాత్ర చేరుకొని సభలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ, ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ, మూతపడిన పరిశ్రమలు తెరిపించడం, ధరలు అదుపుచేయడం, వంటగ్యాస్‌ ధర 400రూ.లు, పెట్రోల్‌, డీజిల్‌ లీటరు 60రూ.లకే ఇవ్వడం, పేదలందరికీ ఉచిత విద్యా, వైద్యం అందించడం, సామాజిక పెన్షన్‌ నెలకు 5వేలు, ఇళ్ళు లేనిపేదలకు నివాస గృహాలు ఏర్పాటు, మెగా డిఎస్సీ, నిరుద్యోగ భృతి 5000, రైతులకు గిట్టుబాటు ధర, అసంఘటితరంగ కార్మికులకు సమగ్ర చట్టం, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులరైజేషన్‌, కనీసవేతనం 26వేలు, స్కీం వర్కర్స్‌ను ప్రభుత్వఉద్యోగులుగా గుర్తింపు, పేదలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, మైనార్టీల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్లు అమలు, వృత్తుదారులు, వికాలంగులకు ఉపాధి భధ్రత, మహిళలకు రక్షణ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు కేటాయింపు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌, విభజన హామీలు అమలు వంటివాటితో కూడిన ప్రజాప్రణాళిక సిపిఎం ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఇది అమలు జరిగే విధంగా సిపిఎం పార్టీని బలపర్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు వి.కృష్ణారావులు పాల్గొన్నారు.