ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సిపిఎం కేంద్ర కమిటీ పిలుపుపై సెప్టెంబరు 14 నుంచి 27 వరకు దేశ రక్షణ భేరిని రాష్ట్రంలో జయప్రదం చేసిన ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తీవ్రమైన ఎండను, కొన్నిచోట్ల వర్షాలను సైతం లెక్కజేయకుండా వేలాదిగా ప్రజలు ఈ సభలకు తరలి వచ్చారని తెలిపారు. విజయవాడ, కూనవరం, విశాఖపట్నం, పుట్టపర్తిలో భారీ బహిరంగ సభల్లో జాతీయ నాయకులు హాజరై ప్రసంగించారని, అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు, ప్రదర్శనలు జరిగాయని వివరించారు. మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో దేశ ప్రజలకు, రాష్ట్రానికీ చేసిన మేలు ఒక్కటీ లేకపోగా భారాలు, నిరుద్యోగం పెంచి రాష్ట్రానికి ద్రోహం చేసిందని విమర్శించారు. పోలవరంలో గిరిజనులను ముంచారని, మోడీ పాలనపై తీవ్ర అసంతృప్తితో ప్రజలు విసుగెత్తిపోయారని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి కేంద్రానికి లొంగిపోయిన రాష్ట్ర ప్రభుత్వంపైనా అసంతృప్తి పెరుగుతోందని, అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ఇద్దరూ కలిసి మోడీ పల్లకిని మోయడంపట్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారని వివరించారు. ఇప్పటికైనా రాష్ట్ర హక్కుల కోసం ప్రాంతీయ పార్టీలు నిలబడాలని కోరారు. మోడీ పాలనకు చరమగీతం పాడేందుకు, రాష్ట్ర ప్రజలపై జగన్ ప్రభుత్వం వేస్తున్న భారాలకు వ్యతిరేకంగా భవిష్యత్‌లో సమైక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలను కోరారు.










