ప్రజాశక్తి-విజయవాడ : దసరా, దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ దుకాణాల ద్వారా రెగ్యులర్‌గా అందిస్తున్న కందిపప్పు, పంచదారను సరిపోయినంతగా సరఫరా చేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మూడు నెలల నుండి కందిపప్పు, పంచదార సరఫరాలో కోత విధిస్తున్నారని తెలిపారు. సరఫరాదారులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో కోటీ 45 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు కేజీ కందిపప్పు, అరకేజీ పంచదార ఇవ్వాలన్నారు. ఇందుకు గాను సుమారు 7 వేల టన్నుల కందిపప్పు, 70 లక్షల కిలోలు పంచదార అవసరం కాగా ప్రభుత్వం మాత్రం అక్టోబరు ఒకటో తేదీ నాటికి చౌక దుకాణాలకు 825 టన్నులు కందిపప్పు, 9.5 లక్షల కిలోలు పంచదార మాత్రమే సరఫరా చేసినట్లు ప్రభుత్వ లెక్కలు చూపుతున్నాయని పేర్కొన్నారు. కావాల్సిన దానిలో 10.53 శాతం మందికి మాత్రమే సరఫరా చేయడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని తెలిపారు. పెరిగిన ధరలతో బయట మార్కెట్‌లో నిత్యావసరాలు కొనలేని పరిస్థితిలో ఇబ్బందులు పడుతున్న పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందించే కందిపప్పు అంతో ఇంతో ఆదుకుంటోందని వెల్లడించారు. ప్రభుత్వం దానికి కూడా కోత విధించడం గర్హనీయమన్నారు.
కాగా కేంద్రప్రభుత్వం కూడా 89,23,892 కార్డులను మాత్రమే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద గుర్తించామని మిగిలిన వాటికి సబ్సిడీ నిలిపివేసిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డులను నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద గుర్తించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కోతలు లేకుండా లబ్ధిదారులందరికీ కందిపప్పు, పంచదార సరఫరా చేయాలని వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.










