
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుని, రాహుల్ ఆధ్వర్యంలో భారత దేశ యాత్ర చేపట్టింది. ఇంతవరకూ అధినేత రాహుల్ గాంధీ దశాబ్దమున్నర కాలంగా అప్పుడప్పుడూ మెరుపు యాత్రలు, విహార యాత్రలు చెయ్యడం తప్పించి సీరియస్ గా ప్రజలతో నడిచింది లేదు. ఇప్పుడు కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్ని స్పృశిస్తూ ఐదునెలల పాటు, 3500 కిలోమీటర్లు పాదయాత్రకు బయలుదేరడం అభినందనీయం. తద్వారా ప్రజల సమస్యలేమిటో ప్రత్యక్షంగా చూడడం అన్న ప్రాథమిక బాధ్యత నెరవేరుతుంది. వాటిపై ఒక రాజకీయ పార్టీగా ఎలా స్పందించాలి, తాము చూపించే పరిష్కార మార్గాలేమిటి అన్నవి ఎంచుకోవడం తదుపరి బాధ్యత. వాటిని ప్రజలెంత వరకూ నమ్మారు, ఎంత ఆమోదించారు అన్న వాటిపై ఆ పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రజలు పూర్తి విశ్వాసం కనపర్చినా వాటిని వోట్ పవర్‌గా మార్చుకోవడం, అలా మార్చుకోగల పటిష్టమైన పార్టీ నిర్మాణం చేసుకోవడం ఇంకో రాజకీయ గమ్యం ఆ పార్టీకి. ఏదైనా ప్రజలకు చేరువ కావడం ప్రాథమిక అంశం కాబట్టి ఆ దిశగా ఆ పార్టీ చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే. ఎందుకంటే ఆ పార్టీ బలపడడం ఆ పార్టీకే సంబంధించిన వ్యవహారం కాదు. దేశానికి కూడా మేలు చేసే కార్యక్రమం. రాష్ట్రాల వారీగా బలమైన ప్రాంతీయ పార్టీలు ఎక్కువగానే ఉన్నా, జాతీయ స్థాయిలో బీజేపీ కి సవాల్ చేసే స్థాయి పార్టీలు లేవు. దేశానికి బలమైన స్థిరమైన అధికార పక్షం ఎంత అవసరమో, బలమైన ప్రతిపక్షం కూడా అంతే అవసరం. ఒకప్పుడు తిరుగులేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడా తిరగలేని పార్టీగా మిగిలింది. ప్రజల నుండి దూరమై, నాయకత్వలేమి తో కనుమరుగయ్యే స్థితికి చేరుకుంది. అయినా దేశ వ్యాప్తంగా ఆ పార్టీ ఎంతో కొంత గుర్తింపుని కలిగే ఉంది. కాబట్టి ఆ పార్టీ బలపడితే జాతీయ స్థాయిలో దీటైన ప్రత్యామ్నాయం కాలేకపోయినా, అలాంటి ప్రాంతీయ ప్రత్యామ్నాయాల్ని కలిపి ఉంచగల శక్తిగా ఉంటుంది. ఆరోగ్యకర ప్రజాస్వామ్యానికి అవసరం ఇది.
- డా. డి.వి.జి.శంకర రావు, మాజీ ఎంపీ, పార్వతీపురం.