
ఏడు సంవత్సరాల క్రితం క్రాప్ నమోదు...ఈక్రాప్ యాప్‌లో ప్రభుత్వ రంగ సంస్థ (ఎన్.ఐ.సి) ద్వారా జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఆర్.బి.యు.డి.పి. (యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్) యాప్ ద్వారా నమోదు జరుగుతున్నది. కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రైవేట్ సంస్థ ఇది. దీనికి వెబ్‌ల్యాండ్‌తో లింక్ లేకపోవడం, జియో ట్యాగింగ్ లేకపోవడం వలన అధికారులకు, రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. చాలా చోట్ల సర్వర్ పనిచేయక పోవడం, బయోమెట్రిక్ వేయడానికి మరొకసారి రైతులు రాలేకపోవడం, దీనికి ప్రత్యామ్నాయంగా ఓటిపి వుందనేది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల జిల్లాలో 50 శాతం రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు.
రైతులను ఆదుకొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వై.ఎస్.ఆర్. ఉచిత బీమా అమలు చేస్తామని 2019లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 2 సంవత్సరాలుగా ఈ బీమా అమలవుతున్నా రైతులకు ఆశించినంత ప్రయోజనం జరగలేదు. ముఖ్యమంత్రి గత నెలలో శ్రీసత్యసాయి జిల్లా సి.కె.పల్లి మండల పర్యటన సందర్భంగా...2021లో పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ ప్రకటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇన్సూరెన్స్ పరిహారం వస్తుందని రైతులందరూ ఎదురు చూశారు. కానీ కొందరికే వచ్చింది.
ఈక్రాప్ బుకింగ్ జరిగినప్పటికీ (ఇకెవైసి) వేలి ముద్ర పడకపోవడంతో పంట నష్టపోయిన చాలా మంది రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు. ఇన్సూరెన్స్ వచ్చిన రైతులకు కూడా 50 వేల రూపాయలు లోపల వున్న వారికే డబ్బులు పడ్డాయి. ఆ పైన వున్న వారికి డబ్బులు పడలేదు. దీనిపై సచివాలయాల వద్ద రైతులు ఆందోళన చేయడంతో ఇన్సూరెన్స్ రాని రైతులు జూన్ ఆఖరి దాకా భరోసా కేంద్రాలలో నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
ఇన్సూరెన్స్ రెండు పథకాల ద్వారా మొత్తం జిల్లాలో 15 పంటలకు మాత్రమే బీమా వర్తిస్తుందని అది కూడా ఆయా మండలాలకు వర్తించే పంటలు ఏవి, వర్తించనివి ఏవి అనే నిబంధనలు పెట్టారు. దాంతో కొన్ని పంటలకు మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది. వచ్చే పరిహారం కూడా ఒక మండలానికి మరొక మండలానికి తేడాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ పథకాలకు మండలం యూనిట్‌గా నిబంధనలు వర్తింపచేశారు. వాతావరణ బీమా వర్తింపజేసినందున శ్రీ సత్యసాయి జిల్లాలో 18 మండలాలు, అనంతపురం జిల్లాలో 5 మండలాల్లో వేరుశనగ పంటలకు ఇన్సూరెన్స్ ఒక్క నయా పైసా కూడా రాదని తేల్చిచెప్పారు. మిగిలిన మండలాలలో 600 నుండి 2000 మాత్రమే ఇన్సూరెన్స్ నామినల్‌గా అమలయ్యింది. పంటల నమోదు కొత్త యాప్ ద్వారా చేయడంలో సర్వర్ పని చేయకపోవడం, ఈకెవైసి వేలిముద్రలు పడకపోవడంతో 50 శాతం రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు.
వాతావరణ బీమా పథకం కింద జిల్లా లోని ప్రతి మండలానికి వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట నష్టాన్ని గుర్తిస్తారు. పంట కోత సమయంలో అధిక వర్షాలకు తడిచిపోయి పంటలు పూర్తిగా నష్టపోయినా ఇన్సూరెన్స్ రాదనేది నిబంధన. ఈ నిబంధన వలనే జిల్లాలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో అధిక వర్షాలతో నష్టపోయిన పంటకు వాతావరణ బీమా కింద ఎటువంటి పరిహారాన్ని పొందలేకపోయారు. తడిచిపోయిన పంటను తొలగించేందుకు కూలీల ఖర్చు కూడా రాని పరిస్థితి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2021 సంవత్సరం ఖరీఫ్‌లో 6,40,779 హెక్టార్లలో పంటలు వేశారు. ఇందులో వేరుశనగ పంట 4,40,988 హెక్టార్లు. వేరుశనగ రైతులకు ఇన్సూరెన్స్ వర్తింపచేయకపోవడంతో రైతులలో నిరాశ మిగిలింది. అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు పెట్టి వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధపడిన ప్రభుత్వాలు... వేరుశనగ పంట పండించే రైతులకు నిబంధనలు పెట్టి ఇన్సూరెన్సు వర్తించకుండా చేయడం ఎంతవరకు సమంజసం?
ఉమ్మడి జిల్లాలో పంటలు వేసిన రైతులు 7,27,951 మంది. ఇందులో 55.60 శాతం రైతులకే ఇన్సూరెన్స్ ప్రకటించారు. నయా పైసా ఇన్సూరెన్స్ రాని రైతులు 44.40 శాతం వున్నారు. ఇన్సూరెన్స్ పథకాలలో వున్న లోపం, పంటల నమోదు పథకం లోని లోపాలు... వెరసి ఎక్కువ మంది రైతులకు ఇన్సూరెన్స్ రాకపోవడం గమనించవచ్చు.
ఏడు సంవత్సరాల క్రితం క్రాప్ నమోదు...ఈక్రాప్ యాప్‌లో ప్రభుత్వ రంగ సంస్థ (ఎన్.ఐ.సి) ద్వారా జరిగింది. గత మూడు సంవత్సరాలుగా ఆర్.బి.యు.డి.పి. (యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్) యాప్ ద్వారా నమోదు జరుగుతున్నది. కొత్తగా ప్రవేశ పెట్టిన ప్రైవేట్ సంస్థ ఇది. దీనికి వెబ్‌ల్యాండ్‌తో లింక్ లేకపోవడం, జియో ట్యాగింగ్ లేకపోవడం వలన అధికారులకు, రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్.బి.కె. కేంద్రాలలోనే రైతులు పంటలు నమోదు చేసుకోవాల్సి వచ్చింది. చాలా చోట్ల సర్వర్ పనిచేయక పోవడం, బయోమెట్రిక్ వేయడానికి మరొకసారి రైతులు రాలేకపోవడం, దీనికి ప్రత్యామ్నాయంగా ఓటిపి వుందనేది రైతులకు అవగాహన లేకపోవడం వల్ల జిల్లాలో 50 శాతం రైతులకు ఇన్సూరెన్స్ రాలేదు.
ఈక్రాప్ బుకింగ్ చేసే అధికారులకు శిక్షణ ఇవ్వకపోవడం వలన అగ్రికల్చర్ సిబ్బంది ఇబ్బుందులు పడ్డారు. అదేవిధంగా ఈ క్రాప్ కొత్త విధానం పట్ల రైతులకు గ్రామాల్లో టాంటాం వేసి ప్రచారం చేయడం, అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈక్రాప్ బుకింగ్ అయ్యి వేలి ముద్ర పడలేదన్న విషయాన్ని గమనించలేకపోవడం, సర్వర్ సమస్య కారణంగా జరిగిన తప్పుల వల్ల...ప్రకటించిన ఇన్సూరెన్స్ లిస్టులో వేలాదిమంది రైతుల పేర్లు రాలేదు. అనంతపురం ఉమ్మడి జిల్లాలో క్రాప్ బుకింగ్ పంట నమోదై ఈకెవైసి వేలిముద్ర పడని రైతులు 63,313 మంది వున్నారంటేనే పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు. ఇదంతా ప్రభుత్వ నిర్వాకం వల్లే జరిగింది. ఈకెవైసి కాకపోతే, ఓటిపి ద్వారా కూడా ఆమోదం పొందవచ్చు అన్నది రైతులలో అవగాహన లేకపోవడం, పంటలు పెట్టిన పద్ధతులు, వలసలు మరియు అనారోగ్యం కారణంగా బయోమెట్రిక్ వేయడానికి రాలేకపోయారు. ఈ తప్పులకు, పొరపాట్లకు ప్రభుత్వం బాధ్యత వహించి పంట నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం అందించాలి.
రైతులు కోరుకున్నది...
* ఈకెవైసి (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) బయోమెట్రిక్ (వేలి ముద్ర) పడని 63313 మంది రైతులకు (ఉమ్మడి జిల్లాలో) అవకాశం కల్పించి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఙవాతావరణ బీమా పాలసీలో వున్న లోపాల వల్ల వేరుశన పంట పెట్టి నష్టపోయి ఇన్సూరెన్స్ రాని రైతులందరికి ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం అందించి ఆదుకోవాలి. ఙవాతావరణ బీమా, పంటల బీమా పథకాలు వర్తించని మరియు నాన్ నోటిఫైడ్ పంటలు (వక్క, ఆకుతోటలు, ఔషధ మొక్కలు, పట్టు, మామిడి, సపోటా, బొప్పాయి, నిమ్మ...) పెట్టి అధిక వర్షాలకు నష్టపోయిన రైతులందరికి పరిహారం ఇవ్వాలి.
* ఈక్రాప్ విధానం పట్ల రైతులకు అవగాహన కల్పించాలి. ఈక్రాప్ యాప్‌పై పనిచేసే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం శిక్షణ ఇవ్వాలి.
* ఇన్సూరెన్స్ పథకాలలో రైతు ప్రయోజనాలకు నష్టం కలుగజేసే క్లాజులను సవరించాలి.
* క్రాప్ బుకింగ్ చేస్తున్న కొత్త యాప్ (యుడిపి)లో వస్తున్న ఇబ్బందులను, లోటుపాట్లను నిపుణులతో విచారణ జరిపి వారిచ్చిన సూచనలతో సవరించాలి.
* కౌలు రైతులందరికి ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. ఙరైతు భరోసా కేంద్రాలలో ఇద్దరు చొప్పున ఉద్యోగులను నియమించాలి.ఙఆచరణలో అన్ని సేవలు ప్రజలకు అందుబాటు లోకి రావాలి.
జి. ఓబులు / వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు /