
పాలకుల చిత్తశుద్ధి లోపంతో అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా గిరిజన నిరుద్యోగులకు ఉపాధి లభించడం లేదు. కేరళలో సహకార సంస్థల ద్వారా కాఫీ రంగంలో వందల మంది యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి. కాఫీ బోర్డు కాఫీ రైతులకు విడుదల చేసిన రూ.40 కోట్లను తక్షణం రైతుల ఖాతాలో జమ చెయ్యాలి. కాఫీ పంటకు కిలోకు రూ.500, మిరియాల పంటకు కిలో రూ.1000 ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని గిరిజన సంఘం, కాఫీ రైతుల సంఘం డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో ఆదివాసీలకు నిలయమైన తూర్పు కనుమలలో అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో అరబిక్ రకమైన కాఫీ పంట విస్తారంగా పండుతున్నది. లక్షా ఏభై వేల ఎకారాలలో 1.30 లక్షల ఆదివాసీ కుటుంబాల రెక్కల కష్టంతో 10,600 మెట్రిక్ టన్నుల కాఫీ పంట పండుతోంది. ఏడాదికి రూ.150 నుండి రూ.200 కోట్ల విలువైన ఉత్పత్తి జరుగుతోంది.
ఆదివాసీలు పండిస్తున్న ఆర్గానిక్ కాఫీని దేశీయ, విదేశీ బడా కంపెనీలు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల లాభాలు సంపాదిస్తున్నాయి. గత పదిహేనేళ్లుగా నాంది ఫౌండేషన్ సుమారు వెయ్యి గ్రామాలలో ఇరవై వేల ఎకరాలలో గిరిజన రైతుల నుండి అతి చౌకగా కాఫీ పంటను సేకరించి విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదిస్తున్నది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే పేరుతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి కాఫీ, మిరియాల పంటను కొనుగోలు చేస్తున్నది.
కాఫీ రైతులకు గిట్టబాటు ధరలు కల్పించడానికి సరైన విధానం లేదు. గత ఏడాది ఐటిడిఏ ద్వారా ధరలు కల్పించే అపెక్స్ కమిటీ కాఫీ పస్పెంట్ రకానికి రూ.250, చెర్రీ రకానికి రూ.120 వరకు కొనుగోలు చేసింది. అపెక్స్ కమిటీ ప్రకటించిన ధర గిట్టుబాటు అవ్వలేదు. గిరిజన సహకార సంస్థ (జిసిసి) దేశంలోని వివిధ నగరాలలో కాఫీ స్టాళ్లు పెట్టి కొంత వ్యాపారం చేస్తూ ప్రచారం చేస్తుంది తప్ప గిరిజన కాఫీ పంట పూర్తి కొనుగోలుకు సన్నాహాలు చెయ్యడంలేదు. పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. 2021లో కేవలం 100 మెట్రిక్ టన్నుల కాఫీ మాత్రమే కొనుగోలు చేసింది. రైతులకు తోటల అభివృద్ధికి రుణాలు కూడా అందించడంలేదు. ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో 1/70 పెసా చట్టం ప్రకారం, బయట నుండి ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఏజెన్సీలో వ్యాపా రాలు, ఆర్థిక కార్యకలాపాలు చెయ్యడం చట్టవిరుద్ధం. అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఇటీడీఏ అడ్డుకట్ట వేయాల్సి ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవ డంతో ఏజెన్సీలో వివిధ వ్యాపార సంస్థలు విచ్చలవిడిగా దోపిడీ కొనసాగిస్తున్నాయి. ఏజెన్సీ కాఫీ మార్కెట్‌పై విదేశీ, స్వదేశీ మార్కెట్ శక్తుల కబంధ హస్తాల్లో గిరిజన కాఫీ రైతులు చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది.
సరళీకరణ విధానాలు రాక ముందు ఏజెన్సీ కాఫీ పంటను కాఫీ బోర్డు ద్వారా కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించేది. రైతులకు బోనస్ కూడా అందించేవారు. 2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం కాఫీ బోర్డు కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలు కల్పించే విధానాన్ని రద్దు చేసింది. కాఫీ మార్కెట్‌ను అంతర్జాతీయ ధరలకు అనుసంధానం చేసింది. తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం కూడా దానినే కొనసాగించింది. ఇప్పుడు బిజెపి మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం కాఫీ రైతులకు ఇస్తున్న సబ్సిడీలు, పథకాలపై కోత విధిస్తున్నది. కాఫీ పంట అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న కేంద్ర కాఫీ బోర్డు సిబ్బంది నియామకాలు ఆగిపోయాయి. సిబ్బంది కొరత, ఐ.టి.డి.ఏ ద్వారా కాఫీ బోర్డు నిధుల ఖర్చు, పర్యవేక్షణా లోపం వలన రూ. కోట్లలో అవినీతి జరుగుతున్నది. 2012-13లో సుమారు రూ.50 కోట్ల అవినీతి జరిగిందని సిపిఎం, గిరిజన సంఘం పోరాటం చేశాయి. అనేక మంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. 2018 నుండి 2022 వరకు కాఫీ బోర్డు నుండి సుమారు రూ. 40 కోట్లు కాఫీ రైతుల ప్రోత్సాహక నిధులను ఐటీడీఏ కు అందించి మూడేళ్లు గడిచినా కాఫీ బోర్డుకు ఐటీడీఏ యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. కాఫీ రైతులకు డబ్బులు మంజూరు చెయ్యలేదు.
పాడేరు ఏజెన్సీ లోని 11 మండలాల పరిధిలోని లక్షా ముప్పై వేల కుటుంబాలు కాఫీ పంటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏజెన్సీలో రెండు రకాల కాఫీ తయారు చేస్తారు. మొదటిది పాస్మెంట్ రకం కాఫీ. బాగా పండిన కాఫీ పండును పల్పింగ్ చేసి పప్పు చేసి అమ్మితే ఎక్కువ ధర పలుకుతుంది. రైతులకు బాగా లాభం వస్తుంది. పండిన కాఫీ గింజను ఆరబెట్టి పప్పు చేసి విక్రయించడం రెండవ పద్ధతి. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెస్తున్న గిరిజన కాఫీ పంటకు సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వక, ప్రభుత్వం కాఫీ ప్రోత్సాహక నిధులు విడుదల చెయ్యక రైతులు లబోదిబో మంటున్నారు. కాఫీ పంట లాభసాటిగా ఉన్నదని తమ సంప్రదాయ పంటలు విడిచిపెట్టి రైతులు అటువైపు మళ్లారు. అంతర పంటగా మిరియాల పంట వేసి కొంత మేర సంపాదిస్తున్నారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర, ప్రోత్సాహక నిధులు అందించకపోతే భవిష్యత్‌లో వివిధ ప్రాంతాలలో పత్తి, మిరప తదితర రైతులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఇక్కడ కూడా జరిగే ప్రమాదం ఏర్పడుతుంది.
ఏజెన్సీ అరకు కాఫీ పంట వల్ల దేశానికి కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం సమకూరుతోంది. ప్రభుత్వం కాఫీ రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని ప్రకటిస్తున్నది. కానీ మరోవైపు 50 వేల మంది కాఫీ రైతుల తోటల అభివృద్ధికి ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులను (రూ.40 కోట్లు) గత నాలుగేళ్లగా విడుదల చెయ్యలేదు. ఎకరా కాఫీ పంట అభివృద్ధికి (మూడేళ్లకు) చేస్తున్న ఖర్చుకుగాను ఇస్తున్న రూ.42 వేలను రూ.26 వేలకు తగ్గించివేసింది. కాఫీ రైతులకు ఇవ్వాల్సిన వివిధ రకాల రాయితీ పథకాలైన డ్రాయింగ్ యార్డు, బేబీ పల్పింగ్, కట్టర్స్, టార్పాలిన్లు, స్కాలర్‌షిప్పులు, నీడ మొక్కల పంపిణీపై కోత విధించింది.
ప్రభుత్వం తక్షణమే కాఫీ రైతులకు ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలి. కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో కాఫీ రైతులకు ఇస్తున్న విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకం, గిట్టుబాటు ధరలు, ఎకరా కాఫీ తోట అభివృద్ధికి 2 లక్షల చొప్పున వడ్డీ లేని రుణాలు, కాఫీ-మిరియాల పంట నష్టపోతే ఇన్సూరెన్స్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అంతర్జాతీయంగా కాఫీ మార్కెట్ విస్తరిస్తున్న పరిస్థితిలో మరోవైపు ఏజెన్సీ ప్రాంతంలోని బొర్రా, అరకు, తాజంగి, వంజంగి, సాపరయి, కటికి తదితర ప్రాంతాల్లో టూరిస్టుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కాఫీ ద్వారా వివిధ రకాల ఉపాధి కల్పించవచ్చు.
వందల రకాల కాఫీ చాక్లెట్, కాఫీ పొడి తయారీ ద్వారా ఉపాధి కల్పించవచ్చు. గిరిజన ప్రాంతంలో కాఫీ, మిరియాల నర్సరీ పెంచి గిరిజన యువకులకు ఉపాధి కల్పించవచ్చు. సహకార సంస్థల ద్వారా ఆర్గానిక్ కాఫీ సర్టిఫికెట్లు మంజూరు చేయడం ద్వారా ఆర్గానిక్ కాఫీని వివిధ ప్రాంతాల్లో మార్కెట్ చేసి ఉపాధి పొందవచ్చు. పాలకుల చిత్తశుద్ధి లోపంతో అన్ని రకాల అవకాశాలు ఉండి కూడా గిరిజన నిరుద్యోగులకు ఉపాధి లభించడంలేదు. కేరళలో సహకార సంస్థల ద్వారా కాఫీ రంగంలో వందల మంది యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలి. కాఫీ బోర్డు కాఫీ రైతులకు విడుదల చేసిన రూ.40 కోట్ల నిధులను తక్షణం రైతుల ఖాతాలో జమ చెయ్యాలి. కాఫీ పంటకు కిలోకు రూ.500, మిరియాల పంటకు కిలో రూ.1000 ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని గిరిజన సంఘం, కాఫీ రైతుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి.
వ్యాసకర్త: కిల్లో సురేంద్ర, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెల్ : 9490630715