
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎగిసే విప్లవ కెరటం చేగువేర అని, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన స్ఫూర్తితో విభజన హామీల అమలు కోసం యువత పోరాటాలలో భాగస్వామ్యం అవ్వాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర తెలిపారు. చేగువేర వర్ధంతి సందర్భంగా ఎస్ఎఫ్ఐ కలాశాల కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురొడ్డి, క్యూబా పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరుడు చేగువేర అన్నారు. డాక్టర్ వృత్తిలో వుండి పేదల కోసం అహర్నిశలు కష్టపడి గెరిల్లా పోరాట ఉద్యమాలు నిర్వహించి సామ్రాజ్యవాదుల చేతిలో వీర మరణం పొందాడు అన్నారు. చేగువేరను అందరూ చే అని పిలుస్తారని అన్నారు. ఆయన అక్టోబర్ 9న 1967 అమెరికా సామ్రాజ్యవాదుల చేతిలో వీర మరణం పొందాడన్నారు. ఆయన పోరాట పటిమ నేటికీ ఆదర్శప్రాయం అన్నారు. ప్రస్తుతం యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ను విస్మరించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాన్ని మోడీ దగ్గర తాకట్టు పెట్టిందన్నారు. మతోన్మాదం పేరుతో నేడు దేశంలో అణగారిన వర్గాల పై దాడులు జరుగుతున్నాయని, అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. వీటిని అరికట్టడంలో పాలకులు విఫలం చెందారన్నారు. చే ఒక దేశానికో, ఒక వర్గానికో పరిమితం కాదని.. యావత్ ప్రపంచానికి ఆయన ఒక రోల్ మోడల్ అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కలాశాల కమిటీ సభ్యులు గోవర్దన్ , హరి, అంజి, తదితరులు పాల్గొన్నారు.