Nov 05,2023 10:59

ఆసుపత్రులు, స్కూళ్లు, మసీదులపై బాంబులు
9,488కి చేరిన పాలస్తీనా మృతులు
పాలస్తీనాకు సంఘీభావంగా పలు దేశాల్లో ర్యాలీలు
గాజాసిటీ  : 
అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో గాజాలో ఇజ్రాయిల్‌ సృష్టిస్తున్న మారణహౌమం శనివారం నాటికి 29వరోజుకు చేరుకుంది. ఈ నాలుగు వారాల్లో 9,488 మంది పాలస్తీనీయులను అది అమానుషంగా పొట్టనపెట్టుకుంది. శనివారం కూడా స్కూళ్లు, ఆసుపత్రులు, మసీదులపై విచకక్షణా రహితంగా బాంబులు, ఫిరంగులతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో చాలా మంది చనిపోయారు. కూలిన భవన శిథిలాల కింద 2వేల మంది దాకా ఉన్నట్లు గాజా ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంకులు, బుల్డోజర్లు గాజాలో పౌర నివాలసాలను, వ్యాపార సంస్థలను దౌర్జన్యంగా కూల్చివేస్తున్నాయి. అదేసమయంలో గాజా సిటీని అన్ని వైపుల నుంచి ముట్టడించేందుకు వైమానిక, భూతల దాడులను ఇజ్రాయిల్‌ మరింత ఉధృతం చేసింది.. గాజాలో మారణహౌమాన్ని ఆపాలని, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని కోరుతూ అమెరికా, బ్రిటన్‌తో సహా చాలా దేశాల్లో వీకెండ్‌ నిరసన ర్యాలీలు, సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. పాలస్తీనాకు సంఘీభావంగా శనివారం వాషింగ్టన్‌లో అతి పెద్ద ర్యాలీ నిర్వహించేందుకు అమెరికా కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలు కదిలాయి. గాజాలో అమాయకులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌ దాష్టీకాలపై ఐరాస మానవ హక్కుల సంస్థ విచారం వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ ఇజ్రాయిల్‌లో రెండవసారి పర్యటించి వెళ్లిన తరువాత అమెరికన్‌ నిఘా డ్రోన్లు (ఎంక్యు-9 ) మొదటి సారి గాజా గగనతలంలోకి చొరబడ్డాయి.

ఆయుధాల అప్‌లోడింగ్‌కు తిరస్కృతి

పాలస్తీనాకు సంఘీభావంగా బెల్జియం పోర్టు కార్మికుల నిర్ణయం
పాలస్తీనాలో అమాయక పౌరులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయిల్‌కు ఆయుధాల ఎగుమతిని బెల్జియం కార్మికులు అడ్డుకున్నారు. ఇజ్రాయిల్‌కు ఆయుధాలను ఓడలో ఎక్కించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. యూరోపియన్‌ యూని యన్‌ ప్రధాన పాలనా కేంద్రంగా ఉన్న బ్రసెల్స్‌లో శనివారం వేలాది మందితో పాలస్తీనా సంఘీభావ ప్రదర్శన జరిగింది. దీనికి మద్దతుగా అయిదు బెల్జియం ట్రాన్స్‌పోర్టు యూనియన్లు (ఎసిడి ప్లస్‌, బిటిబి, బిజిపికె, ఎసివి ట్రాన్స్‌కమ్‌) కలసి సంయుక్తంగా ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. గాజాలో మారణహౌమాన్ని ఆపాలని అవి డిమాండ్‌ చేశాయి.
పోర్టు కార్మిక సంఘ నేత, అణు నిరాయుధీకరణ ఉద్యమ ప్రధాన కార్యదర్శి కేట్‌ హడ్సన్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌కు ఆయుధాలను అడ్డుకునేందుకు ఈ రోజు తాము చేపట్టిన ఆందోళన మాదిరిగానే ప్రపంచంలోని ఇతర పోర్టు కార్మికులు, ఆయుధ ఫ్యాక్టరీ కార్మికులు కూడా అనుసరించాలని పిలుపునిచ్చారు. బ్రిటన్‌లో మూడు ఆయుధ ఫ్యాక్టరీల్లో కార్మికులు పనిముట్లు కింద పడేసి తమ నిరసన తెలిపారు. అమాయక పాలస్తీనా పౌరులను ఊచకోత కోసేందుకు తాము ఆయుధాలు తయారుచేయలేమని స్పష్టం చేశారు. బ్రిటన్‌లో పాలస్తీనా యూత్‌ మూవ్‌మెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా, ఆన్సర్‌ కొయిలేషన్‌, పీపుల్స్‌ ఫోరమ్‌, ఇంటర్నేషనల్‌ పీపుల్స్‌ అసెంబ్లీ తదితర సంఘాలన్నీ కలసి నవంబరు9న గ్లోబల్‌ షట్‌డౌన్‌ పాటించాలని పిలుపునిచ్చాయి. ఆ రోజు ప్రపంచ వ్యాపితంగా ప్రదర్శనలు, వాకౌట్‌లు, సమ్మెలు, రాజకీయ నాయకుల వ్యాపార సంస్థల ముట్టడి, పని ప్రదేశాల్లో నల్ల రిబ్బన్‌ ధరించడం వంటి రూపాల్లో నిరసనలు చేపట్టనున్నారు. పాలస్తీనా కవి, రచయిత మహ్మద్‌ ఇల్‌ కుర్దు మాట్లాడుతూ, చరిత్ర మనల్ని దాటి వెళ్లిపోతుంటే అచేతనంగా మనం చూస్తూ ఉండకూడదు, వీధుల్లోకి వచ్చి మారణహౌమాన్ని సహించేది లేదని గొంతెత్తి నినదించాలని అన్నారు.

ఒక దేశం.. రెండు దేశాలు... మూడు దేశాలు?
పాలస్తీనా సమస్యకు రెండు దేశాల ఏర్పాటే పరిష్కారమని అందరూ చెబుతుంటే, నెతన్యాహు మూడు దేశాల పాట పాడుతున్నారు. ఓస్లో ఒప్పందం (1994) మౌలిక ఉద్దేశం 1967కు ముందున్న భూ భాగాలతో కలుపుకుని తూర్పు జెరూసలెం, వెస్ట్‌ బ్యాంక్‌లను పాలస్తీనా అథారిటీ పాలన కిందకు తీసుకురావడం. అయితే, ఈ ఒప్పందం 'బంటుస్థాన్‌' (ఆఫ్రికన్‌ హౌమ్‌ల్యాండ్‌) ఏర్పాటు గురించి ప్రస్తావించింది. దక్షిణాఫ్రికాను పాలించిన శ్వేతజాతి దురహంకార ప్రభుత్వం దీనిని సృష్టించిందని గాజాకు చెందిన ప్రొఫెసర్‌ హైదర్‌ ఈద్‌ తెలిపారు. పాలస్తీనీయులను వెస్ట్‌ బ్యాంకు, గాజాల్లో కూడా లేకుండా చేయడానికే నెతన్యాహు దీనిని ముందుకు తెస్తున్నారని ఆయన అన్నారు. మధ్యలో కొంత మంది పాలస్తీనా, ఇజ్రాయిల్‌ కలిపి ఒకే దేశంగా ఏర్పడాలని, జాతి, మత ప్రమేయం లేని లౌకిక ప్రజాస్వామ్యం దానికి ప్రాతిపదిక కావాలని వాదించిన సందర్భాలు ఉన్నాయి.