Sep 24,2022 07:56
  • అదానీకి అన్న జగనన్న
  • కేరళ తరహా అభివృద్ధి కావాలి

ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ప్రజల జేబులు కొట్టే జేబుదొంగలాగా బిజెపి ప్రభుత్వ పాలన ఉందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో జరుగుతున్న 'దేశ రక్షణ భేరి' కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో శుక్రవారం నాడు భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు అనంతపురం, సత్యసాయి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలచ్చారు. పట్టణంలోని గణేష్‌ సర్కిల్‌ నుంచి పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వరకూ భారీ ప్రదర్శన సాగింది. ఎర్రజెండాలను చేతబట్టి ఉత్సాహంతో వచ్చిన జనం సిపిఎం జిందాబాద్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా తరలచ్చిన జనంతో పుట్టపర్తి వీధులన్నీ ఎరుపెక్కాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో పుట్టపర్తి కేంద్రంగా జరిగిన ఈ మహాప్రదర్శ, బహిరంగ సభను అద్యంతం అందరూ ఆసక్తిగా గమనించారు. ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి హాజరైన బృందాకరత్‌ కూడా ప్రదర్శనలో పాల్గన్నారు. ప్రదర్శనలో పాల్గన్న మహిళలు ఆమెతో కరచాలనం చేయడానికి ఉత్సాహం చూపారు. ఆమె కూడా ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. అనంతరం జరిగిన సభలో ఆమె కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటీష్‌ పాలకుల అడుగులకు మడుగులత్తిన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఇప్పుడు ప్రజలకు కొత్త చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. ముజఫర్‌ అహమ్మద్‌, ఎంఎన్‌.రారు లాంటి వారు దేశంలో కమ్యూనిస్టు పార్టీని నెలకొల్పి జాతి, మతాలకు అతీతంగా స్వాతంత్రోద్యమాన్ని నడిపారని గుర్తు చేశారు. విభజించు పాలించు అనే నినాదాన్ని బ్రిటీషర్ల నుంచి ఒంటబట్టించుకున్న బిజెపి ఇక్కడి ప్రజలను కులాలు, మతాల పేరుతో విభజించి పాలించేందుకు సిద్ధపడుతోందని దుయ్యబట్టారు. ఈ విధానాలను అమలు చేస్తూ దేశంలో పెట్టుబడిదారీ విధానాలు, సరళీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తోందని విమర్శించారు. పెట్రోల్‌ లీటరుపై రూ.28, డీజల్‌పై రూ.22 పన్నును విధించి సామాన్యుల జేబులను కొట్టేస్తోన్న జేబుదొంగగా బిజెపి ప్రభుత్వం మారిందని ఎద్దేవా చేశారు. ఈ ఒక్క సంవత్సరంలోనే పెట్రో పన్నుల ద్వారా ప్రజల నుంచి వసూలు చేసింది నాలుగు లక్షల కోట్ల రూపాయలని తెలిపారు. జిఎస్‌టి పేరుతో నిత్యావసర వస్తువులన్నింటిపైనా పన్ను విధించిందన్నారు. చివరకు చిన్న పిల్లలు తాగే పాల ప్యాకెట్‌పైనా ఐదు శాతం పన్ను విధించిందని గుర్తు చేశారు. పేద ప్రజలపై భారాలను వేసే బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లపై మాత్రం ప్రేమ చూపిస్తోందన్నారు. కార్పొరేట్‌ సంస్థలకు విధించే పన్నును 33 శాతం నుంచి 22 శాతానికి తగ్గించిందన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయలు పన్ను మినహాయింపు ఇవ్వడమే కాకుండా రూ.10 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. ఒకవైపు కోవిడ్‌ సమయం నుంచి సామాన్యులు కోలుకోలేక దినసరి కూలీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి వస్తే రెండు కోట్ల మందికి ఏడాదికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రకటించిన మోడీ, ఇప్పటి వరకు ఉద్యోగాలే భర్తీ చేయలేదన్నారు. 12 ప్రభుత్వరంగ సంస్థల్లో పది లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఉపాధి లేక 11 వేల మంది నిరుద్యోగులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను ఎదిరించి నిలబడగలిగేది ఒక్క వామపక్షాలు మాత్రమేనని, ప్రజలు ఐక్య పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.

  • ఆదానీకి అన్న జగనన్న..

రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయకుంటే, వాటిని అమలు చేయాలని నోరువిప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అడగడం లేదని బృందాకరత్‌ ప్రశ్నించారు. జగనన్న ఇళ్లు ఇస్తామని సెంటు స్థలమిచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు ఎక్కడ నిర్మించారని ప్రశ్నించారు. అదే అదానీకి ఉమ్మడి అనంతపురం జిల్లాలో 72 వేల ఎకరాలివ్వడానికి ఆయన సిద్ధపడ్డారని గుర్తు చేశారు. దీన్నిబట్టి అదానీకి ఆయన అన్న అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదే జిల్లాలో పరిశ్రమల కోసమని పాలసముద్రం, చిలమత్తూరు ప్రాంతాల్లో భూములను సేకరించారని గుర్తు చేశారు. ఆ భూముల్లో ఇప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదన్నారు. పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో పది సంవత్సరాల్లో పరిశ్రమ పెట్టకపోతే తిరిగివ్వాలని చట్టం చెబుతోందన్నారు. కానీ, ఇక్కడ అమలు చేయలేదని తెలిపారు. పరిహారంలోనూ వివక్ష కనిపిస్తోందన్నారు. ఉన్నత వర్గాలకు చెందిన పట్టా భూములకు ఎకరానికి పది లక్షల రూపాయల చొప్పున, పేదలు, దళితులకు సంబంధించిన అసైన్డ్‌ భూములకు ఎకరానికి రూ.లక్ష, రూ.రెండు లక్ష రూపాయల్లోపే పరిహారం ఇచ్చారని తెలిపారు. ఈ రైతులకు న్యాయం జరిగే వరకు సిపిఎం అండగా ఉండి పోరాడుతుందన్నారు.

  • కేరళ తరహా అభివృద్ధి కావాలి

కేరళ తరహా అభివృద్ధి ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాలని బృందాకరత్‌ పేర్కొన్నారు. అక్కడ దినసరి వేతనం రోజుకు రూ.700 ఉందన్నారు. అదేవిధంగా ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీలకు సగటు వేతనం ఈ రాష్ట్రంలో రూ.205 ఉండగా కేరళలో రూ.350 ఉందని తెలిపారు. విద్య, వైద్యం, ఇతర మానవాభివృద్ధిలోనూ కేరళ అన్ని రాష్ట్రాల కంటే ముందుందన్నారు. అటువంటి అభివృద్ధిని ఇక్కడా కోరుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సత్యసాయి జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, అనంతపురం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి సిపిఎం నాయకులు అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గన్నారు.

brinda karat open meeting in anantapur