
- బీసీఇఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్
ప్రజాశక్తి=కలికిరి: రిజర్వేషన్లకు తూట్లు పొడవడం తీవ్ర అన్యాయమని బిసిఈఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం అయినా కలికిరిలో ఉద్యోగుల నాయకులతో కలిసి మేమెంతో మాకంత పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఎంబిబిఎస్ రెండవ రౌండ్ అడ్మిషన్స్ లో రిజర్వేషన్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ఆయన తప్పుపట్టారు. రిజర్వేషన్ అమలులో పారదర్శక పద్దతి అనుసరించాలని, ముందస్తుగా గుర్తింపు సంఘాల నాయకులతో చర్చించి, విధివిధానాలు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని సూచించారు. 54000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు రిజర్వేషన్ కేటగిరిలోనూ, 60000 ర్యాంక్ వచ్చిన అభ్యర్థులకు ఓపెన్ కేటగిరిలో సీట్లు కేటాయించిన వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం. ఓపెన్ కాంపిటీషన్ లో ఎంబిబిఎస్ సీటు పొందుటకు అర్హత కలిగిన రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు ఓపెన్ కాంపిటీషన్ లో కేటాయించకుండా రిజర్వేషన్ కేటగిరిలో కేటాయించడం వలన రిజర్వేషన్ కేటగిరిలో సీట్లు పొందవలసిన అనేక మంది రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు వైద్య సీట్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నిబంధనల మేరకు మొట్టమొదట ఓపెన్ కేటగిరి సీట్లను కేవలం ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాల్సి ఉందని, అలాంటపుడు 54 వేల ర్యాంక్ పొందిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థికి రిజర్వేషన్ కేటగిరి లో సీటు కేటాయించి 60 వేల ర్యాంక్ పొందిన అభ్యర్థికి ఓపెన్ కేటగిరిలో ఏ విధంగా కేటాయిస్తారో సమాధానం చెప్పాలన్నారు. 2020 లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హై కోర్టు సూచన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హై లెవెల్ కమిటీ ఇచ్చిన నివేదికను అనుసరించి జిఓ నంబర్ 151ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందని, వన్ టైమ్ ఆల్ ఆప్షన్స్ అనే నిబంధన దీని వలన అమలులోనికి వచ్చిందని, ఒకసారి అభ్యర్థులు పెట్టిన ఆప్షన్స్ ను ఎవరూ మార్చడానికి అధికారం లేదని, అయితే యూనివర్సిటీ అధికారులు విరుద్ధంగా అభ్యర్థులు పెట్టుకొన్న కొన్ని ఆప్షన్స్ ను తొలగించి తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి ఓపెన్ కాంపిటీషన్ లో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థికి రిజర్వేషన్ లో సీట్లు కేటాయించి రిజర్వేషన్ అభ్యర్థులకు ద్రోహం తలపెట్టారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యోగ నాయకులు బాలాజీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన రెండవ రౌండ్ వైద్య విద్య అడ్మిషన్స్ ను తక్షణమే రద్దు చేసి నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ ఈవిధంగా ప్రతీ ఏడాది రిజర్వేషన్లు కు బొందపెట్టడం వలన వేలాదిమంది రిజర్వేషన్ విధ్యార్థులకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని పూడ్చగలరా అని ప్రశ్నించారు. బీసీలకు తరచూ అన్యాయం చేయడం నిరసిస్తామని, బీసీల విశ్వసనీయతను కోల్పోతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు శంకర, సుబ్రమణ్యం, హరి, రెడ్డిమోహన్, రామాంజులు, హరినాథ్, గంగరాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.