- వలంటీర్లకు కూడా
- 10వ తేదీలోపు మ్యాపింగ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకే బ్యాంకు రుణాల వసూళ్ల బాధ్యతను అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగులతో పాటు వాలంటీర్లను కూడా ఈ విధులకు వినియోగించనుంది. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండుగ తరువాత కొత్త బాధ్యతలను సచివాలయ ఉద్యోగులు, వాలటీర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మేరకురాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. జివిడబ్ల్యువి, విఎస్‌డబ్ల్యుఎస్ డైరక్టర్ ఈ మేరకుఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా జిఎస్‌డబ్ల్యుఎస్ ఆఫీసర్లు, డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, ఎంపిడిఓలతో పాటు అనిు లీడ్ బ్యాంక్ మేనేజర్లకు కూడా వీటి నకళ్ళకు పంపినట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకుఇచ్చిన రుణాల రికవరీలు బ్యాంకర్లు ఆశించిన స్ధాయిలో లేవని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. జగనను తోడు, వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ జగనన్న నగర్‌లాంటి పధకాలకు సంబందించి రుణాల వసూళ్లు చేయడంలో గ్రామ సచివాలయం ఉద్యోగులు, గ్రామ వాలంటీర్ల సహకారం కావాలని ఆ సమావేశంలో బ్యాంకర్లు ప్రభుత్వాన్ని కోరారు. .ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 10లోగా తమ ప్రాంత బ్యాంకులతో మ్యాపింగ్ చేసుకోవాలనిఆదేశించింది. నిజానికి కొంతకాలంగా ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు చెబుతున్నారు. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు ఈ పనిలో ఉన్నారు. పతి బ్యాంక్ పరిధిలో ఇద్దరు లేక ముగ్గురు వాలంటీర్లు తప్పనిసరిగా మ్యాపింగ్ చేసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాలు తీసుకున్న వారు సకాలంలో బ్యాంకులకు వాయిదా చెల్లింపులు సక్రమంగా చేసేలా చూడాలని ఆదేశించింది. దీనికోసం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఎప్పటికప్పుడు బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ, లబ్ధిదారులతో మాట్లాడుతూ రుణాలు చెల్లించేలా చూడాల్సి ఉంది. అయితే, ఇప్పటికే వివిధ రకాల పనులు చేయాల్సివస్తోందన్న అభిప్రాయం సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లలో వ్యక్తమవుతోంది. మరోవైపు తాము పదేపదే చెప్పినా లబ్ధిదారులు రుణాలు చెల్లించకపోతే పరిస్థితి ఏమిటని కూడా వారు ప్రశిుస్తున్నారు.










