అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చారిత్రాత్మక విజయం ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ జాత్యహంకార ధోరణికి, విచక్షణా రహిత దుందుడుకు వాదానికి చెంపపెట్టు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా అగ్రరాజ్యంగా చెప్పబడుతున్న అమెరికాలో ఈ నెల 3న పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలైనప్పటికీ, స్పష్టమైన ఫలితం వచ్చేసరికి శనివారం దాకా పట్టింది. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా అధ్యక్ష పీఠం అధిరోహించడానికి కావాల్సిన ఓట్లు 270. ఆ మార్కును దాటి బైడెన్‌కు 290 ఓట్లు రాగా ట్రంప్ 214 వద్ద చతికిలపడ్డారు. ఇంకా ఒకటి రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడి కాకున్నా బైడెన్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటిపోవడంతో విజయం ఆయన్ని వరించినట్లు స్పష్టమైపోయింది. అన్ని ప్రక్రియలూ పూర్తయిన పిమ్మట జనవరి 20న బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఈ సారి 67 శాతం ఓట్లు (16 కోట్ల ఓట్లు) పోలవగా వాటిలో పది కోట్లు పోస్టల్ బ్యాలెట్లు కావడం ఒక హిస్టరీ. ఎన్నికల ప్రచార సమయంలోనే బైడెన్ గెలుపుపై దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి. వాస్తవంలోనూ అదే నిజమైంది.
గెలుపు తనదేనంటూ గడుసుతనానికి పోయిన ట్రంప్ ఓటమిని చవిచూశాక కూడా అదే వైఖరిని పట్టుకొని వేలాడటం ఆయనకు మాత్రమే చెల్లింది. ఓట్ల లెక్కింపు జరుగుతుండగా తానే గెలిచానని ప్రకటించుకోవడమే కాకుండా తన విజయాన్ని బైడెన్ దొంగిలించారని, అక్రమంగా లాక్కున్నారని, లీగల్ ఓట్లు మాత్రమే లెక్కించాలని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని ఇలా అధికార శ్వేత సౌధాన్ని విడిచేందుకు నిరాకరించడం ట్రంప్ నిరంకుశ ధోరణికి పరాకాష్ట. నాలుగేళ్లల్లో అవలంబించిన ఈ తరహా పోకడలే ఎన్నికల్లో ట్రంప్‌ను ప్రజల తిరస్కారానికి గురి చేశాయి. 'అమెరికా ఫస్ట్' అంటూ అమెరికన్లలో కృత్రిమ భావోద్వేగాలను, జాతి పేర మితవాద భావనలను, వర్ణ వివక్షను నూరిపోసి సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చి 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. కుర్చీ ఎక్కాకా అదే ఉన్మాదాన్ని ప్రదర్శించి పలు వివాదాస్పద నిర్ణయాలు చేసి ప్రజల నిరసనలను కొని తెచ్చుకున్నారు. మత ప్రాతిపదికన ముస్లిం దేశాల వారిని అమెరికాలోకి అడ్డుకోవడంతో మొదలు పెట్టి హెచ్1బి వీసాలపై ఆంక్షలు, చైనాపై వ్యతిరేకత, తన మాట వినని దేశాలపై ఆంక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ వివాదాస్పద చర్యలు చాలానే ఉన్నాయి. ట్రంప్ హయాంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి. జాత్యహంకారం జడలు విప్పింది. నల్లజాతీయులపై శ్వేత జాతి పోలీసుల దాష్టీకాలు మితిమీరాయి. గన్ కల్చర్ ఇంకా తీవ్రమైంది. నిరుద్యోగం తీవ్రమైంది. ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభంలోకి అమెరికా కూరుకుపోయింది. కరోనా మహమ్మారి కట్టడిలో ట్రంప్ ప్రభుత్వం ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకుంది. ఇవన్నీ ట్రంప్‌పై ప్రజల్లో వ్యతిరేకతకు కారణమయ్యాయి. ప్రజలెదుర్కొంటున్న సమస్యల ముందు ట్రంప్ రాజేసిన ఉద్రేక ఉద్రిక్త పాచికలు పని చేయలేదు. సమస్యలను పరిష్కరిస్తామన్న బైడెన్ హామీకి ప్రజలు జై కొట్టారు. బైడెన్ ముందున్న అతి పెద్ద సవాల్ కరోనా నియంత్రణ. ట్రంప్ చైనాను నిందిస్తూ కాలక్షేపం చేశారు. కోటికి పైగా కేసులు లక్షకు పైగా మరణాలతో అమెరికాను వణికిస్తున్న కరోనా నివారణపై బైడెన్ టాస్క్‌ఫోర్స్ వేశారు. ఆ చర్యతో సరిపెట్టకుండా కార్యాచరణ లోకి దిగాలి.
అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఎన్నిక స్వాగతించదగినది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని ఒక మహిళ, అందులోనూ నల్లజాతీయురాలు అధిరోహించడం మంచిదే. ఆ దేశంలో మహిళలకు ఓటు హక్కు సిద్ధించాక ఇన్నేళ్లకు ఆ పదవి మహిళకు దక్కడం అరుదైన ఘనత. అమెరికాలో రిపబ్లికన్లు, లేకుంటే డెమొక్రాట్లు రెండు పార్టీల వ్యవస్థలో ఎవరు గెలిచినా అధికార మార్పిడే జరుగుతుంది తప్ప అనుసరించే విధానాల్లో, చైనా పాలసీలో, తృతీయ ప్రపంచ దేశాల పట్ల ఆ దేశ వైఖరిలో పెద్దగా మార్పు ఉండబోదన్నది చారిత్రక అనుభవం. గతంలో నల్లజాతీయుడైన బరాక్ ఒబామా అధ్యక్షుడైనప్పుడు కూడా అమెరికా తన పెద్దన్న పాత్రను, సామ్రాజ్యవాదాన్ని విడనాడింది లేదు. రిపబ్లికన్లయినా, డెమొక్రాట్లయినా అమెరికా బహుళజాతి సంస్థల ప్రయోజనాలకే పూచీ పడతారు. అందుకు యుద్ధోన్మాదాన్ని ప్రేరేపించడానికి సైతం వెనుకాడరు. మార్కెట్ విస్తరణ, దోపిడీకి ప్రపంచ పోలీస్ అవతారం ఎత్తుతారు. కాకపోతే పిచ్చోడి చేతిలో రాయి వలే విచక్షణా రహితంగా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లుగా మంకుపట్టుతో ప్రవర్తించే ట్రంప్ వంటి వారితో పోల్చినప్పుడు బైడెన్ వంటి వారు గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందం.










