Jan 17,2021 07:05

అటూ ఇటూ తిరిగి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలు ఆవు పూజ అర్హతల లోనూ, ఆలయ దాడుల పంచాయితీ లోనూ చిక్కుకుపోవడం అవాంఛనీయం. సెప్టెంబరులో అంతర్వేది రథం దగ్ధంతో మొదలైన ఈ వివాదం గత నెలలో రామతీర్థంతో పరాకాష్టకు చేరింది. బిజెపి, టిడిపి, జనసేన దీన్ని హిందూ క్రైస్తవ మతాల మధ్య చిచ్చుగా చూపే ప్రయత్నం చేస్తే తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాజకీయ కుట్రగా ప్రభుత్వం ఆరోపించింది. ఇటు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, అటు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేరుగా ఈ వాదనలు చేశారు. ఈ ఇద్దరూ తమ హిందూత్వ పంథా లోకి వచ్చారని బిజెపి నేతలు గొప్పలు పోయారు. రామతీర్థంలో వైసిపి మంత్రులు, కీలక నేతలు కూడా ప్రత్యక్షమైన ఉద్రిక్తత పెరగడానికి కారకులయ్యారు. మీడియా సంస్థలు వారి వారి అనుబంధం బట్టి ఆలయ దాడులపై వివాదం పెంచడానికే పాకులాడాయి. టిడిపి నేతలు ముఖ్యమంత్రి క్రైస్తవ మత విశ్వాసాలతోనే ఇదంతా జరుగుతుందన్నట్టు ఆరోపణలు చేశారు. బిజెపి ని మించిపోయి స్వాములను కూడా తీసుకుని సభల్లో హిందూత్వ భాషణ కురిపించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి డిజిపి ముగ్గురూ క్రైస్తవులని టిడిపి తీర్మానం పేర్కొంది. సిఐడి విభాగం అధిపతి కూడా ఆ మతమే గనక తను దర్యాప్తు చేస్తే చెల్లదన్నట్టు చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్పించారని తమ ప్రభుత్వమే హిందూ మతాన్ని కాపాడుతుందని, వైసిపి నాయకులు ఎదురు దాడి చేశారు. ఈ దాడులను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని, బిజెపి టిడిపిలు కూడా మత విద్వేషాలు పెంచే మాటలు మానుకోవాలని సిపిఎం మొదట్లోనే చెప్పింది. తర్వాత సిపిఎం, సిపిఐ తదితర వామపక్షాలన్నీ కలసి అదే విధమైన ప్రకటన చేశాయి. మత సామరస్యం, లౌకికతత్వాలకు నిలయమైన ఆంధ్ర ప్రదేశ్‌లో వాతావరణం కలుషితం కాకుండా కాపాడాలంటే పోలీసులు, ప్రభుత్వం దుండగులను పట్టుకొని దాడులను అరికట్టాలని, నిజమైన దోషులెవరో వెల్లడించాలని కోరాయి. ఈ ఘటనలపై ప్రత్యేక చర్యలకు గాను 'సిట్‌' వేయాలని సూచించాయి. ఆలస్యంగా ప్రభుత్వం 'సిట్‌' ఏర్పాటు చేసి సిఐడి నుంచి దర్యాప్తు కేసులు దానికి బదలాయించింది. రాష్ట్ర ప్రజలు ఏ మతానికి చెందినవారైనా శాంతి సంరక్షించబడాలని కోరుకున్నారే గాని ఏ ప్రచారాలతోనూ కొట్టుకుపోలేదు.
 

డిజిపి వ్యాఖ్యలు-వివరాలు
వీటన్నిటి తర్వాత మొన్న సంక్రాంతి నాడు డిజిపి గౌతం సవాంగ్‌ దాడులపై రెండు దఫాలుగా మీడియాతో మాట్లాడుతూ తమ దర్యాప్తులో తేలిన విషయాలను, చేసిన అరెస్టులను వెల్లడించారు. ఈ దాడులలో ప్రత్యేకంగా మత కోణం లేదని డిజిపి చెప్పిన దాని సారాంశం. తమ సుదీర్ఘ సర్వీసులో ఎప్పుడూ తన మతం గురించి ఆరోపణలు ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. 2020 సెప్టెంబరు తర్వాత జరిగిన 44 ఘటనలులో 29 దాడులను ఛేదించి నిందితులను పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. గుప్త నిధుల కోసం తవ్వినవీ, మూఢ నమ్మకాలతో చేసినవీ, ఆస్తి వివాదాలలో జరిగినవీ, గతంలో ఎప్పుడో దెబ్బ తిన్న వాటిని ఇప్పుడు చెప్పినవీ వున్నాయని ఉదాహరణలతో చెప్పారు. ఇలాంటి వాటిని ప్రచురించడంలో మీడియా కూడా సంయమనం పాటించాలని కోరారు. గతంలో కన్నా ఈ కాలంలో ఆలయ ఘటనలు ఎక్కువగా ఏమీ జరగలేదని వాటి భద్రతకు ముప్పు వచ్చిందనడం సరికాదని ఆయన లెక్కలు ఇచ్చారు. రామతీర్థం ప్రధాన ఆలయం బాగున్నదనీ పూజలు జరుగుతున్నాయని రెండు కిలోమీటర్ల దూరం లోని గుట్టపైన విగ్రహమే పగలగొట్టారని చెప్పారు. రాష్ట్ర వ్యాపితంగా యాభై అయిదు వేల ఆలయాలలో సి.సి కెమెరాలు, లైటింగ్‌ అమరుస్తున్న క్రమంలో కేవలం ఒక రోజు ముందు ఈ దారుణానికి పాల్పడ్డారని తెలిపారు. ఇక అరెస్టయిన వారిలో రాజకీయ పార్టీల వారు కూడా వున్నారని అయితే వాటిపై మాట్లాడితే చర్చ దారి తప్పిపోతుందని మొదటి దఫా ఆ వివరాలు దాటేశారు. రెండో దఫాలో మాత్రం టిడిపి, బిజెపి లకు చెందిన వారు ఈ దాడులలో పట్టుబడ్డారనీ, వాటిపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఉద్రిక్తత పెంచేందుకు ప్రయత్నించడంలోనూ రాజకీయాలు వున్నాయని వెల్లడించారు. అరెస్టయిన వారి పేర్లు, కావలసిన వారి వివరాలు చెప్పారు. డిజిపి వ్యాఖ్యలను ప్రచురించడంలోనే పత్రికలు, మీడియా తమ వైఖరిని బయటపెట్టుకున్నాయి. 'మారిపోయిన డిజిపి కేసు' అని ఆంధ్రజ్యోతి శీర్షిక ఇవ్వగా 'టిడిపి కుట్ర' అని సాక్షి పతాక శీర్షికనిచ్చింది. ప్రజాశక్తి మాత్రం దాడులలో పార్టీల ప్రమేయం అంటూ ఆయన ఇచ్చిన పేర్లు యథాతథంగా చ్రచురించింది. ఆ తర్వాతనే మలిఘట్టం మొదలైంది.
 

పార్టీల స్పందనలో విపరీతాలు
డిజిపి ప్రభుత్వ నాయకుడుగా వ్యవహరిస్తున్నాడని బిజెపి, టిడిపి ఒక్కుమ్మడిగా దాడి ప్రారంభించాయి. హిందూత్వ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. వైసిపి నాయకులు ఇద్దరి పేర్లు ప్రస్తావించి వారిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ టిడిపి నేతలు తమ వారి అరెస్టులపై విరుచుకు పడ్డారు. డిజిపి క్షమాపణ చెప్పాలని బిజెపి నాయకులు అన్నారు. ఇక, కుట్ర ఆరోపణలను ఈ అరెస్టులు నిరూపించాయని మంత్రి అనిల్‌ కుమార్‌ వంటి వారు వ్యాఖ్యానించారు. టిడిపి, బిజెపిలు ఈ అరెస్టయినవారిపై ఎందుకు చర్య తీసుకోలేదని వైసిపి ప్రశ్నించింది. మొత్తంపైన దాడుల గురించి తీవ్రమైన ఆరోపణలు చేసిన పార్టీల నేతలు తమ వారిని అరెస్టు చేయడం మాత్రం ఆమోదించకపోవడం ఆశ్చర్యకరం. వైసిపి నేతలు కూడా ఇందులో వున్నారని ఆధారాలుంటే తప్పక పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదా చట్టాన్ని ఆశ్రయించడం చేయొచ్చు. అంతేగాని ఇతరులపై ఇన్ని ఆరోపణలు చేసిన వారు తమ వారి జోలికి రాకూడదంటే ఎలా కుదురుతుంది? వారిని అనవసరంగా పోలీసులు ఇరికించి వుంటే కోర్టులలో వాదించవచ్చు. ఈ క్రమంలో తప్పుగా మాట్లాడిన ఒక క్రైస్తవ మతాధికారి వీడియోను బాగా ప్రచారంలో పెట్టారు. అతన్ని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. మొదట్లో పిచ్చివాళ్లు, బిచ్చగాళ్లు చేశారని అన్న పోలీసులు ఇప్పుడు అరెస్టులు చేయడమేమిటని మరో సవాలు వినిపిస్తున్నది. అసలు ఆలయాలపై దాడులు చేసేవారు ఉన్మాదులే తప్ప సాధారణ వ్యక్తులుగా వుండరు. వందకు పైగా జరిగిన ఘటనల్లో రకరకాల వారుంటారనేది ఊహించదగిన విషయం. ఏమైనా ఇలాంటి దాడుల నిరోధానికి ప్రశాంతత, పునరుద్ధరణ, మత సామరస్యం ముఖ్యం కాగా మత రాజకీయ వివాదంగా సాగదీసుకోవడం రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. చిన జీయర్‌ స్వామి కూడా ఈ మధ్యలోనే రామతీర్థం సందర్శించారు. ఏడాదిలోగా విగ్రహ పునర్నిర్మాణం జరగాలనీ, అప్పటి వరకూ కింద ప్రధాన ఆలయంలో పూజలు యథాతథంగా కొనసాగించాలని సూచించారు.
 

వ్యూహాత్మకంగానే మత రాజకీయాలు
ముఖ్యమంత్రి జగన్‌ ఈ ఘటనల తర్వాత...విజయవాడలో చంద్రబాబు హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణం, దుర్గ గుడి విస్తరణ పనులు చేపట్టారు. తర్వాత సంక్రాంతికి టిటిడి సౌజన్యంతో అన్ని చోట్లా గోపూజలు నిర్వహించారు. మరోవైపున గోమాంసం తినేవారికి గోపూజలు చేసే హక్కు లేదని టిడిపి నేతలు దాడి చేశారు. ఆ పార్టీ ఎ.పి అధ్యక్షుడు అచ్చెం నాయుడు అనేక ఆరోపణలతో అసలు జగన్‌కు ఆవు పూజ అర్హత లేదని తీర్పు చెప్పారు. మత పార్టీలకు, సాధు సంతులకు సంబంధించిన ఈ వాదోపవాదాలు మాజీ ప్రస్తుత పాలక పార్టీల మధ్యన వినే పరిస్థితి విడ్డూరమే. ఆలయాల వివాదంలో ఏ పార్టీలైనా రాజకీయ ప్రయోజనాల కోణం లోనే వ్యవహరించడం పొరబాటు. పొంచి చూస్తున్న బిజెపి కి అంతకన్నా కావలసింది వుండదు. కాని టిడిపి కొత్తగా తెచ్చుకున్న రాజకీయ వ్యూహకర్త రాబిన్‌ శర్మ అధికారికంగా రూపొందించిన వ్యూహం ప్రకారమే హిందూత్వ భాష చేపట్టినట్టు ఆ పార్టీ నేతలు అనధికారికంగా చెబుతున్నారు. ఇక వైసిపి సలహాదారు ప్రశాంత కిశోర్‌ కూడా ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలసి అలాంటి సలహాలే ఇచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం వంటి విధానపరమైన అంశాలు గాక ఉద్వేగాలు పెంచడం, ప్రత్యర్థులపై ఆధిక్యత సాధించడమే లక్ష్యంగా భావించడం వల్ల దాపురించిన పరిస్థితి ఇది.
 

అప్పుల ఊబి.. సమస్యల వలయం..
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌ రూ. 3.73 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోవడం, అమరావతి ప్రతిష్టంభన, పోలవరం నిధుల విడుదల, రాయలసీమ ప్యాకేజీ వంటి చాలా సమస్యలలో కూరుకుపోయి వుంది. సంక్షేమ పథకాలను అలా వుంచితే మునిసిపల్‌ కార్మికుల జీతాలు పట్టణాలపై భారాల వడ్డన, కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రం నెత్తిన వేసుకున్న పథకాలు వెన్నాడుతున్నాయి. వ్యవసాయ సమస్యలకు తోడు దేశ వ్యాపితంగా రైతాంగ ఆందోళనతో ప్రాంతీయ పార్టీలేవీ పాల్గొనడం లేదు. వైసిపి, టిడిపి కూడా బిజెపి మెప్పుకోసమే పాకులాడుతున్నాయి. అమరావతి శంకుస్థాపనలో మట్టి, నీరు ఇచ్చి దెబ్బతీసిన ప్రధాని మోడీ 'దేశమంటే మట్టి కాదోరు' అని గురజాడ పద్యం చదివి తెలుగువారిని మెప్పించాలని చూస్తున్నారు. ఈ పూర్వ రంగంలో రాష్ట్రాభివృద్ధి కోసం సమిష్టిగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేబదులు రాజకీయ స్వార్థంతో రామతీర్థం చాలంటున్న బిజెపి, టిడిపి, జనసేనలు...ప్రస్తుతానికి తనకూ అదే తారకమంత్రమని పాలక వైసిపి భావించడం విచారకరం. మతాల మధ్య మంటలు పెట్టే బదులు మానవతా సందేశం చాటి చెప్పాల్సిన సమయమిది. 'అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నియు మెలగవలె'నన్న గురజాడ సందేశం కూడా అదే. మరి మన పాలక పార్టీలు సంకుచిత రాజకీయాల నుంచి బయటపడి ఆ బాధ్యత నిర్వహించడం జరిగేనా?
                                                                                  * తెలకపల్లి రవి