Oct 19,2023 08:46

ఐక్యరాజ్యసమితి : గాజా ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై 22 అరబ్‌ దేశాలు స్పందించాయి. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్‌ చేశాయి. ఈ ఊచకోత ఘటనపై అరబ్‌ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయని ఐక్యరాజ్యసమితిలో పాలస్తీనా రాయబారి రియాద్‌ మన్సూర్‌ తెలిపారు. గాజా నుండి పాలస్తీనా ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని, ప్రజలకు వెంటనే మానవతా సాయం అందించాలని అరబ్‌ దేశాలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఊచకోత ఘటన నేపథ్యంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అందుకే కాల్పుల విరమణ పాటించాలని కోరుతున్నామని అన్నారు. ఈ దాడికి ఇజ్రాయిలే కారణమని సిరియా, సౌదీ అరేబియా ఆరోపించాయి. ఇజ్రాయిల్‌ గాజా స్ట్రిప్‌లో యుద్ధ నేరాలకు, మారణహోమానికి పాల్పడుతోందని లిబియా విదేశాంగ శాఖ మండిపడింది. ఇరాక్‌ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. లెబనాన్‌లో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఇజ్రాయిల్‌ ఉద్దేశపూర్వకంగా ఆస్పత్రిపై బాంబు దాడి జరిపిందని, ఇది అంతర్జాతీయ మానవతావాద చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌-ఫతా అల్‌-సిసీ విమర్శించారు.