'జవాన్' సినిమాతో ఈ ఏడాది సూపర్ సక్సెస్ అందుకున్నారు దర్శకుడు అట్లీ. ఈ విజయంపై ఆయన సతీమణి ప్రియ ఆనందం వ్యక్తం చేశారు. 'రాజా రాణి' నుంచి 'జవాన్' వరకూ ఆయన కెరీర్‌ను తెలియజేస్తూ తాజాగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. '2013 నుంచి 2023 'రాజా రాణీ' టు 'జవాన్'. అట్లీ.. నేను నిన్ను ఒక ఫ్రెండ్, ప్రియుడు, భర్త, ఇక ఇప్పుడు ఒక తండ్రిగా చూస్తున్నా. సినీ పరిశ్రమలో నీదొక అద్భుతమైన ప్రయాణం. నీలా వృత్తిపట్ల అంకితభావం, కష్టపడి పనిచేసే వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదు. హార్డ్‌వర్క్, పనిపట్ల గౌరవంతోనే నువ్వు ఈ స్థాయికి రాగలిగావు. ఈ ప్రయాణంలో భాగమై నీతో కలిసి నడుస్తున్నందుకు ఎంతో గర్వపడుతున్నా. లవ్ యూ సో మచ్. నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని ఆమె పోస్ట్ పెట్టారు.










