కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ ఈ రెండింటి కారణంగా కనివినీ ఎరుగని రీతిలో తలెత్తిన పరిస్థితులు మహిళల స్థితిగతులను దారుణంగా మార్చడమే గాకుండా, బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక విధానాలను, పితృస్వామ్య భావజాలాన్ని బహిర్గతం చేశాయి. 2020 సంవత్సరం మహారాష్ట్రలో చాలా సానుకూలంగా ప్రారంభమైంది. నూతన సంవత్సరం ఆరంభం సందర్భంగా ముంబయిలో చాలా ఆనందోత్సాహాల మధ్య ఐద్వా 12వ జాతీయ మహాసభలు ముగిశాయి. ఆతర్వాత, జనవరి, ఫిబ్రవరిల్లో, ముంబయి, థానె, సాంగ్లి, షోలాపూర్, పూనె వంటి పలు జిల్లాల్లో మహిళలు షహీన్ బాగ్ తరహా నిరసనలకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత మార్చిలో లాక్‌డౌన్ ప్రారంభమైంది. చాలా జిల్లాల్లో ఐద్వా కార్యకర్తలు వలస కార్మికులకు, నిరుపేదలకు సాయంగా నిలిచారు. ఆహారం, ఇతర నిత్యావసరాలను అందచేశారు. ఈ నేపథ్యంలో, ఐద్వా కార్యకలాపాలకు సంబంధించినంతవరకు అటు ఉద్యమంలో గానీ ఇటు సభ్యత్వంలో గానీ రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా అయిన థానె-పాల్ఘర్‌లో ఆదివాసీ మహిళల గురించి మనం ఒక్కసారి పరిశీలిద్దాం.
ఉపశమనం కోసం పోరాటం
ఈ గిరిజన సమాజం సామాజికంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి వుంది, అత్యంత దయనీయమైన స్థితిలో వుంది. 75 ఏళ్ళ క్రితం అంటే 1945లో ప్రఖ్యాత ఆదివాసీ తిరుగుబాటు ప్రారంభమయ్యేవరకు భూస్వాములు, వడ్డీ వ్యాపారస్తులు ఈ సమాజాన్ని పట్టి పీడించారు. ఆ బానిసత్వం నుండి బయట పడేందుకు గోదావరి పెరులేకర్ అత్యద్భుతమైన నాయకత్వంలో అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) కఠిన పోరాటం జరిపింది. అయినా ఇప్పటికీ అక్కడి మహిళలు చాలా వెనుకబడి వున్నారు. అతి సాధారణమైన జీవితానికి కూడా వారు నోచుకోలేదు. బతకడానికి అవసరమైన కనీసంలో కనీస అవసరాలు మాత్రమే వారికి తీరుతున్నాయి. వీరిలో చాలా మంది కేవలం పప్పు, అన్నం పైనే ఆధారపడి బతుకుతున్నారు. అది కూడా రోజులో రెండుసార్లు మాత్రమే వుంటుంది. వివిధ రకాలైన కూరలు కూడా వారికి అందుబాటులో వుండవు. ఆ కూరలు చేసుకోవడం కూడా వారికి విలాసవంతమైన విషయమే. వాళ్ళకి అందుబాటులో ఏ కూరలు వుంటే వాటిని ఆ పప్పులో వేసి అన్నంతో కలిపి తింటారు. చాలా సార్లు నూనె లేకుండానే వారి వంట పూర్తవుతుంది. నూనె లేకుండా చేసుకోవడం అంటే ఏదో డైటింగ్ ప్రయోజనాల కోసం కాదు, ఆ నూనె వారికి అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం.
ఇక్కడ వ్యవసాయం అంటే వారి స్వాధీనంలో వున్న చిన్నపాటి భూమిలో కేవలం వరి పండించుకోవడమే. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం ఆమోదించి 16 ఏళ్ళు గడుస్తున్నా, ఆ భూములను వారు తమ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడానికి ఇంకా వేచి చూస్తున్నారు. ఈ భూమి కోసం వారి పోరాటం ఇంకా కొనసాగుతోంది. ఈ పోరాటంలో మహిళలే ముందుంటున్నారు. అటవీ అధికారుల అణచివేత చర్యలు ఎదుర్కొనేది ముందుగా ఆ గిరిజన మహిళలే. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర రైతు వ్యతిరేక చర్యలు, విధానాలతో ఈ పోరాటం మరింత ఉధృతంగా మారింది. భారీ వర్షాల్లో వరి నాట్లు వేయడం మినహా, గ్రామాల్లో వారికి ఎలాంటి ఉపాధి లేదు. పంట కోతలు, నూర్పిళ్ళు వంటి పనులకు మహిళలను వదిలిపెట్టి పురుషులు పని వెతుక్కుంటూ వెళతారు. తిరిగి మళ్ళీ వర్షాకాలంలోనే వారు ఇళ్ళకు వచ్చేది. వర్షాకాలం తర్వాత దాదాపు సగానికి సగం గిరిజన జనాభా జీవనోసాధిని వెతుక్కుంటూ వలసలు వెళ్ళిపోతారు. ఒక్కోసారి వారి కుటుంబాలతో, ఒక్కోసారి ఆ కుటుంబాలు లేకుండానే వెళతారు. వేలాదిమంది గిరిజనులు సముద్రంలో చేపలు పట్టడానికి వెళతారు. పళ్ళు, కూరగాయలు అమ్ముకోవడం వంటి అందుబాటులో వున్న పనులతో మహిళలు ఇల్లు గడుపుకుంటూ వస్తారు.
లాక్‌డౌన్ ప్రభావం
మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్ వారికి భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. వారందరూ ఉపాధి కోల్పోయారు. వారి ఆదాయాలు ఆగిపోయాయి. స్థానిక కార్మికులు, వ్యవసాయ కూలీలలో చాలా మంది మహిళలే. వీరందరికీ ఉపాధి పోయింది. ఇక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినవారు తమకు దొరికిన వాహనాలను పట్టుకుని ఇళ్ళకు చేరుకుంటే...మరికొందరు మైళ్ళ దూరాన్ని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. దహను తీర ప్రాంతంలో వేలాదిమంది జాలర్లు సముద్రంలో చిక్కుకుపోయారు. మూడు వారాల పాటు ఐద్వా కార్యకర్తలు వారికి ఆహారాది సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనంతరం వారిని వెనక్కి తీసుకురాగలిగారు. ఇందుకోసం చిన్న పడవల దగ్గరకు రావడానికి మహిళలు మూడు నాలుగు అడుగుల లోతైన నీటిలో నడుచుకుంటూ వచ్చారు. చాలామంది మహిళలు వారు కాస్తో కూస్తో దాచుకున్న మొత్తాలు కూడా ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. తమవారు ఇళ్ళకు తిరిగి చేరుకునేందుకుగాను రవాణా కోసం వారు వడ్డీ వ్యాపారస్తుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఇళ్ళకు తిరిగి వచ్చిన తర్వాత ఏం తినాలన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ప్రభుత్వం, ఎన్‌జిఓలు సరఫరా చేసిన ఉచిత రేషన్‌పై వీరు ఆధారపడ్డారు. దీనికి తోడు వర్షాలు ఆలస్యమయ్యాయి. పైగా కరోనా సోకడం మొదలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు. కరోనా మినహా మిగిలిన వ్యాధులతో బాధపడేవారికి ప్రజారోగ్య వ్యవస్థలు పనిచేయకుండా పోయాయి. దీనివల్ల బాగా దెబ్బతిన్నది గర్భిణులే. ఇటువంటి పరిస్థితుల్లోనే మారుమూల ప్రాంతమైన జవహర్ తహసిల్‌లో కరువు కారణంగా మూడేళ్ళ కుమార్తె రోష్నిని ఉరి వేసి చంపి తర్వాత 30 ఏళ్ళ గిరిజన మహిళ మంగ్లా వాగ్ ఆత్మహత్యకు పాల్పడిన వార్త అందరినీ కలిచివేసింది.
ఐద్వా సదస్సులకు మహిళల సమీకరణ
ఇటువంటి ఆందోళనకర పరిస్థితుల్లోనే, లాక్‌డౌన్ ఆంక్షలతో సంబంధం లేకుండా ఐద్వా రంగంలోకి దిగింది. థానె-పాల్ఘార్ జిల్లా లోని ఏడు ప్రాంతాలలో సదస్సులు ఏర్పాటు చేశాం. మొదట, ఆ సదస్సులు ఎంతవరకు విజయవంతం అవుతాయా అని ఐద్వా కార్యకర్తలు సందేహం వెలిబుచ్చారు. కానీ, మన మహిళలు గ్రామగ్రామాలకు తిరిగి 5 వేలకు పైగా కరపత్రాలను పంచారు. ఈ ప్రచారం వల్లనే వాస్తవికంగా నెలకొన్న భయంకరమైన పరిస్థితులు మనకు తెలిశాయి. నిస్సహాయులైన మహిళలు వేసే ప్రశ్నలు మన కార్యకర్తలను అవాక్కులను చేశాయి. సెప్టెంబరు మొదటి వారంలో ఐద్వా తహసిల్ స్థాయి సదస్సులు నిర్వహించగా, లాక్‌డౌన్ వున్నప్పటికీ అపూర్వమైన స్పందన వచ్చింది. పాల్ఘార్ (570), తలాసరి (400), షాపూర్ (400), వాదా (360), విక్రమ్‌గ (350), జవహర్(100), దహను (100)ల నుండి మొత్తంగా 2300 మంది మహిళలు పాల్గొన్నారు. మన నేతలు మాత్రమే గాక....అన్ని గ్రామాలకు చెందిన మహిళలను కూడా మాట్లాడాలని ప్రోత్సహించాం. వీటిని డాక్యుమెంట్‌గా రూపొందిస్తే, ఈ ప్రసంగాల్లో భారతీయ మహిళల వాస్తవిక గొంతులు వినిపిస్తాయి. వారి వ్యాఖ్యలు మన కరడుగట్టిన, సిగ్గుమాలిన పాలకులకు కనువిప్పు కావాలి. నిరసనలు, ఆందోళనల సమయంలో కరోనా వల్ల చనిపోవడానికైనా తాము సిద్ధమేనని ఆ మహిళలు ప్రకటించారు.
అవధాని గ్రామానికి చెందిన గులాబ్ రాయత్ మాట్లాడుతూ, ''వారి రాముడు వెళ్ళి అయోధ్యలో మందిరంలో కూర్చున్నాడు. ఆయన మనకెన్నడూ అన్నం పెట్టడు. మన సమస్యలు పరిష్కారమయ్యేలా మనకు సాయం చేసేది మన మహిళా సంఘాలే'' అని వ్యాఖ్యానించారు. రేషన్, ఉపాధి, ప్రజారోగ్య సౌకర్యాలు వంటి పలు అంశాలపై వారు చర్చించారు. కరోనా కారణంగా కొత్తగా ఈ ఆన్‌లైన్ వ్యవస్థ రావడంతో తమకు చదువులు అక్కర్లేదంటారేమోనని పలువురు యువతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమను కరోనా భయం కన్నా ఆకలి చావుల భయం మరింత పట్టి పీడిస్తోందన్నారు. వీరిలో చాలామంది స్మార్ట్ ఫోన్లు కొనగలిగే పరిస్థితి లేదు. కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పిల్లలు వుంటే వారిలో కేవలం మగపిల్లలకు మాత్రమే చదువుకునే అవకాశం, అర్హత వస్తున్నది. సహజంగానే కుటుంబ భారాన్ని తగ్గించేందుకు ఆడపిల్లలనే మధ్యలో చదువు మానిపించేస్తుంటారు. ఇప్పుడు కూడా వారికే ఆన్‌లైన్ చదువులు నిరాకరించబడుతున్నాయి.
ముఖ్యమైన డిమాండ్‌పై విజయం
ఈ సదస్సులన్నింటిలోనూ, ఆగస్టు 28 నాటి మన డిమాండ్ల పత్రంలో పాటుగా ఖవ్టి (ప్రకృతి వైపరీత్యాల్లో గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార ధాన్యాలు, నగదు సబ్సిడీ)గా రూ. 5 వేలను ఇంటి యజమానురాలికే ఇవ్వాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిం చింది. ఇప్పుడు గిరిజన కటుంబాలన్నింటికీ రూ. 4 వేల విలువైన ఖవ్టి (రూ. 2 వేల నగదు, రూ. 2 వేల విలువైన ఆహార ధాన్యాలు) మంజూరైంది. థానె, పాల్ఘార్, నాసిక్ జిల్లాల్లో వీటి ఫారాలను పూర్తి చేసే బాధ్యత ఐద్వా తీసుకుంది. మహిళలు వాస్తవంగా తమకు రావాల్సిన రిలీఫ్ పొందేవరకు నిరంతర పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విజయమే, అయినా ఇంకా సాధించాల్సింది చాలా వుంది. కరోనా అనంతర పరిస్థితుల్లో మహిళలకు కొత్త రకాలైన సమస్యలు తలెత్తుతాయి. వాటిని కూడా కొత్త తరహా పరిష్కారాలతో ఎదుర్కొనాల్సిన అవసరం వుంది. ఐద్వా మహారాష్ట్ర శాఖ ఈ పరిష్కారాలను వెతికి పోరాడేందుకు నిబద్ధతతో వుంది.
(వ్యాసకర్త మహారాష్ట్ర ఐద్వా రాష్ట్ర కార్యదర్శి)










