Oct 04,2022 13:09

ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : అక్టోబరు 16న ప్రపంచ ఆహార దినోత్సవానికి బదులుగా ఆకలి రోజుగా ఆచరిద్దామని వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌ మండల కార్యదర్శి కె.వెంకటనారాయణ తెలిపారు. మంగళవారం పీలేరు మండలం, రేగళ్ళు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర సరుకుల ధరలు పెంచేశాయని, అందుకు తగ్గట్టుగా కూలీ రేట్లు కూడా పెంచాలని అన్నారు. 7వ పే కమిషన్‌ ప్రకారం కనీస కూలీ రూ.850 ఇవ్వాలని, సాంఘిక భద్రత కోడ్‌ అమలు చేసి రిటైర్‌ పెన్షన్‌ రూ.5000లు ఇవ్వాలని, ఉపాధి చట్టం ప్రకారం గ్రామీణ కూలీలకు కూడా కనీస వేతనం చెల్లించాలని, కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించిన కనీస వేతనం రూ.413 ఉంటే, రూ.245 మాత్రమే నిర్ణయించడం అన్యాయమని అన్నారు. మహిళలకు ప్రసూతి ప్రయోజనంగా నెలకు రూ.10,000లు చొప్పున 6 నెలలపాటు చెల్లించాలని, పురుషులతో సమానంగా మహిళలకు కూడా కూలీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ సభ్యులు మద్దెల మురళి, గ్రామ వాలింటీర్‌ ఎం.మల్లీశ్వరి పాల్గొన్నారు.