Oct 02,2023 12:57

మాడ్రిడ్‌ :  స్పెయిన్‌ నైట్‌క్లబ్‌లో ఆదివారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 13 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
 

నైట్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం
ఆదివారం స్పెయిన్‌లోని ముర్సియా నగరంలోని నైట్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది  మృతి  చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.  40 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, 12 అత్యవసర వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అన్నారు.   శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని,  మృతుల  సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. మరణించిన వారిలో అధికశాతం మంది ఒకే వర్గానికి చెందినవారు. మృతదేహాలు  బాగా కాలిపోయాయని,  డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి గౌరవసూచకంగా ముర్సియా మునిసిపల్‌ ప్రభుత్వం మూడు రోజుల అధికారిక సంతాప దినాలను ప్రకటించినట్లు నగర మేయర్‌ జోస్‌ బల్లెస్టా తెలిపారు.  మృతులకు ప్రధాని పెడ్రో శాంచెజ్ సంతాపం ప్రకటించారు.